రాష్ట్రంలో కొత్తగా 460 కేంద్రాలు
మొత్తం పీఎస్‌ల సంఖ్య 36,353
551 కేంద్రాలు ఇతర ప్రాంతాలకు తరలింపు
పేరు మార్చినవి 335..రద్దు లేదా కలిపినవి 92
వివరాలు వెల్లడించిన ఎన్నికల సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ర్టంలో అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ పూర్తయింది. ఈ మేరకు బుధవారం రాష్ర్ట ఎన్నికల సంఘం వివరాలు వెల్లడించింది. మార్పులు, చేర్పుల అనంతరం గతంలో ఉన్న 35,985 పోలింగ్ స్టేషన్లను 36,353కు పెంచారు. కొత్తగా 460 స్టేషన్లను ఏర్పాటు చేయగా, 92 స్టేషన్లను రద్దు లేదా ఇతర స్టేషన్లలో మెర్జర్ చేశారు. 551 కేంద్రాలను ఇతర ప్రాంతాలకు తరలించగా, 335 స్టేషన్ల పేరు మార్చారు. క్రమబద్ధీకరణ తర్వాత 368 పోలింగ్ స్టేషన్లు అదనంగా పెరిగాయి. అత్యధికంగా నల్లగొండలో 49, ఆ తర్వాత హైదరాబాద్ జిల్లాలో 25 పోలింగ్ స్టేషన్లు పెరిగాయి. ఇతర ప్రాంతాలకు తరలించిన స్టేషన్లలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మొదటి, రెండు స్థానాల్లో నిలిచాయి. వరుసగా ఆయా జిల్లాల్లో 117, 95 పోలింగ్ కేంద్రాలను ఇతర ప్రాంతాలకు తరలించారు. రంగారెడ్డి జిల్లాలో 57, పెద్దపల్లి జిల్లాలో 21 స్టేషన్లను రద్దు చేశారు. అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా చూస్తే బహదూర్ పురాలో 18, నాగర్ కర్నూల్‌లో 15, అచ్చంపేటలో 14 పోలింగ్ కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేశారు.
రెండు కిలోమీటర్ల క్రైట్ ఏరియా…
పోలింగ్ శాతం పెంచడం, వృద్ధులు, మహిళలను పరిగణనలోకి తీసుకుని ఏర్పాటు చేయాలనే కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) మార్గదర్శకాల ప్రకారం రాష్ర్టంలోని అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా పోలింగ్ కేంద్రాలను క్రమబద్ధీకరించారు. రెండు కిలోమీటర్ల పరిధిలో పోలింగ్ స్టేషన్ అందుబాటు, 1,200 నుండి 1,500 మంది ఓటర్లు, సున్నితమైన ప్రాంతాలు, ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లు, మతపరమైన ప్రదేశాలు లేదా రాజకీయ నాయకుల నివాసాలను పరిగణనలోకి తీసుకుని పోలీంగ్ స్టేషన్లను క్రమబద్దీకరించారు. ఒకే కుటుంబంలోని వ్యక్తుల ఓటు ఒకే స్టేషన్లో ఉండేలా ఏర్పాటు చేశారు.



