లేకపోతే 29న ఇందిరాపార్క్
వద్ద మహాధర్నా
రాజకీయ ఖైదీల విడుదల ఐక్యవేదిక తెలంగాణ కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్
నవతెలంగాణ–బంజారాహిల్స్
వివిధ ఉద్యమాలు, ప్రజా సమస్యలపై పోరాటం చేసి కేసులపాలై జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని రాజకీయ ఖైదీల విడుదల ఐక్యవేదిక తెలంగాణ కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ నెల15న రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, లేకపోతే 29న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఐక్యవేదిక నాయకులు ధర్నాకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌తోపాటు తెలంగాణలో మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి సాధారణ జీవితం గడుపుతున్న పలువురు ఉద్యమ కారులపై అక్రమ కేసులు నమోదు చేసి జైళ్లలో పెడుతున్న పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో 15 ఏండ్లుగా మావోయిస్టులుగా ముద్ర వేసి పలువురిని జైళ్లలోనే ఉంచుతూ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించడం, ప్రజా సమస్యలను ఎత్తిచూపడం ఎలా తప్పవుతుందని ప్రశ్నించారు. చిన్నచిన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరిం చాల్సింది పోయి బాధితులపై కఠిన చట్టాలను ఉపయోగించడం వల్ల వారి కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మేధావుల సలహాలు, సూచనలను స్వీకరించి వాటిని ప్రజా సంక్షేమానికి వినియోగిం చుకోవాలని, అనవసరంగా కఠిన చట్టాలను అమలు చేస్తూ ప్రజల మనోవేదనకు కారణం కావడం సరికాదన్నారు. మేధావులు అంటే కేవలం ఉన్నత వర్గాలకు చెందినవారు కాదని, బడుగు, బలహీన వర్గాల గొంతుకలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్, ఎమ్మెల్సీ కోదండరామ్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, ప్రొఫెసర్ జి. లక్ష్మణ్, పీఓడబ్ల్యూ సంధ్య, టీయూసీఐఎస్‌ఎల్ పద్మ, లతీఫ్ ఖాన్, అరుణోదయ విమలక్క, డాక్టర్ ఉస్మాన్, రవి నార్ల తదితరులు పాల్గొన్నారు.
కోదండరామ్‌కు నిరసన సెగ
ప్రెస్‌క్లబ్ వద్ద ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్‌కు నిరుద్యోగుల నుంచి నిరసన ఎదురైంది. ఆయనను నిరుద్యోగులు అడ్డుకుని వారి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీ మాటలను నమ్మి తాము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశామని తెలిపారు. కానీ ఇప్పుడు ఉద్యోగాల వయోపరిమితి పెంపు విషయంలో ప్రభుత్వం స్పందిం చకున్నా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఇప్పటికైనా నిరుద్యోగుల వయోపరిమితి పెంపు అంశాన్ని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



