ముంబయి : ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులైన కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) రుణ ఖాతాదారులపై వడ్డీ రేట్లను పెంచాయి. వివిధ కాలపరిమితుల రుణాలపై నిధుల వ్యయాధారిత వడ్డీ రేట్లను (ఎంసీఎల్‌ఆర్) 0.5-10 బేసిస్ పాయింట్ల (0.10 శాతం) వరకు పెంచుతూ ఈ రెండు బ్యాంకులు వేరు వేరుగా నిర్ణయం తీసుకున్నాయి. సవరించిన నూతన వడ్డీ రేట్లు బుధవారం నుంచే అమలులోకి వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల నిర్వహించిన ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో ప్రాథమిక రేపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన వారం రోజుల్లోనే ఈ పెంపు చోటుచేసుకోవడం గమనార్హం. ఎంసీఎల్‌ఆర్‌తో అనుసంధానమైన గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్న పాత, కొత్త రుణగ్రహీతలపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుండటంతో వారి నెలవారీ వాయిదాలు లేదా రుణ కాలపరిమితి పెరిగే అవకాశం ఉంది.
సవరించిన రుణ రేట్ల ప్రకారం.. కెనరా బ్యాంక్ విభిన్న కాలపరిమితులపై వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్లు పెంచడంతో ఆ బ్యాంకు లెండింగ్ రేట్లు 7.95 శాతం నుంచి 9.10 శాతానికి చేరాయి. మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంపిక చేసిన కాలపరిమితిపై రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచడంతో వడ్డీ రేట్ల శ్రేణి 7.85 శాతం నుంచి 8.75 శాతంగా మారింది.
వడ్డీ రేట్లను పెంచిన కెనరా, బీఓబీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



