22ఏ పరిధిలో 1.01 కోట్ల ఎకరాలు..నిషేధిత జాబితాలో ప్రజల భూములు
ఇంకా తీరని బాధితుల సమస్యలు..ప్రభుత్వ కార్యాలయాల చుట్టూప్రదక్షిణలు చేస్తున్న వైనం
అప్పుడు ధరణి..ఇప్పుడు భూభారతితో తిప్పలు..అధికారుల పొరపాటు ఉందన్న మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘‘ప్రజలు కొనుకున్న భూమి 22ఏ నిషేధిత జాబితాలో ఉంటే ఇంచు భూమి కూడా ఎక్కడికి పోదు. నేను భరోసా ఇస్తున్నా. ఒక సర్వే నెంబర్‌లో 500 ఎకరాలుంటే 5 లేదా 6 ఎకరాల గురించి కోర్టు ఆదేశాలుంటే మొత్తం భూమిని 22ఏలో చేర్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ సర్వే నెంబర్లకు బైనెంబర్లు ఇచ్చి సమస్య పరిష్కరిస్తాం. మీ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఆదేశాలు ఇస్తా’’అని ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని తీసివేయకుండా గతంలో ఉన్న భూముల వివరాలనే అధికారులు గతేడాది డిసెంబర్‌లో అప్‌లోడ్ చేశారు. దానివల్ల 22ఏ వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. అధికారులు పొరపాటు చేశారు. అందుకు నా పక్షాన సారీ చెప్తున్నా. ప్రజల ఆస్తులకు ఆటంకం కలిగించాలనేది ప్రభుత్వ ఉద్దేశం కాదు. ఎవరూ ఆందోళన చెందొద్దు. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తాం.’అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
‘నేను 20 ఏండ్ల కింద వంద గజాల స్థలం కొనుక్కున్నాను. కుటుంబ అవసరాల కోసం ఆ స్థలాన్ని ఇప్పుడు అమ్మాలని రిజిస్ర్టేషన్ కార్యాలయానికి వెళ్లాను. ఆ స్థలం 22ఏ నిషేధిత జాబితాలో ఉందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అంటున్నారు. నేను ఏం చేయాలి’ అని ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆందోళన చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలోని రాందాస్‌పల్లి గ్రామంలో 300 ఎకరాలకుపైగా రైతుల పట్టా భూములను 22ఏలో ప్రభుత్వం చేర్చింది. రిజిస్ట్రేషన్లను నిలిపేసింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పటాన్‌చెరులో లక్ష ఇండ్లు, 50 వేల ఎకరాల భూమిని 22ఏలో చేర్చారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూమిని ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితాలో చేర్చింది. జూబ్లీహిల్స్‌లో ఉన్న సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇల్లు కూడా 22ఏ జాబితాలో ఉందంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లోని భూములు, అపార్ట్‌మెంట్లు, లే అవుట్లు కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి.
తప్పు జరిగిందని అంగీకరించిన ప్రభుత్వం
రాష్ట్రవ్యాప్తంగా భూభారతిలో 2,49,97,312 ఎకరాల భూమి నమోదైంది. అయితే 22ఏ నిషేధిత జాబితాలో 98,02,544 ఎకరాల భూమిని ప్రభుత్వం చేర్చింది. మరో 3,73,524 ఎకరాల వ్యవసాయ భూమి ప్రభుత్వం, ప్రయివేటు ఖాతాదారుల మధ్య వివాదంలో ఉందని ప్రకటించింది. అంటే 1,01,76,068 ఎకరాల భూమి ప్రస్తుతం నిషేధిత జాబితాలో ఉందని అర్థమవుతున్నది. అయితే 2023 డిసెంబర్ నాటికి ఎంత భూమి 22ఏ జాబితాలో ఉంది, ఆ తర్వాత ఎంత భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చిందన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. కానీ 23,136 ఎకరాల భూమిని 22ఏ నుంచి తొలగించినట్టు ప్రకటించింది. అయితే 22ఏలో భూములను చేర్చడంలో తప్పు జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. భూముల వివరాలను అప్‌లోడ్ చేయడంలో అధికారులు పొరపాటు చేశారని మంత్రి తెలిపారు. ప్రభుత్వం, అధికారులు చేసిన తప్పులకు ప్రజలు బలిపశువులుగా మారుతున్నారు.
తప్పు చేసిన అధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి ఇల్లును 22ఏలో చేర్చింది వాస్తవమే. పాత కలెక్టర్ ఈ తప్పు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. కానీ తప్పు చేసిన అధికారుల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్న అభిప్రాయం వినిపిస్తున్నది. మరోపక్క సొంత భూమిని కాపాడుకోవడం కోసం ప్రజలు మాత్రం తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్, సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇంకోవైపు చాలా మందికి వారి భూమి లేదా ఇంటిస్థలం 22ఏ నిషేధిత జాబితాలో ఉందన్న విషయమే తెలియదు. ఎందుకంటే వారు ఆ భూమి లేదా ఇంటి స్థలాన్ని అమ్మాలని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లినపుడు తెలుస్తుంది. అప్పటి వరకు వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై పెనుప్రభావం
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణిని తెచ్చింది. ధరణి వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. బీఆర్‌ఎస్ ఓడిపోవడానికి ధరణి కూడా ఓ కారణంగా ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతిని తెచ్చింది. అయినా భూ సమస్యలు పరిష్కారం కావడం లేదన్న అభిప్రాయం వినిపిస్తున్నది. ఇంకోవైపు 22ఏ నిషేధిత జాబితాలో భూములు లేదా ఇంటి స్థలాలను చేర్చడం కాంగ్రెస్ ప్రభుత్వంపై పెనుప్రభావం చూపుతుందని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రాజకీయంగా నష్టం కలుగుతుందని వాపోతున్నారు. బీఆర్‌ఎస్ ఓటమికి ధరణి కాంగ్రెస్ పతనానికి 22ఏ కూడా అలాగే కారణమవుతుందన్న అభిప్రాయం వినిస్తున్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పును తెలుసుకుని 22ఏ పరిధిలో చేర్చిన ప్రయివేటు భూముల సర్వే నెంబర్లను పరిశీలించి వాటిని తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



