Wednesday, September 23, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిముందు చూపేది...?

ముందు చూపేది…?

- Advertisement -

ఒక‌వైపు ఎల్‌నినో ప్ర‌భావం.. మ‌రోవైపు పాల‌కుల వైఫ‌ల్యం… వెర‌సి అన్న‌దాత పాలిట శాపంగా ప‌రిణ‌మించాయి. ఎల్‌నినో ప్ర‌భావం కేవ‌లం తెలంగాణ‌పైనే కాదు.. యావ‌త్ దేశంపై కూడా ఉంద‌నే విష‌యం వాస్త‌వ‌మే అయినా, ఇక్క‌డ ప్ర‌కృతి ప్ర‌కోపానికి తోడు ప్ర‌భుత్వాలకు ముందు చూపు లేక‌పోవ‌టం సాగుకు క‌ష్టాల‌ను తెచ్చిపెట్టింది. ఉమ్మ‌డి రాష్ట్రం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టుల‌ను స‌త్వ‌ర‌మే పూర్తి చేసి, తెలంగాణ‌లోని అన్ని ప్రాంతాల‌కు సాగునీటిని అందించాలంటూ రైతు సంఘాలు, వ్య‌వ‌సాయ నిపుణులు కోరుతూ వ‌చ్చారు. కానీ పాల‌కులు ఆ మాట‌ల‌ను ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. ఫ‌లితం ఇప్పుడు మ‌నం అనుభ‌విస్తున్న క‌రువు, కాట‌కాలు.

పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా క‌ల్పించాలంటూ గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం కేంద్రాన్ని కోరుతూ వ‌చ్చింది. నేటి కాంగ్రెస్ స‌ర్కారు కూడా అదే డిమాండ్‌ను వినిపిస్తోంది. కానీ అదే డిమాండ్‌పై పాల‌కుల‌కు స్ప‌ష్టంగా ఒక కార్యాచ‌ర‌ణగానీ, పోరాట‌ ప‌టిమగానీ లేక‌పోవ‌టం శోచ‌నీయం. ఆ ప్రాజెక్టుకు సంబంధించి 2023లో కేసీఆర్ ప్ర‌భుత్వం ట్ర‌య‌ల్ ర‌న్‌ను ప్రారంభించింది. రేవంత్ రెడ్డి స‌ర్కారు కూడా ఈ యేడాది ఆరంభంలో అదే ట్ర‌య‌ల్ ర‌న్‌ను చేప‌ట్టింది. కానీ రెండు ప్ర‌భుత్వాలూ నీళ్ల‌ను లిఫ్ట్ చేసేందుకు మాత్రం ఏ ఒక్క రోజూ ప్ర‌య‌త్నించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. పాల‌మూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో 70 టీఎమ్‌సీల నీటి నిల్వ సామ‌ర్థ్యం ఉంది. ఆ మేర‌కు నీటిని నిల్వ చేయ‌గ‌లిగితే రైతుల‌కు ఎంతో మేలు జ‌రిగేది. పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేసి, నీటిని నిల్వ చేయ‌క‌పోవ‌టం వ‌ల్ల ప్ర‌తీయేటా గోదావ‌రి నుంచి మూడు వేల టీఎమ్‌సీలు సముద్రం పాల‌వుతున్నాయ‌ని నీటిపారుద‌ల నిపుణులు నెత్తీనోరు బాదుకుంటున్నారు. ఎల్‌నినో వియ‌ల‌తాండవం చేస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో కూడా ఆ న‌ది నుంచి వెయ్యి టీఎమ్‌సీలు స‌ముద్రంలో వృథాగా క‌లిపిపో యాయంటే ఆ పాపం ఎవ‌రిది? ప్ర‌తీ చుక్క నీటిని ఒడిసిప‌ట్టండంటూ ప్ర‌జ‌ల‌కు ప‌దే ప‌దే విజ్ఞ‌ప్తులు చేసే ప్ర‌భుత్వం… గోదావ‌రి నుంచి స‌ముద్రంలో క‌లిసే నీటిని ఎందుకు ఒడిసిప‌ట్ట లేక‌పోతోంది? ఇది ముమ్మాటికీ పాల‌కుల వైఫ‌ల్యానికి నిద‌ర్శ‌న‌మే.

ఇక ప్ర‌స్తుతం తీవ్ర వివాదంగా మారిన జూరాల విష‌యానికొస్తే… ఈ విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అతి జాగ్ర‌త్త‌తోపాటు అత్యంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తోం దంటున్నారు సాగునీటిరంగ నిపుణులు. ఇప్ప‌టికిప్పుడు జూరాల‌లో 8 టీఎమ్‌సీల నీరు నిల్వ ఉంది. వాటిని విడుద‌ల చేసి, రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వం చోద్యం చూస్తోంది. ఈ అంశంలో రేవంత్ స‌ర్కారు ఎక్కువ భ‌య‌ప‌డుతున్న‌ట్టుగా క‌న‌బ‌డుతోంది. ఎందుకంటే ఇప్పుడు ప్ర‌తీ ఊరికీ మంచినీరు స్థానంలో, ప్ర‌తీ ఇంటికీ మంచినీరు అందుతోంది. ఒక‌వేళ ఇప్ప‌టికిప్పుడు జూరాల‌తోపాటు ఇత‌ర ప్రాజెక్టుల్లోని నీటిని విడుద‌ల చేస్తే… మున్ముందు తాగునీటికి క‌ట‌క‌ట ఏర్ప‌డుతుంద‌నే ఆందోళ‌న ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను వెంటాడుతోంది. ఇప్ప‌టిదాకా తాగునీటికి ఢోకా లేకుండా పోయిన నేప‌థ్యంలో భ‌విష్య‌త్తులో ఒక్క‌సారిగా తాగ‌టానికి నీరు లేక గొంతెండితే త‌మ ప‌రిస్థితి పూర్తిగా కిందా మీదా అవుతుంద‌నే భావ‌న వారిలో నెల‌కొంది. అందుకే ఈ తాత్సారం. ఎల్‌నినో గురించి ప‌ర్య‌వర‌ణవేత్త‌లు, శాస్త్ర‌వేత్త‌లు ఎప్ప‌టి నుంచో హెచ్చ‌రిస్తున్న నేప‌థ్యంలో ఈ ప‌రిస్థితిని ముందే ఊహించి, త‌గు ప్ర‌ణాళిక‌లు తీసుకుంటే ప‌రిస్థితి ఇక్క‌డిదాకా వ‌చ్చేది కాదుగ‌దా? ఎల్‌నినో దృష్ట్యా వ‌రి వేయొద్దు, ఆరు త‌డి పంట‌లు వేసుకోండంటూ రైతుల‌ను హెచ్చ‌రిస్తే… అస‌లు ఇలా భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌ర‌మే రాదు క‌దా? తీరా ఇప్పుడు వ‌రి చేలు పొట్ట‌ద‌శ‌కు వ‌చ్చిన త‌ర్వాత నీటిని విడుద‌ల చేయ‌లేం, రైతులు జాగ్ర‌త్త‌లు తీసుకోండంటూ చెబితే అన్న‌దాత ఏం చేయాలి? ఈ క్ర‌మంలో మ‌న రాష్ట్ర మంత్రులు, క‌ర్నాట‌క‌కు వెళ్లి, జూరాల‌కు మూడు టీఎమ్‌సీల నీటి విడుద‌ల‌కు అక్క‌డి ప్ర‌భుత్వాన్ని ఒప్పించ‌టం హ‌ర్ష‌ణీయ‌మే. అయితే అదే స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం కాదు. అందుకే… ఇప్ప‌టికైనా రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌టంపై సర్కారు దృష్టి సారించాలి. ఆ మేర‌కు యుద్ధ ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -