Thursday, August 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కూల్చివేతల విషయంలో హైడ్రా వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్, రెవెన్యూ అధికారులు ఎలాంటి సమాచారం లేదా ఆదేశాలు ఇవ్వకుండానే కూల్చివేతలు ఎలా చేపడతారని ప్రశ్నించింది. ప్రభుత్వ భూమి అని నిర్ధారించకుండా ప్రయివేటు స్థలాల్లోకి వెళ్లి కూల్చివేతలు చేపట్టడంపై నిలదీసింది. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? ప్రభుత్వ అధికారులతో సంబంధం లేకుండా సమాంతర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా సర్వే నంబర్లు 194/1, 211లోని వాణి కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ ప్లాట్ల కాంపౌండ్‌ గోడలను జులై 18న ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసిన వ్యవహారంపై పీచర లింగారావు మరో ఆరుగురితో కలిసి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌ బుధవారం విచారణ జరిపారు. 2022లో కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ, డీఆర్‌ఓ ఆదేశాలు లేకుండా కూల్చివేతలు చేపట్టడం ప్రాథమికంగా కోర్టు ధిక్కరణేనని కోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంలో స్పష్టమైన ఆధారాలున్నందున సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేస్తూ, సంబంధితులకు నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. సర్వే నంబర్‌ 194లో 12 ఎకరాల పట్టా భూమి ఉందనీ, అందులో నాలుగెకరాలు పట్టణ గరిష్ఠ భూ పరిమితి కింద ప్రభుత్వానికి వచ్చాయని ప్రభుత్వ న్యాయవాది కాట్రం మురళీధర్‌రెడ్డి వివరించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ కూల్చివేతల సమయంలో సర్వేయర్లు, తహసీల్దార్లు హాజరయ్యారా అని ప్రశ్నించింది. కోర్టుకు హాజరైన తిరుమలగిరి, మల్కాజిగిరి తహసీల్దార్లు కూల్చివేతల సమయంలో రెవెన్యూ అధికారులు ఎవరూ లేరని తెలిపారు. కూల్చివేతలకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. దీంతో కలెక్టర్‌ పరిధిలో ఎన్ని పిటిషన్లు దాఖలయ్యాయి, అవి ఏ దశలో ఉన్నాయో బాధ్యతలు చేపట్టిన వెంటనే తెలుసుకోరా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. కోర్టు కేసుల పరిస్థితి తెలుసుకునే అధికారి కూడా లేరా, కోర్టు ఆదేశాల గురించి తెలుసుకోరా అంటూ నిలదీశారు. రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకే కూల్చివేతలు చేపట్టామని హైడ్రా పదేపదే చెబుతున్నందున వాస్తవాలు తెలుసుకునేందుకే కలెక్టర్, తహసీల్దార్లను పిలిపించినట్లు తెలిపారు.

ప్రభుత్వ భూమి అని ఎలా నిర్ధారించారని హైడ్రాను ప్రశ్నించిన న్యాయమూర్తి, కలెక్టర్‌ లేదా రెవెన్యూ అధికారులు ధ్రువీకరించకుండానే ప్రయివేటు స్థలంలోకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది. వివాదంలో ప్రతివాదిగా ఉన్నప్పటికీ కౌంటర్‌ ఎందుకు దాఖలు చేయలేదని అడిగారు. హైడ్రా చర్యల కారణంగా అధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. యూఎల్‌సీ కింద భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందనీ, 2008లో పంచనామా నిర్వహించినప్పటికీ పిటిషనర్లకు నోటీసులు ఇచ్చినట్లు రికార్డుల్లో లేదని కోర్టు పేర్కొంది. ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డులన్నీ కలెక్టర్‌ ఆధీనంలో ఉంటాయనీ, అలాంటి కలెక్టర్‌ నిర్ధారించకుండానే కూల్చివేతలు ఎలా చేపడతారని ప్రశ్నించింది. మల్కాజిగిరి పరిధిలో 30 నుంచి 40 కూల్చివేతలు చేపట్టినట్లు హైడ్రా తరఫు న్యాయవాది చెప్పడంతో వాటిలో ఎన్నింటికి అనుమతి ఇచ్చారో కలెక్టర్‌ను కోర్టు ప్రశ్నించింది. రికార్డులను పరిశీలించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. హైడ్రాతో పాటు ఇతర అధికారులు కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను సెప్టెంబరు 9కి వాయిదా వేసింది.

