నవతెలంగాణ హైదరాబాద్: దేశరాజధాని ఢీల్లీలో ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ జెండా ఎగురవేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఈ వేడుకల్లో ఆలపించారు. జెండా ఎగురవేయడానికి ముందు ప్రధాని మోడీ .. రాజ్‌ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రకోట వద్ద గౌరవవందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలు ప్రారంభమైన సమయంలో వాయుసేన పూలవర్షం కురిపించింది.
అనంతరం ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ఈ రోజు మనమంతా 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. ప్రతి హృదయంలో ‘వందేమాతరం’ ధ్వనిస్తోంది. ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. కొత్త తీర్మానాలతో సరికొత్త ఉత్సాహంతో దేశం ముందుకు సాగుతోంది. గతంలో ఐదు బలహీన దేశాల జాబితాలో ఉన్న భారత్.. 12 ఏండ్ల తర్వాత ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థగా మారింది’’ అని ప్రధాని అన్నారు.



