మనలో చాలామందికి చిరుతిళ్లు బాగా నచ్చుతాయి. అందునా వాతావరణం కాస్త చల్లగా ఉన్న వేళ వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు రొటీన్‌గా మిర్చి బజ్జీ, పకోడీల్లాంటివి తెచ్చుకుని తినే బదులు ఇంట్లోనే ఎంచక్కా బోల్డన్ని వెరైటీలు చేసుకోవచ్చు. మీ కోసం కొన్ని నోరూరించే స్నాక్స్.. ఇంకెందుకాలస్యం.. చకచకా చేసేయండి!
ఆలూ టిక్కీ
కావల్సిన పదార్థాలు: ఆలూ – మూడు, ఉప్పు – రుచికి తగినంత, బ్రెడ్ పౌడర్ – మూడు చెంచాలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ – చెంచా, కారం – ముప్పావు చెంచా, ధనియాలు, జీలకర్ర పొడులు – ముప్పావు చెంచాల చొప్పున, గరంమసాలా – అర చెంచా, నూనె- వేయించడానికి సరిపడా, కొత్తిమీర తరుగు – పావు కప్పు
తయారు చేసే విధానం: ఆలూను ఉడికించి మెత్తగా మెదపాలి. అందులో కారం, ఉప్పు, ధనియాలు, జీలకర్ర పొడులు, గరంమసాలా, కొత్తిమీర తరుగు, బ్రెడ్ పౌడరు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో చిన్న చిన్న టిక్కీలు చేసుకోవాలి. అన్నీ అయ్యాక.. కాగుతున్న నూనెలో బంగారు రంగులోకి మారే వరకూ వేయించాలి. వేడి ఆలూ టిక్కీలను పల్లీ లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేయండి. టొమాటో కెచప్ కూడా బాగుంటుంది.
మసాలా పూరీ ఛాట్
కావల్సిన పదార్థాలు: మసాలా గ్రేవీ కోసం పచ్చి బఠాణీలు – కప్పు, ఉల్లిపాయ, టొమాటో – ఒక్కొకటి, ఉప్పు – రుచికి తగినంత, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ – స్పూన్ చొప్పున, గరంమసాలా, జీలకర్ర, పసుపు – అర చెంచా చొప్పున, కారం – ముప్పావు చెంచా, నూనె – మూడు చెంచాలు
టాప్పింగ్ కోసం: పూరీలు – పన్నెండు, ఉల్లి స్లైసులు – పావు కప్పు, టొమాటో ముక్కలు – గుప్పెడు, కొత్తిమీర – మూడు టేబుల్ చెంచాలు, నిమ్మరసం- చెంచా, సన్న కారప్పూస – రెండు టేబుల్ స్పూన్లు, అల్లం చట్నీ, గ్రీన్ చట్నీ- టేబుల్ స్పూన్ చొప్పున
తయారు చేసే విధానం: బఠాణీలను కుక్కర్‌లో మూబు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి. ప్యాన్‌లో నూనె వేడయ్యాక జీలకర్ర వేయాలి. అది వేగాక.. ఉల్లి తరుగును లేత గోధుమరంగులోకి మారే వరకూ వేయించాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకూ వేయించి.. టొమాటో ముక్కలు జోడించాలి. మెత్తగా ఉడికాక.. తగినన్ని నీళ్లు, కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, ఉడికిన బఠాణీలు జతచేసి ఆరేడు నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా గరంమసాలా వేసి బాగా కలపాలి. గ్రేవీ పల్చగా కాకుండా చిక్కగా ఉండాలి. ఇప్పుడిక పూరీల మీద వేడి వేడి మసాలా గ్రేవీ వేయండి. తర్వాత ఉల్లి స్లైసులు, టొమాటో ముక్కలు, కొత్తిమీర చేర్చండి. వాటి మీద సన్న కారప్పూస, నిమ్మరసం చల్లి.. అల్లం చట్నీ, గ్రీన్ చట్నీలతో ఆరగించండి. చల్లటి సాయంత్రం వేళ మసాలా ఛాట్ రుచిని ఆనందించండి.
వడ పావ్
కావల్సిన పదార్థాలు: ఆలూ – మూడు, ఉప్పు – రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – స్పూన్, పచ్చిమిరపకాయలు – రెండు, కరివేపాకు – రెండు రెబ్బలు, పసుపు – పావు స్పూన్, నిమ్మరసం – స్పూన్, శనగపిండి – కప్పు, బియ్యప్పిండి – రెండు స్పూన్లు, కారం – అర స్పూన్, బన్నులు (పావ్ ) – నాలుగు, కారం – రెండు స్పూన్లు, నెయ్యి – టేబుల్ స్పూన్, నూనె – వేయించడానికి సరిపడా, ఉల్లి స్లైసులు – గుప్పెడు, గ్రీన్ చట్నీ – రెండు స్పూన్లు
తయారు చేసే విధానం: ఆలూను ఉడికించి మెత్తగా మెదిపి పక్కన ఉంచాలి. ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి.. కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌లను వేయించాలి. అందులో పసుపు, ఉప్పు, ఆలూ ముద్ద వేసి కలియబెట్టి సెగ తీసేయాలి. ఈ మిశ్రమం చల్లబడిన తర్వాత చిన్న చిన్న బంతుల్లా చేసి పక్కనుంచాలి. ఒక పాత్రలో శనగపిండి, బియ్యప్పిండి, కారం, పసుపు, ఉప్పు వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పకోడి పిండిలా గట్టిగా కలపాలి. ఆలూ బంతులను పిండిలో ముంచి తీసి.. కాగుతున్న నూనెలో బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. వాటిని టిష్యూ పేపర్ మీదికి తీస్తే.. అదనపు నూనెను పీల్చేసుకుంటాయి. బన్నులను మధ్యలో కట్ చేసి పెనం మీద నెయ్యితో కాల్చుకోవాలి. బన్ను మీద కాస్త కారం చల్లి.. ఒక వడని ఉంచి నెమ్మదిగా నొక్కి, ఉల్లి స్లైసులు, చట్నీ వేసి.. మరో బన్నుతో కప్పేయాలి.
పనీర్ సమోసా
కావల్సిన పదార్థాలు: మైదా – ఒకటిన్నర కప్పులు, నూనె – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి తగినంత
ఫిల్లింగ్ కోసం: పనీర్ – రెండు వందల గ్రాములు, ఉప్పు – తగినంత, ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి – రెండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం – స్పూన్ చొప్పున, ధనియాలు, జీలకర్ర పొడులు, గరంమసాలా – అర స్పూన్ చొప్పున, కొత్తిమీర తరుగు – పావు కప్పు, నిమ్మరసం – ముప్పావు స్పూన్, నూనె – వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం: ఉల్లి, పచ్చిమిర్చి, పనీర్‌లను చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వెడల్పాటి పాత్రలో మైదా, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి.. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ కలపాలి. పిండి గట్టిగా లేదా జారుగా ఉండకూడదు. దాని మీద తడి వస్త్రం కప్పి ఒక అరగంట నాననివ్వాలి. ఈలోగా ప్యాన్‌లో నూనె వేడి చేసి ఉల్లి తరుగు వేయాలి. అది బంగారు రంగులోకి మారాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు జతచేసి పచ్చి వాసన పోయే వరకూ వేయించాలి. అందులో కారం, ఉప్పు, ధనియాలు, జీలకర్ర పొడులు, గరంమసాలా, పనీర్ జోడించి రెండు మూడు నిమిషాలు వేయించాలి. చివర్లో కొత్తిమీర, నిమ్మరసం కూడా వేసి సెగ తీసేయాలి. ఇప్పుడిక నానిన పిండిని చిన్న భాగాలుగా విడగొట్టి.. వాటిని చపాతీలుగా ఒత్తుకోవాలి. ఒక్కో చపాతీని సగానికి కట్ చేయాలి. ఒక్కో అర్ధ భాగాన్ని కోన్‌లా చుట్టి.. అంచులను రెండు చుక్కల నీళ్లతో తడపాలి. సిద్ధమైన పనీర్ ఫిల్లింగ్‌ని కోన్‌లో నింపి.. అంచులను కలిపేసి కాగుతున్న నూనెలో లేత గోధుమ రంగులోకి మారే వరకూ వేయించాలి. అంతే.. గరం గరం పనీర్ సమోసా రెడీ! వీటిని, టొమాటో సాస్ లేదా పుదీనా చట్నీతో తింటే మహా రుచిగా ఉంటాయి.