విద్యుత్ ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయండి
తెలంగాణ ట్రాన్స్‌‌కో, జెన్‌‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియను ఆరు నెలల్లో సమీక్షించాలని ఆ సంస్థలను హైకోర్టు ఆదేశించింది. ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వంతో సంప్రదించి పూర్తి చేసేందుకు గడువు నిర్ణయించాలంది. ఈ మేరకు టీజీ జెన్‌కోకు ఆదేశాలి ఇచ్చింది. ప్రభావిత ఉద్యోగులకు సమీక్ష ప్రక్రియలో అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. 2014, జూన్‌ 2 నుంచి కల్పించిన అన్ని పదోన్నతు లను సమీక్షించాలంటూ తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడెపాక కుమార స్వామి, మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక బుధవారం మరోసారి విచారించారు. ఉన్నత కేడర్లలో పదోన్నతులు కల్పించే టప్పుడు సుప్రీంకోర్టు ఎం. నాగరాజ్, జర్నైల్‌ సింగ్, బీకే పవిత్ర, పన్నీర్‌ సెల్వం తీర్పు ల్లోని న్యాయ సూత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. అవసరమైతే ఆయా తీర్పుల ఆధారంగా విధానాన్ని రూపొందించి పదోన్నతులు కల్పించాలని పేర్కొన్నారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయండి
హైకోర్టులో బీఆర్ఎస్ తరఫున వాదనలు
​పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే విషయంలో స్పీకర్‌ అధికారానికి పరిమితులు ఉన్నాయని బీఆర్ఎస్ పిటిషనర్లు, బీజేపీ పిటిషన్ తరఫు న్యాయవాదులు వాదించారు. బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు అనంతరం కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయడమే పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు గా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలె యాదయ్య, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, టి. ప్రకాశ్‌గౌడ్, ఎ. గాంధీ, తెల్లం వెంకటరావు, సంజయ్‌కుమార్ లపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్‌ కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జి. జగదీశ్‌రెడ్డి, వివేకానంద, కె. సంజయ్, పల్లె రాజేశ్వర్‌రెడ్డి, సీహెచ్‌ ప్రభాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభా పక్షనేత ఎ. మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన 10 పిటిషన్లపై చీఫ్ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ జిఎం. మొహియుద్దీన్‌ల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. బీజేపీ, బీఆర్ఎస్ తరఫున సీనియర్‌ న్యాయవాదులు కె. వివేక్‌రెడ్డి, గండ్ర మోహన్‌రావు వాదిస్తూ.. అనర్హత పిటిషన్లను తిరస్కరించేం దుకు స్పీకర్‌ పరిగణనలోకి తీసుకున్న ఆధారాలను పిటిష నర్లకు అందించలేదన్నారు. కేవలం వార్తా కథనాల ఆధారం గా కాకుండా ఎన్నికల గెజిట్లు, అధికారిక పత్రాలు, నామి నేషన్‌ సమయంలో సమర్పించిన ఫారం-26 అఫిడవిట్లను ఆధారాలుగా సమర్పించామని తెలిపారు. అయినప్పటికీ వార్తా కథనాల మూలాలు, రిపోర్టర్లు, ఎడిటర్ల వివరాలు ఇవ్వలేదని స్పీకర్‌ ఉత్తర్వుల్లో పేర్కొనడం సరికాదన్నారు. స్పీకర్‌ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిం చారనీ, రికార్డుల్లో లేని అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయానికి వచ్చారని వాదించారు. సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ.. పదో షెడ్యూల్‌ కింద స్పీకర్‌కు ట్రిబ్యునల్‌ చైర్మెన్‌గాఈ స్వేచ్ఛాధికారం లేదనీ, ముందున్న వాస్తవాలను నిర్ధారించి, అవి రుజువైతే అనర్హత వర్తించేలా నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. అనర్హత అంశం పార్టీ సభ్యత్వానికి సంబంధించినదేననీ, ప్రభుత్వ మనుగడకు సంబంధించింది కాదన్నారు. సభ వెలుపల జరిగిన రాజకీయ కార్యకలాపాలపై అనర్హత ఉంటే గవర్నర్‌ను ఆశ్రయించాలని స్పీకర్‌ పేర్కొనడం సరికాదన్నారు. స్పీకర్‌కు పరిధి లేదనుకుంటే గవర్నర్‌కు ఎందుకు సిఫారసు చేయలేదని ప్రశ్నించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -