నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ : ఆగస్టు 15వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో డ్రైహెలీ శకటానికి ప్రతిభ ప్రశంసా అవార్డు లభించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, డ్రైవేస్ట్ సేకరణను ప్రోత్సహించడం, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం లక్ష్యంగా చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును శనివారం తెలంగాణ రాష్ట్ర రవాణా బి సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , జిల్లా కలెక్టర్ హైమావతి చేతుల మీదుగా హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ టి. మల్లికార్జున్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ రవి కుమార్, జవాన్ శ్రీకాంత్,సిబ్బంది కిరణ్, సురేష్,రాజు అందుకున్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ రూపొందించిన డ్రై హెలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక సాధారణ తోపుడు బండిని హెలికాప్టర్ ఆకారంలో వినూత్నంగా రూపొందించి, దాని ద్వారా డ్రై వేస్ట్ మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను సేకరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రజల నుంచి సేకరించిన ప్లాస్టిక్ బాటిళ్లను సృజనాత్మకంగా వినియోగించడం ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
డ్రై హెలీ ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడంతో పాటు, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జ్యూట్ బ్యాగుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్ సభ్యులు,మున్సిపల్ అధికారులు, మరియు డ్రై హెలీ కార్యక్రమంలో భాగస్వాములైన సిబ్బందిని అభినందించారు.



