Wednesday, August 12, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅతీగతీలేని ‘ఆసరా’ పెన్షన్లు!?

అతీగతీలేని ‘ఆసరా’ పెన్షన్లు!?

- Advertisement -

‘‘మాటలు కోటలు దాటడమే కానీ, చేతలు మాత్రం గడప దాటడం లేదు’’ అన్నట్టుగా కాంగ్రెస్‌ పాలనలో కొత్త పెన్షన్ల మంజూరు, పెన్షన్ల పెంపు విషయంలో ప్రకటనలే తప్ప ఆచరణ కనిపించడం లేదు. తెలంగాణ ఆవిర్భావ దినం జూన్‌ 2, ఆగస్టు 15, జనవరి 26 వంటి సందర్భాల్లో కొత్త ఆసరా పెన్షన్లు మంజూరు చేస్తామని పలుమార్లు ప్రకటించినా, అవి అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. కొత్త పెన్షన్ల కోసం వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, చేనేత, గీత, బీడీ కార్మికులు ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు పన్నెండు లక్షల మంది అర్హులు కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసి ఎదురుచూస్తున్నారు. వీరిలో అర్హులైన వారి దరఖాస్తులను అధికారులు పరిశీలించి, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కంప్యూటరైజేషన్‌ కూడా పూర్తి చేసి జాబితాలను సిద్ధం చేసినప్పటికీ తుది మంజూరు ఉత్తర్వులకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడం లేదు. రాష్ట్ర కేబినెట్‌ రెండు లక్షల మందికి రూ.233 కోట్ల నిధులతో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని తీర్మానించినా, ఇప్పటివరకు ఒక్క కొత్త పెన్షన్‌ కూడా మంజూరు కాలేదు. పన్నెండు లక్షల మంది అర్హులు ఎదురుచూస్తున్నప్పుడు కేవలం రెండు లక్షల మందికే పెన్షన్లు ఇస్తామని ప్రకటించడం అర్హులకు నష్టం చేయడమే.

గతంలో అర్హుల గుర్తింపు, విచారణ, మంజూరు ప్రక్రియను అధికారులు ప్రతి నెలా సహజసిద్ధంగా నిర్వహించేవారు. దాదాపు రెండు దశాబ్దాలుగా కొన సాగుతున్న ఈ ప్రక్రియను ఇప్పుడు కొత్త నిబంధనలు, పునర్విచారణల పేరుతో మరింత సంక్లిష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.ఇప్పటికే అధికారులు విచారణ జరిపి, అర్హులుగా గుర్తించి, కంప్యూటరైజేషన్‌ చేసిన జాబితాలు ఉన్నప్పుడు మళ్లీ దరఖాస్తులు స్వీకరించి, విచారణలు చేపట్టడం వల్ల జాప్యం పెరగడమే కాకుండా అవినీతికి కూడా అవకాశం ఏర్పడే ప్రమాదం ఉంది. 6.47 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు దరఖాస్తుల స్వీకరణ, విచారణ, మంజూరు బాధ్య తలు అప్పగిస్తామని మంత్రులు చేస్తున్న ప్రకటనలు లబ్దిదారులను మరింత గందరగోళానికి గురిచేయడమే తప్ప వేరేకాదు. మరోవైపు పెన్షన్‌ అర్హతల విషయంలో కూడా ప్రభుత్వం ప్రకటిస్తున్న నిబంధనలు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. రూ.1.50 లక్షల వార్షిక ఆదాయ పరిమితిని ప్రాతిపదికగా తీసుకుంటే రోజుకు రూ.400-500 కూలి చేసుకునే పేదలు కూడా పెన్షన్‌కు అనర్హులయ్యే పరిస్థితి వస్తుంది. మూడెకరాల భూమి ఉన్నా, ఉమ్మడి కుటుంబంలో ట్రాక్టర్‌ లేదా కిరాయి కారు ఉన్నా అనర్హులుగా పరిగణించే నిబంధనలు కూడా సామాన్యుల పరిస్థితులకు అనుగుణంగా లేవనే విమర్శలు ఉన్నాయి.

ముఖ్యంగా అన్ని ధ్రువీకరణ పత్రాలు కలిగి, అధికారుల విచారణను పూర్తి చేసుకుని అర్హులుగా నిర్ధారించబడిన వారిని కొత్త నిబంధనల పేరుతో మళ్లీ గందరగోళానికి గురిచేయడం సరికాదు. వికలాంగుల విషయంలో ఆర్థిక ప్రాతిపదికను విధించడం కూడా సబబు కాదు. నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు, సదరం సర్టిఫికెట్లు పొం దినవారు కూడా దరఖాస్తులు చేసుకుని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గ్రామసభల్లో కూడా అర్హుల దరఖాస్తులు స్వీకరించిన సందర్భాలున్నాయి. ఇలాంటి వారిని మళ్లీ కొత్త ప్రక్రియ పేరుతో పరీక్షించడం కంటే, ఇప్పటికే పూర్తయిన అధికారిక ప్రక్రియ ఆధారంగా పెన్షన్లు మంజూరు చేయడం సరైన పద్ధతి. కాంగ్రెస్‌ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో 37,65,304 మంది ఆసరా పెన్షన్‌దారులు ఉండగా, ప్రతి ఏడాది సుమారు రూ.4,700 కోట్లను అప్పటి ప్రభుత్వం ఖర్చు చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం దాన్నే కొనసాగిస్తూ వస్తున్నప్పటికీ కొత్తగా పెన్షన్లు మంజూరు చేయలేదు. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత 3,15,262 ఆసరా పెన్షన్‌ దరఖాస్తులు పెండింగ్‌లోనే పెట్టింది. ఇందులో ఒంటరి మహిళలు, వితంతువులకు సంబంధించిన 1,59,452, వికలాంగులకు 55,619, వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించిన 64,749 దరఖాస్తులు ఉన్నాయి. ఆ సంఖ్య ప్రస్తుతం సుమారు 12 లక్షలకు చేరింది.

కొత్త పెన్షన్లు ఎప్పటికప్పుడు మంజూరు చేయకుండా ఆర్థిక వెసులు బాటు లేదనే కారణాలతో వాయిదా వేస్తూ పోవడం వల్ల అర్హుల జాబితా కొండవీటి చాంతాడులా పెరిగింది. దీనికి బాధ్యత లబ్దిదారులది కాదు. ప్రభుత్వం తన పరిపాలనా వైఫల్యాన్ని కొత్త నిబంధనలు, కొత్త దరఖాస్తులు, పునర్వి చారణలతో కప్పిపుచ్చే ప్రయత్నం చేయకుండా సమస్యకు నేరుగా పరిష్కారం చూపాలి. ఇదిలా ఉండగా, గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన పెన్షన్‌ పెంపు హామీ కూడా ఇంకా అమలు కావడం లేదు. రూ.2వేలుగా ఉన్న వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, బోధకాలు, హెచ్‌ఐవీ బాధితులు, చేనేత, గీత, బీడీ కార్మికుల పెన్షన్లను రూ.4వేలకు, రూ.4,016గా ఉన్న వికలాంగుల పెన్షన్లను రూ.6,016కు పెంచుతామని మేని ఫెస్టోలో హామీనిచ్చింది. రోజురోజుకూ నిత్యావసర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ హామీని అమలు చేయాల్సిన అవసరం మరింత పెరిగింది. కానీ ఇప్పటివరకు పెన్షన్‌ పెంపుపై స్పష్టమైన చర్య కనిపించడం లేదు. కనీసం మాట వరసకైనా మంత్రులు ఆ ఊసెత్తడం లేదు. అంటే, ఈ హామీ ఎప్పుడో గాల్లో కలిపారని అర్థమవుతోంది.

ఇప్పటికైనా గత మూడేండ్లుగా అధికారులు దరఖాస్తులు స్వీకరించి, విచారణ జరిపి, కంప్యూటరైజేషన్‌ చేసి సిద్ధం చేసిన అర్హుల జాబితా ఆధారంగా వరుస క్రమంలో కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి. ఇప్పటికే అర్హులుగా నిర్ధారించిన వారిని మళ్లీ దరఖాస్తులు, విచారణల పేరుతో ప్రక్రియలోకి నెట్టకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి. అలాగే గత ఎన్నికల హామీ మేరకు ప్రస్తుత పెన్షన్‌దారులకు కూడా పెన్షన్‌ పెంచాలి. ప్రభుత్వం ముందు ఇంకా రెండేండ్ల కాలపరిమితి మాత్రమే ఉన్నందున ఈ సమస్యను ఇక వాయిదా వేయడానికి అవకాశం లేదు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతర అర్హులైన పేదలకు పెన్షన్‌ అనేది కేవలం ప్రభుత్వ ఆర్థిక భారంగా కాకుండా సామాజిక బాధ్యతగా చూడాలి. ప్రజా సంక్షేమం ప్రభుత్వాల కనీస బాధ్యత అనే విషయాన్ని గుర్తించి, ఏండ్లుగా ఆసరా కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది జీవితాల్లో నిజమైన భరోసా కల్పించాల్సిన సమయం ఇదే. లేదంటే ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుంది.

ఎన్.తిర్మల్, 9441864514

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -