పెద్ద ఆర్భాటం, ముందస్తు హడావుడి లేకుండా సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో ఆగస్టు ఏడున సౌదీ, టర్కీ, పాకిస్తాన్ దేశాల మధ్య ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. దీన్ని ‘మక్కా ఒప్పందం’ అని కూడా పిలుస్తున్నారు. దీని పరిణామాలు, పర్యవసానాల గురించి ప్రపంచంలో చర్చ మొదలైంది. రక్షణ కోసం అమెరికాను ఆశ్రయిస్తే ప్రయోజనం లేదనే భావం తాజా పరిణామాలతో బలపడటంతో ఈ కొత్త కూటమి పురుడు పోసుకున్నట్లు తొలి స్పందనలొచ్చాయి. నమ్ముకున్న దేశాలను నట్టేట ముంచి స్వంత ప్రయోజనాల కోసం అమెరికా ఎంతకైనా తెగిస్తుందన్న విషయం తెలిసిందే. ఇజ్రాయిల్‌తో కలసి ఇరాన్‌పై దాడులు చేయించిన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అటు అమెరికా ఇటు యావత్ ప్రపంచంలో అపహాస్యం పాలైనా బుద్ది మారలేదు. అలాంటి వాడిని మన ప్రధాని నరేంద్రమోడీ వంటివారు ఇంకా జిగినీ దోస్తుగానే పరిగణిస్తున్నారు. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తే మన వస్తువుల దిగుమతిపై వందశాతం అపరాధ సుంకాలు విధించేందుకు అమెరికా పార్లమెంటు ఎగువసభ సెనేట్ ఇప్పటికే తీర్మానించింది, ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్ ఆమోదం పొందితే అమల్లోకి రానుంది. అయినా మోడీ నుంచి ఉలుకూపలుకూ లేదు.
అదేమిటంటే మౌనం కూడా ఒక దౌత్యమే, అది మోడీకే స్వంతం అని భజనపరులు కీర్తిస్తున్నారు. ఇరాన్ మీద తాము దాడులు చేసినపుడు అనేకమంది మరణించారని, గాయపడ్డారని వారందరికీ ఇరాన్ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని తాజాగా డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. దాడులతో తమకు కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని టెహరాన్ పట్టుబడుతున్న పూర్వరంగంలో ట్రంప్ ఎదురుదాడికి దిగాడు. నవంబరు మూడవ తేదీన జరిగే పార్లమెంటు మధ్యంతర ఎన్నికల గడువు సమీపిస్తున్నది. ఓటర్లకు ఏం చెప్పాలో తెలియక, ఏం మాట్లాడితే పరువు మరింత దిగజారుతుందో అర్ధంగాక ఎరక్కపోయి ఇరుక్కు పోయినట్లుగా ట్రంప్ జుట్టుపీక్కుంటున్నాడంటే అతిశయోక్తి కాదు. గాజాలో శాంతి ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నామని, అమెరికా ప్రతిపాదించిన పదిహేను అంశాలను అమలు చేస్తామని, అక్కడ అధికారంలో ఉన్న హమాస్ సాయుధశక్తి చెబుతుండగా… అంగీకరించేది లేదని, గాజా నుంచి వైదొలగబోమని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించాడు. ఎందుకంటే అక్టోబరు 27న ఇజ్రాయిల్ పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయా లేదా అన్న సందేహాలు తలెత్తాయి. నెతన్యాహు అనుకూల మూకలు ఓటర్లను బెదిరిస్తున్నాయి.
