Sunday, August 30, 2026
E-PAPER
Homeజాతీయంసినీ కార్మికులకు ఏఐ దెబ్బ

సినీ కార్మికులకు ఏఐ దెబ్బ

- Advertisement -

జూనియర్ ఆర్టిస్టుల ఉపాధిపై తీవ్ర ప్రభావం
డిజిటల్ జనసమూహాలకు పెరుగుతున్న గిరాకీ

న్యూఢిల్లీ : వాస్తవానికి ప్రతి నటుడికీ ఓ కథ ఉంటుంది. మిథున్ చక్రవర్తి 1970వ దశకం మధ్యలో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసిన వారే. నవాజుద్దీన్ సిద్ధికీ ‘స్కూల్‌’ అనే చిత్రంలో వెయిటర్‌గా ఓ చిన్న పాత్ర వేశారు. ఆ తర్వాత అనేక ఏండ్ల‌ పాటు చిన్న చిన్న వేషాలు, గుర్తింపు లేని పాత్రలు ధరించారు. పంకజ్ త్రిపాఠీ కూడా చిన్న పాత్రలతో సినీ కెరీర్‌ను ప్రారంభించి హిందీ సినిమాకు అత్యంత గుర్తింపు తెచ్చిన నటుల్లో ఒకరయ్యారు. ఇక ఇటీవలి కాలంలో మిహిర్ అహుజాదీ అదే దారి. హృతిక్ రోషన్ నటించిన ‘సూపర్ 30’లో ఆయన ఓ చిన్న వేషం వేశారు. ఇప్పుడాయన ప్రేక్షకులకు బాగా సుపరిచితుడైన నటుడు. కల్పలత గుర్తున్నారా ? రాజమౌళి ‘బాహుబలి’లో ఎక్స్‌ట్రాగా చేశారు. మాహిష్మతి నివాసితుల్లో ఆమె ఒకరు… అంతే. సినిమాలో ప్రధాన పాత్ర పోషించకపోయినప్పటికీ మంచి గుర్తింపు పొందారు. ప్రేక్షకులతో పాటు నిర్మాతల దృష్టిలో పడిన కల్పలత సాలార్, పుష్ప వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు.

రోజు గడిస్తే చాలు
పెద్ద స్టార్‌గా వెలుగొందాలని ముంబయి చిత్రసీమలోని వేలాది మంది వర్ధమాన నటులు, జూనియర్ ఆర్టిస్టులు, ఎక్స్‌ట్రాలకు ఆశలేమీ లేవు. ఎలాగైనా సినీరంగంలోకి ప్రవేశిస్తే చాలు అని వారు అనుకుంటారు. అయితే చాలామందికి ఏండ్లు గడిచినా ఆ కల నెరవేరదు. దీనికి కారణం ఏఐ అంటే ఆశ్చర్యం కలుగుతుంది కదూ. 300 మంది అవసరమయ్యే సన్నివేశాన్ని కేవలం 60 మందితో తీసేయవచ్చు. మిగిలిన పని అంతా డిజిటల్‌గా పూర్తవుతుంది. అప్పుడు మిగిలిన 240 మంది పరిస్థితి ఏమిటి? గుంపులో గోవింద మాదిరిగా సినిమాలో ఒక్క మాట కూడా మాట్లాడే అవకాశం రాని వారు ఎందరో ఉంటారు. అయినా వారు ఇప్పటికీ ముంబయి మహా నగరంలో జీవనాన్ని నెట్టుకొచ్చేందుకు ఈ రోజు గడిస్తే చాలునన్న ఆశతో రోజువారీ వేతనాలపై ఆధారపడుతున్నారు.

