ట్రైనింగ్ సెంటర్ అచ్చంపేటలో.. బిల్లులు తీసుకున్నది హైదరాబాదులో
గ్రూపు సంస్థపై ఈజిఎంఎం కమిషనర్ కు ఫిర్యాదు
నవతెలంగాణ-అచ్చంపేట
డిడియు – జి కె వై – దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన గ్రామీణ అభివృద్ధి పథకం పక్కదారి పడుతోంది. పర్యవేక్షణ లోపంతో అవినీతి రాజ్యమేలుతోందని, నిరుద్యోగులకు శిక్షణ పేరుతో నకిలీ బిల్లులు సృష్టించి లక్షల్లో ప్రభుత్వ సొమ్మును కాజేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేద కుటుంబాలకు చెందిన యువతీ యువకులకు మెరుగైన నైపుణ్య శిక్షణ కల్పించి, స్వయం ఉపాధి దిశగా యువతను తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావించింది. పేద యువకులకు, మహిళలకు శిక్షణ ఇచ్చి ప్రతినెలా కనీస గౌరవ వేతనం ఇచ్చే సంస్థలలో ఉపాధి కల్పించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. కానీ పలువురు నిర్వాహకుల వల్ల పథకం (డిడియు – జి కె వై – దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన) యొక్క లక్ష్యం నీరుగారిపోతోంది. అచ్చంపేటలోని మాతృభూమి రూరల్ డెవలప్మెంట్ సొసైటీలో అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. 70 మందికి శిక్షణ పేరుతో రూ.63 లక్షల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈజీ ఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాదులోని డ్వాక్రా బిల్డింగ్ లోయర్ ట్యాంక్ బండ్ లో ప్రధాన కార్యాలయం ఉంది. గత ఏడాది సెప్టెంబర్ 2025లో హైదరాబాద్ కు చెందిన “గ్రూప్ సంస్థ, ” దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకం కింద 70 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. గ్రూప్ సంస్థ నిర్వాహకులు అచ్చంపేటలోని మాతృభూమి రూరల్ డెవలప్మెంట్ సొసైటీవారికీ వసతితో పాటు శిక్షణ నిర్వహించేందుకు ఒక్కొక్క వ్యక్తికి రూ.17000/- చెల్లించే విధంగా గ్రూప్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. డబ్బులు చెల్లించకపోవడంతో రెండు సంస్థల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో గ్రూపు సంస్థ నిర్వాహకులపై మాతృభూమి రూరల్ సొసైటీ నిర్వాహకులు ఈజీ ఎంఎం కమిషనర్ తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఉపాధి కల్పన, మార్కెటింగ్ మిషన్ ద్వారా” గ్రూపు సంస్థ” నిర్వాహకులు ఒక్కొక్క వ్యక్తికి రూ.90 వేల చొప్పున 70 మందికి 63 లక్షలు బిల్లులు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉపాధి శిక్షణ పేరుతో ప్రజాధనాన్ని స్వాహా చేసిన సంస్థలపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ట్రైనింగ్ సెంటర్ల నిర్వహణపై పర్యవేక్షణ కరువు
దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకం కింద ఎక్కడెక్కడ శిక్షణ సెంటర్లు నిర్వహిస్తున్నారు.! ఏ సంస్థకు అప్పగించారు. శిక్షణ సెంటర్ల నిర్వహణను ఎంప్లాయిమెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ ఉద్యోగులు పర్యవేక్షణ చేయవలసి ఉంటుంది. శిక్షణ సెంటర్లో ఎంతమంది విద్యార్థులు నమోదయ్యారు. రెగ్యులర్ గా శిక్షణకు ఎంతమంది వస్తున్నారు. నివాస వసతి, భోజన వసతి సౌకర్యాలు పరిశీలన చేయాలి. సదురు పరిశీలనలో గుర్తించిన అంశాలను నివేదికలను కమిషనర్ కార్యాలయానికి అప్పగించాలి. కానీ సంబంధించిన అధికారులు నామమాత్రంగా పర్యవేక్షణ చేసి చేతులు దులుపుకుంటున్నరని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించకపోవడంతో ఈజి ఎంఎం లక్ష్యం నీరుగారుతోంది.



