Thursday, April 2, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఖర్చులేని కేటాయింపులు ఎవరికోసం?

ఖర్చులేని కేటాయింపులు ఎవరికోసం?

- Advertisement -

తాము అధికారంలోకి వస్తే గత పాలన కంటే అద్భుతంగా ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ గిరిజనులను నమ్మించింది. బీఆర్‌ఎస్‌ రిజర్వేషన్‌ల పెంపు, తండాలను పంచాయతీలు చేయడం వంటివి చేసినా చేవెళ్ల డిక్లరేషన్‌ పేరుతో కాంగ్రెస్‌ ఇచ్చిన పదిహేను రకాల హామీలవైపే గిరిజనం మొగ్గుచూపింది. అందుకే ఎస్టీ రిజర్వుడు స్థానాలతో పాటు గిరిజనులు గణనీయంగా ఉన్న మరో నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించింది. అంతటి నమ్మకాన్ని ప్రదర్శించిన గిరిజనుల పట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వారిలో తీవ్ర వ్యతిరేకతను, అసంతృప్తిని తీసుకొచ్చింది. ఇచ్చిన హామీలన్నీ ఆరు నెలల్లోపు అమలు చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సాక్షిగా ప్రకటించింది. గత రెండేళ్లుగా హామీలను అమలు చేస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూసిన నలభై లక్షల మంది గిరిజనుల ఆశలను వమ్ము చేసింది.మూడో ఏడాది బడ్జెట్‌లో సైతం తీవ్ర నిరాశను మిగిల్చింది.

2026-27బడ్జెట్‌ను ఆర్థిక శాఖమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గిరిజనులకు రెండు రకాల బడ్జెట్‌ కేటాయింపులు ఉంటాయి. మొదటిది గిరిజన సంక్షేమానికి ఆ శాఖకు కేటాయించే బడ్జెట్‌ కాగా రెండోది మిగిలిన అన్నిశాఖలు గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం గిరిజన సబ్‌ప్లాన్‌ పేరుతో కేటాయింపులు చేస్తుంది. కానీ, గిరిజన సబ్‌ప్లాన్‌లో వేల కోట్ల రూపాయలు కేటాయింపులు చేసినట్లు బడ్జెట్‌ పుస్తకాల్లో చూపినా అవి ఏమాత్రం గిరిజనుల అభివృద్ధికి, సంక్షేమానికి దోహదపడవు. ఆ నిధులు ఖర్చు చేయకుండా ఖర్చు చేసినట్టు ఆయా శాఖలు దొంగలెక్కలు చూపి అంకెల గారడీకి పాల్పడుతుంటాయి. గిరిజన సంక్షేమశాఖకు కేటాయించే నిధులే వాస్తవంగా గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ఖర్చు అవుతుంటాయి. గిరిజన సబ్‌ప్లాన్‌ పేరును మార్చి గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధుల పేరుతో కేటాయింపులను చేస్తుంది.

ఈ రెంటికీ కలిపి ప్రభుత్వం 2026-27బడ్జెట్‌లో 18,745 కోట్లు కేటాయించింది. ఇందులో గిరిజన సంక్షేమానికి 7,937 కేటాయింపులు చూపింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండేండ్లకాలంలో గిరిజన సంక్షేమశాఖకు కేటాయించే అరకొర నిధులను సైతం ఖర్చు చేయలేదు. గత ప్రభుత్వ పాలనలో వేలకోట్లు గిరిజన నిధులు దారిమళ్లించి దోపిడీ చేసిందని ఆరోపించిన కాంగ్రెస్‌ సైతం అదేవిధంగా అనుసరిస్తోంది. తాము అధికారంలోకి వస్తే గిరిజన నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేస్తామన్న ఆ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో హామీని పూర్తిగా విస్మరించింది. అందుకే గిరిజన సబ్‌ప్లాన్‌ గురించి ఇక్కడ ప్రస్తావించడం సమంజసం కాదు. సహజంగా బడ్జెట్‌లో సులభంగా దోపిడీ చేయడానికి దళిత, గిరిజన నిధులే ప్రాధాన్యతగా ప్రభుత్వాలు ఎంచుకుంటాయి. ఎందుకంటే, ఈ తరగతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు పదవులు పోతాయనే భయంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించరు, నిలదీయరనే ధీమానే ప్రధాన కారణం.

