ఆదిలాబాద్ యువతకు
ప్రొఫెసర్ కాశీం పిలుపు
జిల్లాలో విద్యార్థి,
యువజన పోరుగర్జన సభ
హాజరైన రాష్ట్ర నాయకులు,
మాజీ మంత్రి
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
నీట్ పేపర్ లీక్, ఇతర సమస్యలపై దేశంలో జెన్‌జీల పోరాటంతో ప్రభుత్వాలు దిగొచ్చాయని, అదే స్ఫూర్తితో ఆదిలాబాద్‌లో కూడా సీసీఐ పునరుద్ధరణకు పోరాడాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ కాశీం పిలుపునిచ్చారు. సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం వద్ద విద్యార్థి, యువజన పోరుగర్జన సభ నిర్వహించారు. సభకు ప్రొఫెసర్‌తోపాటు మాజీ మంత్రి జోగు రామన్న, విద్యార్థి, యువజన సంఘాల రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ.. యువత, విద్యార్థుల భవిష్యత్త్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇటీవల ఝార్ఖండ్ రాష్ట్రంలో విద్యార్థులు అసెంబ్లీని ముట్టడించిన ఘటనను, అలాగే 15 రోజుల కిందట ఢిల్లీలో పార్లమెంటు వైపు విద్యార్థులు చేపట్టిన ర్యాలీని గుర్తు చేశారు. ఆందోళనల తీవ్రతకు భయపడి పార్లమెంట్ గేట్లకు తాళాలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, అలాంటి స్ఫూర్తితోనే ఇక్కడ కూడా ప్రభుత్వాలను కదిలించేందుకు తెలంగాణ యువత ముందుకు రావాలని కోరారు. ప్రస్తుతం దేశంలో 15 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు యువజనుల జనాభా సుమారు 80 కోట్లు అని, వారే ఈ దేశానికి, రాష్ట్రానికి అసలైన భవిష్యత్ అని స్పష్టం చేశారు. యువత చదివిన చదువుకు ఉద్యోగాలు రావడం లేదని, పోటీ పరీక్షలు కూడా సరిగ్గా జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.సీసీఐని రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని, మూతబడిన పరిశ్రమ తెరుచుకుంటే స్థానిక యువతకే 6వేల ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న 772 ఎకరాల భూమితోపాటు మరో 1,500 ఎకరాల లీజు భూమి మొత్తం 2,300 ఎకరాల విలువైన భూమి ఉందని చెప్పారు. ఆ భూములపై కన్నేసి.. ప్రయివేట్ సిమెంట్ కంపెనీలను ప్రోత్సహించడం కోసమే రాజకీయ నాయకులు ఈ పరిశ్రమను మూయించారని ఆరోపించారు. 2018లో ఆదిలాబాద్ పర్యటన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాము అధికారంలోకి వస్తే సీసీఐని ఓపెన్ చేస్తామని హామీ ఇచ్చారని, ఎనిమిదేండ్లు గడిచినా ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలిచినా ఆ హామీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. 2014 నుండే సీసీఐ కోసం పోరాడుతున్నామని తెలిపారు. సీసీఐ సాధన కమిటీ కన్వీనర్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ.. సీసీఐని తెరుస్తారా? లేక బీజేపీని ఓడించమంటారా? అని ప్రశ్నించారు. పరిశ్రమ పునరుద్ధరణకు రూ.2వేల కోట్లు అవసరమని, అందులో రూ.1,500 కోట్లు బ్యాంకుల నుంచి, కేంద్ర ప్రభుత్వం రూ.250కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించినట్టు చెప్పారు.డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.
సీసీఐ పునరుద్ధరణతో విద్యార్థుల, యువకుల జీవితాలు మారుతాయని, ఉపాధి లభించి జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పారు. బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యంతోనే సీసీఐ మూతబడిందని, జిల్లాలోని ఏకైక కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన ఈ పరిశ్రమను పునరుద్ధరించాలని, తద్వారా వేలాది మంది విద్యార్థులు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర అధ్యక్షులు అనిల్, పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దింటి రామకృష్ణ, సీసీఐ సాధన కమిటీ కో-కన్వీనర్ విజ్జగిరి నారాయణ, కొండ రమేష్, లోకారి పోశెట్టి, వెంకటనారాయణ, అరుణ్‌కుమార్, బండి దత్తాత్రే, పూసం సచిన్, అన్నమొల్ల కిరణ్, ఈశ్వర్‌దాస్, చిలుక దేవిదాస్ పాల్గొన్నారు.
జెన్ జీ స్ఫూర్తితో సీసీఐ సాధనకు పోరాడండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



