Thursday, August 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసబ్‌ప్లాన్‌ నిధులు 
పక్కదారి పడితే కఠిన చర్యలు

సబ్‌ప్లాన్‌ నిధులు 
పక్కదారి పడితే కఠిన చర్యలు

- Advertisement -


ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మెన్‌
 బక్కి వెంకటయ్య
నల్లగొండ కలెక్టరేట్‌‌లో సమీక్ష
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

​ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను ఇతర పనులకు మళ్లించకుండా నిర్దేశిత వర్గాల అభివృద్ధికే వినియోగించాలని, నిధులు దారి మళ్లిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మెన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. షెడ్యూల్డ్‌ కులాలు, తెగల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు కావాలని చెప్పారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో బుధవారం కమిషన్‌ సభ్యులతో కలిసి ఎస్సీ, ఎస్టీల భూముల సమస్యలు, దాడుల కేసులు, ఉద్యోగాలు, ప్రమోషన్లలో రిజర్వేషన్‌ అమలు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ ఆవాసాల్లో చేపట్టేందుకు మంజూరైన పనులను ఇతర ప్రాంతాలకు మళ్లించరాదని, సబ్‌ప్లాన్‌ నిధులు మిగిలితే తిరిగి ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రోడ్లు, ఇతర మౌలిక వసతుల కోసం వినియోగించాలని సూచించారు. ఎంపీ, నియోజకవర్గ అభివృద్ధి, ఎస్‌డీఎఫ్‌ నిధుల్లోనూ రిజర్వేషన్‌ ప్రకారం కేటాయింపులు ఉండాలని చెప్పారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకంపై తక్షణమే విచారణ జరిపి కమిషన్‌కు నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ దాడుల కేసుల్లో బాధితులకు అందాల్సిన రూ.1.89 కోట్ల పరిహారం, కులాంతర వివాహాల ప్రోత్సాహకాలు, బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలకు నిధుల కోసం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే హైపవర్‌ కమిటీ సమావేశంలో కోరనున్నట్టు తెలిపారు. సమీక్షలో కమిషన్‌ సభ్యులు జిల్లా శంకర్‌, రాంబాబు నాయక్‌, కె.లక్ష్మీనారాయణ, అడిషనల్‌ కలెక్టర్‌ జె. శ్రీనివాస్‌, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ ప్రేమకరణ్‌రెడ్డి, శిక్షణ సహాయ కలెక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శశికళ, డీటీడీఓ కమలాకర్‌, డీఎఫ్‌ఓ రాజశేఖర్‌, డీఆర్‌ఓ దశరథ్‌, ఆర్డీవోలు, డీఎస్పీలు, జిల్లా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు సుంకు ధనలక్ష్మి, బెజ్జం సైదులు, అనిత, భీమనపల్లి సైదులు, భాస్కర్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -