భార్యాభర్తలను చంపి పాతిపెట్టిన వైనం
నవతెలంగాణ -మోతే
సూర్యాపేజిల్లా మోతె మండలం సమీపంలో భార్యాభర్తల దారుణ హత్య బుధవారం తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీక్యా తండాకు చెందిన హలావత్ నాగు(50), భూబా(40) దంపతులు రెండేండ్ల కిందట పొట్టకూటి కోసం మోతె మండల కేంద్రానికి వచ్చారు. బొక్క అమృత రెడ్డికి చెందిన కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని దుండగులు దంపతుల తలపై తీవ్రంగా కొట్టి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆధారాలు లభించకుండా మృతదేహాలను ప్లైఓవర్‌కు సమీపంలో పూడ్చిపెట్టారు. బుధవారం ఉదయం ఓ రైతు పొలం వద్దకు వెళ్తుం డగా దారిలో రక్తం మరకలు కనిపించాయి. సమీంలోనే భూమిలో మహిళ కాలి వేలు కనిపించడంతో స్థానిక పోలీస్ స్టేషన్ కు సమా చారం ఇచ్చారు. ఎస్‌ఐ లచ్చిరెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించారు. రెండు మృతదేహాలను గుర్తించి ఎస్పీ నర్సింహ, కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మునగాల సీఐకి సమాచారమిచ్చారు. మునగాల సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బలగాలు రంగం లోకి దిగాయి. ఎస్పీ నరసింహ ఘటనస్థలాన్ని పరిశీలించారు. పూడ్చిపెట్టిన మృతదేహాలను బయటకు తీయగా, వారు బీక్యా తండాకు చెందిన నాగు, భూబాగా తండా వాసులు గుర్తించారు. హంతకులు ఎవరు? పాతకక్షలా? లేక ఆర్థిక లావాదేవీలా? అనే కోణంలో ఎస్పీ నరసింహ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. తహసీల్దార్ వెంకన్న, సూర్యాపేట నుంచి వచ్చిన క్లూ టీం సభ్యు లు పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
నేరస్తులు ఎంతటి వారైనా వదిలిపెట్టం: ఎస్పీ
హలావత్ నాగు, భూబా దంపతులను హత్య చేసిన నేరస్థులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని ఎస్పీ నరసింహ అన్నారు. బుధవారం ఘటనా స్థలాన్ని సందర్శించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. మండల కేంద్రంలో ఒక రైతు దగ్గర వారు భూమిని కౌలుకు తీసుకొని జీవిస్తున్నారని తెలిపారు. ఆ దంపతులను చంపి స్థానిక ఫ్లైఓవర్ మార్గం సమీపంలో పూడ్చిపెట్టడానికి కారణాలను పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కేసును మునగాల సీఐ రామకృష్ణారెడ్డికి అప్పగించి త్వరలో ఛేదిస్తామన్నారు.
మోతెలో జంట హత్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