ఓటర్లుగా ఉన్న పాలస్తీనియన్లను ఓటింగ్‌కు రాకుండా అని ప్రయత్నాలూ చేస్తున్నాయి. విదేశాల్లో ఉన్నవారు వచ్చి నెతన్యాహుకు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే భయంతో ముందు, ఓటింగ్ రోజు అనేక విమానాలను కూడా రద్దు చేశారు. యూదు దురహంకారులను సంతుష్టీకరిం చేందుకు ఆక్రమిత వెస్ట్ బ్యాంకు ప్రాంతంలో పాలస్తీనియన్లపై దాడులను ఉధృతం చేశారు, వామపక్షాలను పోటీలో లేకుండా చేసేందుకు కూడా చూస్తున్నారు. ఈ పరిణామాలు ఇలా ఉండగా టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ దేశాల ప్రతినిధులు మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. మూడింటిలో ఏ ఒక్కదేశం మీదైనా ఎవరైనా దాడిచేస్తే అందరి మీద చేసినట్లుగా పరిగణించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ కూటమిని “ముస్లిం నాటో-సున్నీ నాటో” అని కొందరు వర్ణించారు. మూడూ ఇస్లామిక్ దేశాలు కావటం, మతరీత్యా ఆ దేశాల్లో సున్నీలు అత్యధికులుగా ఉన్నందున అలా చెప్పారు. ఈ ఒప్పందం ఎవరికీ వ్యతిరేకం కాదని చెప్పినప్పటికీ రకరకాల వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. దీనివలన ఎలాంటి ఫలితం ఉండదని చెబుతున్నవారూ లేకపోలేదు. దీర్ఘకాలం సాగుతున్న విబేధాలు, ప్రాంతీయ యుద్ధాల పూర్వరంగంలో అమెరికా రక్షణను నమ్ముకోకూడదన్నది ఒక ప్రధాన అంశంగా చెబుతున్నారు.
తాజా పశ్చిమాసియా సంక్షోభంలో గల్ఫ్, మధ్య ప్రాచ్య ప్రాంతంలోని అమెరికా సైనిక కేంద్రాలపై ఇరాన్ చేస్తున్న దాడులతో ఆయా దేశాల్లో తలెత్తిన ఆందోళన, అనిశ్చితి వాషింగ్టన్‌ను నమ్ముకుంటే ఇంతే సంగతులు అనే భయం పట్టుకుంది. దీంతో యుద్ధాన్ని నిలిపివేయాలని ఆ దేశాలు ట్రంప్ యంత్రాంగం మీద వత్తిడి తెస్తున్న సంగతి కూడా తెలిసిందే. అత్యాధునిక ఆయుధాలున్న అమెరికా దాడుల్లో ట్రంప్ చెప్పినట్లుగా ఇరాన్ అనేక విధాలుగా దెబ్బతిన్నది వాస్తవమే అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి ప్రతిదాడులు చేయటం వెనుక ఉన్న మర్మం పండితులకు అంతుబట్టటం లేదు. తిరుగులేని నిఘా వ్యవస్థలుగా పేరున్న ఇజ్రాయిల్ మొసాద్, అమెరికా సిఐఏకు సైతం ఇరాన్ ఆయుధాలు, వాటిని ప్రయోగిస్తున్న కేంద్రాలు ఎక్కడున్నాయో తెలియటం లేదు. గతేడాది అణుకేంద్రాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించినా అదంతా ఉత్త ప్రచారమే అని తరువాత తేలిపోయింది. అందుకే ప్రాంతీయ ఏర్పాట్లు చేసుకోవాలనే ఆలోచనకు మక్కా ఒప్పందం ఒక ప్రతిరూపం అంటున్నారు. దీనిలో వెంటనే ఈజిప్టు చేరనుందని, తరువాత మరికొన్ని దేశాలు కూడా భాగస్వాములుగా చేరవచ్చని చెబుతున్నారు. దీని ఏర్పాటు వెనుక అమెరికా హస్తం ఉందని కూడా అను మానాలు వెల్లడవుతున్నాయి.తమ చేతికి మట్టి అంటకుండా ఇరాన్‌ను దెబ్బతీసేందుకు మరో ప్రయత్నంగా ఇది ఉన్నట్లు చెబుతున్నారు.
అది నిజమా కాదా అన్నది వెంటనే చెప్పలేము గానీ ఏం జరిగినా పోయేది అమెరికా ప్రతిష్ట, పెత్తనం అన్నది స్పష్టం. అమెరికా మీద అనేక దేశాలకు ఎందుకు విశ్వాసం సన్నగిల్లుతున్నది? ఇరాన్ అణుబాంబు తయారీ, క్షిపణి, నౌకాదళ సామర్ధ్యాలను దెబ్బతీసేందుకు ఇజ్రాయిల్‌తో కలసి దాడులు చేస్తున్నట్లు తొలుత అమెరికా చెప్పింది. వాటన్నింటినీ నాశనం చేసినట్లు ఏప్రిల్ ఎనిమిది పెంటగన్ ప్రకటించింది. వైమానిక రక్షణ వ్యవస్థలను సంవత్సరాల తరబడి పనికిరాకుండా చేయటంతో పాటు మిలిటరీ పారిశ్రామిక సామర్ద్యాన్ని కూడా దెబ్బతీసినట్లు చెప్పింది. ఇన్ని కబుర్ల తరువాత వెల్లడైన వివరాల మేరకు అమెరికా 113 బిలియన్ డాలర్ల మేర ఆర్థికంగా నష్టపోయింది. దాని విలువైన 42 విమానాలు కూడా కూలిపోయాయి. మరణించిన లేదా గాయపడిన అమెరికా సైనికుల సంఖ్య తొమ్మిది వందలు దాటింది. ఆ ప్రాంతంలో యాభై వేల మంది తమ సైనికులు ఉన్నట్లు వెల్లడించటమే గాక ఆ తరువాత కూడా దాడులు కొనసాగించింది. ఫిబ్రవరి 28కి కొన్ని వారాల ముందు కతార్‌లో బహుళజాతి గగనతల, క్షిపణి రక్షణ విభాగాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రారంభించింది. దాని ద్వారా ముప్పు గురించి ముందే హెచ్చరించటం, ఎదుర్కొనేందుకు తాత్కాలిక పథకాల రచన, సమాచార అందచేత వంటి కార్యకలాపాలు జరుగుతాయని చెప్పారు.
ఏడు దేశాల మిలిటరీ ప్రతినిధులు దానిలో భాగస్వాములన్నారు. తీరాచూస్తే ఇరాన్ చేసిన దాడులతో అది పనికిరాకుండా పోయింది. అమెరికా మరోచోటుకు తన కమాండ్ కేంద్రాన్ని మార్చుకుంది. నిజానికి కతార్‌లో అంతకుముందున్న కమాండ్ కేంద్రం నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా ఇతర దేశాలలో అమెరికా అనేక కార్యకలాపాలు నిర్వహించింది. ఇరాన్ దాడులతో ఆ ప్రాంతంలోని 15 అమెరికా మిలిటరీ కేంద్రాలలో కనీసం 228 మిలిటరీ నిర్మాణాలు, వాటిలో ఉన్న విమానాలు, రాడార్, సమాచార పరికరాలు, చమురు సంబంధిత ఏర్పాట్లు దెబ్బతిన్నట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. ఎంతో ఖరీదైన పేట్రియాట్, థాడ్, తోమహాక్ రక్షణ వ్యవస్థలన్నీ ఇరాన్ దెబ్బతో కరిగిపోయాయి. చివరకు దక్షిణ కొరియాలో ఉంచిన వాటిని కూడా పశ్చిమాసియాకు తరలించాల్సి వచ్చింది. వెంటనే అలాంటి వాటిని ఉత్పత్తి చేయాలని రక్షణ కాంట్రాక్టర్లను పెంటగన్ కోరిందని, వెంటనే సరఫరా చేయటం సాధ్యం కాదని వారు చేతులు ఎత్తివేసినట్లు వార్తలొచ్చాయి. కొన్నేండ్ల పాటు ఉత్పత్తికి సమయం తీసుకోవచ్చని కూడా నిపుణులు చెప్పారు. వీటన్నింటిని చూసిన తరువాత అమెరికాను నమ్ముకొని ఏ దేశమైనా నిశ్చింతగా ఉండగలదా? నాటో కూటమిలో సభ్య దేశమైన టర్కీ రెండవ పెద్ద మిలిటరీని కలిగి ఉంది.
గల్ఫ్‌లో చమురుతో సౌదీ అరేబియా ఆపార సంపద, పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలు ఈ మూడూ కలిస్తే ఒక బలమైన శక్తిగా రూపొందే అవకాశం ఉందనే ఆలోచన మక్కా ఒప్పందం వెనుక ఉందన్నది ఒక అభిప్రాయం. రానున్న రోజుల్లో మరికొన్ని దేశాలు కూడా చేరవచ్చు. అయితే నాటో కూటమి లక్షణాలు దీనికి ఉన్నాయా అంటే లేవు. అందుకే కొందరు ఇది సంతకాలకే పరిమితం అంటున్నారు. నాటో మాదిరి ఒక ఏకీకృత మిలిటరీ కమాండ్, ఒక ప్రణాళిక, నిర్దిష్ట లక్ష్యం లేదు. తక్షణమే అలాంటి వాటిని ఏర్పాటు చేసే అవకాశాలూ కనిపించటం లేదు. ఐక్యరాజ్యసమితి ఆర్టికల్ 51 ప్రకారం ఉమ్మడి ఆత్మరక్షణ ఒప్పందంగా టర్కీ వర్ణించింది. గతేడాది సౌదీ అరేబియా-పాకిస్తాన్ మధ్య ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. దానిలో చేరే అవకాశం గురించి చర్చిస్తున్నట్లు టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ జనవరి 29న చెప్పాడు. రక్షణ అవసరాల కోసం వెలుపలి దేశాల మీద ఆధారపడుతూ కొనసాగటం కంటే ప్రాంతీయ ఏర్పాట్లు చేసుకోవటం మంచిదన్నదే దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం. ప్రపంచ మిలిటరీ బలా బలాలను చూసినపుడు టర్కీ 9, పాకిస్తాన్ 14, సౌదీ 25వ స్థానాల్లో ఉన్నాయి. పందొమ్మిద వదిగా ఉన్న ఈజిప్టు కూడా కలిసే అవకాశం ఉంది. ఈ మూడు దేశాలూ భిన్నదారుల్లో ప్రయాణిస్తున్నాయి.
అష్ట దరిద్రాలతో అల్లాడుతున్నప్పటికీ పాకిస్తాన్ అణుబాంబు లను తయారు చేసుకుంది తప్ప అన్న వస్త్రాలను జనాలకు సమకూర్చలేకపోతోంది. కీలకమైన ప్రాంతంలో ఉన్నందున భారత్, చైనాలకు వ్యతిరేకంగా ఒక స్థావరంగా ఉపయోగపడ నుందనే కుట్రలో భాగంగా అమెరికా, ఇతర పశ్చిమదేశాలు దానికి అండగా ఉన్నాయి. ఇప్పుడు దాని ఆర్థిక ఇబ్బందులను సౌదీ తీరుస్తున్నది. పాకిస్తాన్ తన మిలిటరీ అవసరాల కోసం అత్యధికంగా చైనా మీద ఆధారపడుతున్నది. టర్కీ స్వంత మిలిటరీ పరిశ్రమలను కలిగి ఉంది. సౌదీ విషయానికి వస్తే అది పూర్తిగా అమెరికా మిలిటరీ ఉత్పత్తులపై ఆధార పడుతున్నది. ఐరోపా కేంద్రంగా పనిచేసే నాటో దేశాలు కొన్ని స్వయంగా ఆయుధాలను ఉత్పత్తి చేస్తుండగా మరికొన్ని అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్నాయి. నాటో రక్షణ బడ్జెట్ పెంచాలని ఇటీవలి కాలంలో అమెరికా వత్తిడి తెస్తున్నది. ఇస్లామిక్ నాటోగా వర్ణితమౌతున్న కూటమిలో రక్షణ బడ్జెట్‌ను పెంచేందుకు పాకిస్తాన్‌కు అవకాశం లేదు. ఒక వైపు నాటోలో కొనసాగుతూ మరోవైపు మక్కా కూటమిలో చేరిన టర్కీ ఎంతమేరకు బడ్జెట్ కేటాయిస్తుందన్నది అనుమానమే.ఈ కూటమి ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున మన దేశం పెద్దగా స్పందించలేదు, వేచి చూస్తున్నట్లు మాత్రమే ముక్తసరిగా వ్యాఖ్యానించింది.
ఎం కోటేశ్వరరావు
8331013288