దశాబ్దాలుగా గిరిజన సంక్షేమశాఖ గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి దోహదపడుతూ వస్తోందనే గట్టి నమ్మకం గిరిజనుల్లో ఉన్నది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన సంక్షేమశాఖ నిధులను లూటీ చేస్తూ జీవచ్ఛవంలా మారుస్తోందనే విమర్శలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ శాఖకు గత రెండు బడ్జెట్‌లలో కేటాయించిన నిధులు, ఖర్చు పరిశీలిస్తే అదే తేటతెల్లమవుతోంది.
2024-25లో రూ.3,298 కోట్లు, 2025-26లో రూ.6,866 కోట్లు, మొత్తం 10,158 కోట్లను కేటాయించగా ఇందులో కేవలం రూ.3,760 కోట్లు మాత్రమే ఖర్చు చేసి నట్టు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. మిగిలిన 6,398 కోట్లు నిధులు ఖర్చు చేయకుండా దారి మళ్లినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ నిధులు ఎక్కడికెళ్లాయి? అందరూ ఆరోపిస్తున్నట్లు బడా కాంట్రాక్టర్లకు చెల్లించిన వాటిలో ఇవి ఉన్నాయా? లేక కర్నాటక, బీహార్‌, రాష్ట్రాలతో పాటు జరగబోయే కేరళం ఎన్నికల కోసం లూటీ చేసిందా? ఎందుకంటే, కేటాయించిన నిధులకు, సవరించిన అంచనాలకు, ఖర్చు పెట్టిన లెక్కల్లో ఎక్కడా పొంతన లేదు.

గత రెండేండ్లలో ఒక్క రూపాయీ ఖర్చుచేయని ముఖ్యమైన పద్దులే గణనీయంగా ఉన్నాయి. దశాబ్దాలుగా గిరిజనులకు ఆర్థికంగా ఎంతగానో దోహదపడుతున్న ట్రైకార్‌ సంస్థకు ప్రస్తుత సర్కార్‌ అధికారంలోకి వచ్చిన మొదటి బడ్జెట్‌లో రూ.300 కోట్లు, తర్వాత బడ్జెట్‌లో మరో రూ.300కోట్లు మొత్తం 600 కోట్లలో ఒక్క రూపాయీ ఖర్చు చేయలేదు. అందుకు ఆ రెండేండ్లలో యాక్షన్‌ ప్లానే లేదు, ఇక ఖర్చు ఎలా సాధ్యం? స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతంలోని యువతను ఆకర్షించేందుకు ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రాజీవ్‌ యువ వికాసం పథకానికి గతేడాది బడ్జెట్‌లో 360 కోట్లు కేటాయించింది. ఆన్‌లైన్‌లో వేలమంది గిరిజన యువత నుంచి తీసుకున్న దరఖాస్తుల్లో ఒక్కరికి కూడా చెల్లించలేదు. ఈ నిధులు ఎటు పోయాయో ప్రభుత్వం సమాధానం లేదు. కానీ, ప్రస్తుత బడ్జెట్‌లో 1310 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది.

గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు 2017లో నాటి ముఖ్యమంత్రి పారిశ్రామిక ప్రోత్సాహ పతకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి రెండు బడ్జెట్‌లలో 72.50 కోట్లను కేటాయిం చింది. ఈ నిధులు ఖర్చు చేయకపోగా 2023-24లో లబ్ధిదారులను ఎంపిక చేసింది.12.50 కోట్ల రూపాయల చెక్కులను సిద్ధం చేసి టోకెన్లు సైతం ఇచ్చి నేటికీ నిధులివ్వకుండా జాప్యం చేస్తోంది.
గిరిజన విద్యార్థులకు స్కాలర్‌ షిప్పుల పేరుతో కేటాయించిన నిధుల్లోనూ యాభై శాతం కూడా ఖర్చు చేయడం లేదు. వారంతా గతేడాదికాలంగా స్కాలర్‌ షిప్‌లు, మెస్‌ ఛార్జీలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. గత మూడేళ్ల కాలంలో బెస్ట్‌ అవైలబుల్‌ పథకంలో పేద విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.55కోట్లను సైతం ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదు.

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేసిన ఫలితంగా కేవలం పది కోట్లను విడుదల చేసి చేతులు దులుపుకున్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 275(1) కింద ఐటీడీఏల అభివృద్ధికి కేటాయించిన 115కోట్లను సైతం సం పూర్ణంగా ఖర్చు చేయలేదంటే ఈ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉందో అర్థమవుతోంది. మేడారం జాతరకు రెండేళ్లలో 204 కోట్లు కేటాయించగా సగం నిధులే ఖర్చుచేసినట్టు, మిగిలిన పనులు త్వరలో పూర్తి చేస్తామని ప్రభుత్వమే చెప్పింది. నాగోబా జాతర, సేవాలాల్‌ జయంతి, కొమరం భీమ్‌ జయంతి వంటి గిరిజన జాతర లకు 2024లో రూ.7.45కోట్లు, 2025లో15 కోట్లు కేటాయించగా రెండు బడ్జెట్‌లలో కలిపి ఐదుకోట్లు మాత్రమే ఖర్చుచేసింది. గత రెండు బడ్జెట్‌లలో రూ. 6 వేలకోట్లకు పైగా గిరిజన నిధులు లూటీ చేసినట్లు పైలెక్కలే నిదర్శనం.

ఆర్‌.శ్రీరాం నాయక్‌
9440532410

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -