ప్రజాస్వామ్యంలో ఓటు ఒక హక్కు మాత్రమే కాదు. అది రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన అత్యంత విలువైన రాజకీయ అధికారం. ఆ హక్కును వినియోగించే అవకాశాన్ని కల్పించే ఓటర్ జాబితా ఎంత కచ్చితంగా ఉంటుందో ప్రజాస్వామ్యమూ అంతబలంగా ఉంటుంది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ఎన్నో భయాందోళనలకు గురిచేస్తోంది. బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోకంటే ఇప్పుడు తెలంగాణలో పూర్తయిన సర్ మొదటి దశ ప్రక్రియ ప్రతి ఒక్కరిలో గుబులు రేపుతోంది. సర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో బూత్ స్థాయి అధికారులు సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ సోమవారంతో పూర్తయింది. 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలవుతుంది. ఆ తర్వాత అభ్యం తరాల స్వీకరణ ఉంటుంది. అక్టోబర్‌లో తుది ఓటర్ జాబితాను విడుదల చేస్తారు. కానీ, అంతకన్నా ముందే ‘ఓటుందా.. పోయిందా?’ అనే ఆందోళన ప్రతి ఓటరులో నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా, అందులో సోమవారం సాయంత్రం ఆరుగంటల వరకు 2.64 కోట్ల మంది (78.26 శాతం) పత్రాలకే డిజిటలైజేషన్ పూర్తయింది. 74 లక్షల మంది ఓటర్లు తమ పత్రాలను బీఎల్‌ఓలకు అందించలేదు.
ఈ ఓట్లలో 73.40 (21.70 శాతం) ఓట్లు సేకరించడానికి వీలులేని (అన్ కలెక్టబుల్) జాబితాలో ఉంచారు. వారిలో కొంతమంది ఓటరు కార్డులో నమోదు చేసిన చిరునామాలో లేరు. శాశ్వతంగా వలసవెళ్లిన వారు, మృతి చెందిన వారూ ఉన్నారు. వారందరి ఓట్లు ఉండే అవ కాశం లేదు. ఓట్లు తేడాలున్న, మ్యాపింగ్(2002 ఓటర్ల జాబితా) జరగని ఓటర్లలో ధ్రువపత్రాలు అందజేయనివారు ఉంటే అదనంగా మరిన్ని ఓట్లు ఓటర్ల జాబితా నుంచి తొలగిపోయే అవకాశం ఉందన్న సమాచారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లాలోనే అత్యధికంగా కనుమరు గయ్యే ఓట్లున్నాయి. ఇంత పెద్దసంఖ్యలో అనిశ్చితి ఏర్పడినప్పుడు దీనంతటికీ బాధ్యత వహించేది కేంద్రమా? ఎన్నికల సంఘమా? అర్హులైన వారి ఓట్లు పోకుండా చూస్తామని ఎన్నికల సంఘం చెబుతున్నా గత అనుభవాలు పరిశీలించినప్పుడు అలాంటి ప్రకటనలు చెత్త కాగితాలకే పరిమితమని రుజువు చేస్తున్నాయి. తమ ప్రభావం ఎక్కువగా ఉన్నచోట్ల అక్కడ వ్యతిరేకుల ఓట్లను తొలగించడానికే మొగ్గు చూపు తున్న బీజేపీ …తొలగించబడిన వారి ఓట్లను తిరిగి ఓటర్ల జాబితాలో ఎన్నికల సంఘం చేర్చుతుందా? అంటే అనుమానమే. ఓటర్ల జాబితాను సవరించడం కొత్త విషయం కాదు. ప్రతి ఎన్నికల ముందు, తర్వాత జాబితాల్లో మార్పులు జరుగు తుంటాయి.
మరణించిన వారి పేర్లు తొలగించడం, ఒక వ్యక్తి పేరు ఒకటికంటే ఎక్కువ చోట్ల నమోదై ఉంటే సరిచేయడం, శాశ్వతంగా వలస వెళ్లిన వారి వివరాలను నవీకరించడం వంటి చర్యలు అవసరమే. దాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. ప్రశ్న తొలగింపుపై కాదు.. తొలగింపు విధానంపైనే. సర్ పేరుతో మొదట నుంచి ఓట్లు ఉంచడం దానికంటే .. తొలగించడానికే ప్రాధాన్యత చూపారు. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు. సవరణ పేరుతో నిజమైన ఓటరు పేరు ఓటర్ల జాబితా నుంచి లేకుండా పోతే ఎన్నికల రోజున ఓటు వేయలేరు. ఇతర గుర్తింపు పత్రాలు ఉన్నా ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవడం సాధ్యం కాదు. ఇప్పటికే ఓటు హక్కు లేని వారికి ఎలాంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వాలు వర్తింపజేయడం లేదు. రాష్ట్రంలో అంతర్గత వలసలు ఎక్కువగా ఉన్నాయి. సుమారు నలభై లక్షల ఓట్లు వలస వెళ్లినట్టు అధికారులు నమోదు చేశారు. ఇతర ప్రాంతాలకు పనుల కోసం వెళ్లినవారు, ఇండ్లు మారినవారు, చిరునామాలు మార్చుకున్నవారు అధికంగా ఉన్నారు. ముసాయిదా జాబితాను విడుదల చేసిన తర్వాత ఎన్నికల సంఘం ఈ విషయంలో మరింత సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
ఎంతమంది పేర్లను ఎందుకు తొలగించాల్సి వస్తోంది? అభ్యంతరాలు స్వీకరణ తరువాత వాటిలో ఎన్ని పరిష్కరించారు? ఎంతమంది పేర్లు తిరిగి చేర్చారు? వంటి వివరాలు స్పష్టంగా తెలియాలి. ఎన్నికల జాబితా అనేది కేవలం ప్రభుత్వ రికార్డు కాదు. ఎన్నికల రోజున ఎవరు తమ ఓటు హక్కును వినియోగించుకోగలరో నిర్ణయించే ప్రాథమిక పత్రం. అందుకే దానిలో జరిగే ప్రతి మార్పుకూ సరైన కారణం, పరిశీలన అవసరం. రాజకీయాలకు చోటు లేదన్నప్పుడు అర్హులైన వారి ఓటు పోకుండా చూడటం ఎన్నికల సంఘం కర్తవ్యం. ఒక నకిలీ పేరు ఉండడం కంటే ఒక నిజమైన ఓట్లు పేరు తొలగిపోవడమే ప్రజాస్వామ్యానికి పెద్దనష్టం ఈ విషయాన్ని ఎన్నికల సంఘం గుర్తించాలి. పరిశీలనకు వీలుకాదంటూ పక్కన పెడుతున్న ప్రతి దరఖాస్తును మరోసారి క్షుణ్ణంగా చూడాలి. తిరస్కరణకు గురయ్యే ప్రతి ఓటరుకు అభ్యంతరం చెప్పే అవకాశం కల్పించాలి. ప్రతి అర్హుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాలి. ఓటు హక్కును కాపాడటం అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడమే. అదే ఎన్నికల సంఘం ముందున్న అత్యంత ముఖ్యమైన రాజ్యాంగ బాధ్యత.
ఓటుకు ‘సర్’ చేటు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