డిజిటల్ జనసమూహం !
ముందు జూనియర్ ఆర్టిస్ అయితే చాలు…ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టడం తేలికేనని అనుకోవడం సహజమే. జూనియర్ ఆర్టిస్ట్ కావాలంటే గాడ్‌ఫాదరో, ఫిల్మ్ స్కూలు డిగ్రీయో లేదా వైరల్ అయిన ఇన్‌స్టాగ్రామో అవసరం లేదు. సినిమా షూటింగ్ ప్రదేశానికి వెళ్లి చెప్పిన చోట నిలబడి, ఆ రోజుకు లభించే పారితోషికం తీసుకొని, తదుపరి అవకాశం కొంచెం మెరుగ్గా ఉంటుందని ఆశపడితే చాలు. ఇదేమీ హఠాత్తుగా వచ్చే గొప్ప అవకాశం కాదు. దొరికిన పని చేసుకుంటూ పోతే సరిపోతుంది. అయితే ఆ పని కూడా దొరక్కపోతే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నను తేలికగా కొట్టేయడం కష్టం. నితీష్ తివారీ ‘రామాయణ’ ట్రైలర్ చూసిన తర్వాత డిజిటల్ జనసమూహంపై చర్చ మొదలైంది. జన సముద్రంలా కనిపించే ఓ సమూహాన్ని ఉద్దేశించి రావణ పాత్రధారి యష్ చేసిన ప్రసంగం ఈ చర్చకు కారణమైంది. మీమ్స్, జోకులు ఎక్కువగా వీఎఫ్‌ఎక్స్ గురించే వస్తున్నాయి. కానీ వాటి వెనుక ఓ పెద్ద మార్పు దాగి ఉంది. తెరపై కనిపించే జనసమూహం కోసం సెట్‌లో వందలాది మంది నిజంగా నిలబడాల్సిన అవసరం లేదు.

వీఎఫ్‌ఎక్స్ బృందాలకు డిమాండ్
భారతీయ చిత్రాలు ఇప్పటికే గుంపులను సృష్టించేందుకు ఏఐని ఉపయోగిస్తున్నాయి. కన్నప్ప, బోర్డర్‌2, గదర్‌2 వంటి చిత్రాల్లో ఈ సాంకేతికత ఏదో ఓ రూపంలో కన్పించింది. సినిమాలో మనకు కన్పించే గుంపులో కేవలం 20 శాతం మందే నిజమైన వారు. మిగిలిన వారిని డిజిటల్‌గా సృష్టింవచ్చు. ఏదైనా సన్నివేశంలో వంద మందికి పైగా అవసరమైతే నిర్మాతలు వీఎఫ్‌ఎక్స్ బృందాలను సంప్రదిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఖర్చు. వందలాది మందిని ఏర్పాటు చేసుకోవాలంటే దుస్తులు, రవాణా, ఆహారం, మేకప్, లాజిస్టిక్స్ కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆ ఖర్చును ఏఐ తగ్గిస్తుంది. కొన్ని సన్నివేశాల కోసం 200`500 మందిని నియమించుకోవడం కంటే గుంపు కోసం ఏఐని ఉపయోగించడం చౌకగా ఉంటుందని స్క్వాడ్ వీఎఫ్‌ఎక్స్‌లో విజువల్ ఎఫెక్ట్ విభాగం అధిపతి అఖిలేష్ జైన్ చెప్పారు.

భావోద్వేగాలు చూపించలేదు
ఇక్కడ ఇంకో మాయాజాలం కూడా ఉంది. నిజమైన కళాకారుల 3డీని స్కాన్ చేసి వారి ముఖ నిర్మాణం, శరీర నిష్పత్తులు, చర్మం, హావభావాలు, కదలికలను తీసుకోవచ్చు. వందలాది లేదా వేలాది డిజిటల్ మనుషులను సృష్టించడానికి ఆ స్కానింగ్ ఉపయోగపడుతుంది. అయితే ఏఐకి భావోద్వేగాలు ఉండవని, అది స్పష్టమైన భావోద్వేగాన్ని చూపించలేదని మిహిర్ అహుజా చెప్పారు. ఏఐకి తాను భయపడబోనని, అదే తనను చూసి భయపడాలని ఆయన అంటారు. గుంపును సృష్టించడంలో ఏఐ పనితీరు మెరుగవుతున్నప్పటికీ ప్రతి షాట్‌లో నిజమైన ఆర్టిస్టులను భర్తీ చేసే స్థాయికి అది ఇంకా చాలా దూరంలోనే ఉంది. ఏఐ ఇప్పటికీ అత్యంత నాణ్యమైన ఫలితాన్ని ఇవ్వలేదని బాహుబలి చిత్రాల వీఎఫ్‌ఎక్స్ విభాగానికి అధిపతి అయిన శ్రీనివాస్ మోహన్ తెలిపారు. కాబట్టి జూనియర్ అర్టిస్ అనే వాడు రేపటికే కనుమరుగైపోడు. కెమేరాకు మీరు ఎంత దగ్గరగా వెళితే మీ పని అంత సురక్షితంగా ఉంటుంది. కానీ కెమేరాకు దూరంగా మీ వెనక నిలబడే వారి సంగతేమిటి?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -