Monday, August 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం సభకు కీలక నేతలు దూరం.. 

సీఎం సభకు కీలక నేతలు దూరం.. 

- Advertisement -

పరకాల కాంగ్రెస్‌లో కలకలం..!
వేదికపై కనిపించని ముఖ్య నేతలు.. 
ఎన్నికల తర్వాత మారిన సమీకరణాలపై చర్చ 
అసంతృప్తి ఉందా..? ఆహ్వానాల వ్యవహారమే కారణమా..?

నవతెలంగాణ – పరకాల : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరకాల పర్యటన కాంగ్రెస్‌ పార్టీలో కొత్త రాజకీయ చర్చకు తెరలేపింది. ముఖ్యమంత్రి పాల్గొన్న అభివృద్ధి కార్యక్రమాలు, బహిరంగ సభను అధికార పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించినప్పటికీ.. పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు సభకు దూరంగా ఉండటం ఇప్పుడు పరకాల కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
ముఖ్యంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి విజయానికి గతంలో కీలకంగా పనిచేసిన నాయకులు, ముఖ్య కార్యకర్తల్లో కొందరు సీఎం సభలో కనిపించకపోవడం రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది. దీంతో ‘ఎన్నికల సమయంలో అవసరమైన నేతలు.. ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు..?’ అన్న ప్రశ్న హ చర్చనీయాంశంగా మారింది. 

హెలిప్యాడ్‌ వద్ద స్వాగతం.. సభ వేదికపై గైర్హాజరు
డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్‌ ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి సీఎం హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుని రేవంత్‌రెడ్డికి స్వాగతం పలికారు. అయితే అనంతరం జరిగిన బహిరంగ సభ వేదికపై ఆయన కనిపించకపోవడం చర్చకు దారితీసింది. అంతేకాకుండా సభకు సంబంధించిన ఆహ్వానితుల జాబితాలోనూ ఆయన పేరు కనిపించలేదన్న ప్రచారం కాంగ్రెస్‌ శ్రేణుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఇదే సమయంలో ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి సభ వేదిక వైపు వెళ్లే సమయంలో భద్రతా సిబ్బంది అడ్డుకున్నారనే ప్రచారం కూడా స్థానికంగా వినిపించింది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ధ్రువీకరణ లేకపోవడంతో ఆయన సభకు ఎందుకు హాజరు కాలేకపోయారన్నది మాత్రం స్పష్టత లేని అంశంగానే మిగిలింది.

మంత్రి, మాజీ ఎమ్మెల్యే గైర్హాజరుపైనా చర్చ
మరోవైపు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సీఎం కార్యక్రమానికి హాజరుకాకపోవడం, మాజీ ఎమ్మెల్యే ములుగూరి భిక్షపతి కూడా సభకు దూరంగా ఉండటం చర్చకు మరింత ఆజ్యం పోసింది. ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమం అధికార పార్టీకి చెందిన నేతలంతా ఒకే వేదికపై తమ ఐక్యతను చాటాల్సిన సందర్భం. అలాంటి సమయంలో ముఖ్య నేతల గైర్హాజరు కావడంతో పార్టీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

ఎన్నికల నాటి ఐక్యత.. ఇప్పుడు ఎక్కడ..?
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి విజయానికి పలువురు నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తమ వంతు పాత్ర పోషించారు. అయితే ఎన్నికల అనంతరం ఏర్పడిన రాజకీయ పరిస్థితుల్లో వారిలో కొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్న చర్చ వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో భుజం తట్టిన నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్థాయిలో ప్రాధాన్యం పొందడం లేదన్న అసంతృప్తి ఉందా..? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. 

సభకు రాని నేతల వెనుక అసలు కథ ఏమిటి..?
కీలక నేతల గైర్హాజరును కేవలం వ్యక్తిగత కారణాలతోనే చూడాలా..? లేక దాని వెనుక రాజకీయ అసంతృప్తి ఉందా..? అన్నదానిపై పరకాల కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయనే ప్రచారానికి నేతల గైర్హాజరు మరింత బలం చేకూరుస్తోందని కొందరు భావిస్తుండగా.. మరోవైపు వ్యక్తిగత, అధికారిక లేదా ఇతర కారణాలతోనే కొందరు నేతలు కార్యక్రమానికి హాజరుకాలేదని మరికొందరు చెబుతున్నారు. అయితే వాస్తవ పరిస్థితి ఏంటన్నది ఆయా నాయకుల స్పందనతోనే తేలాల్సి ఉంది. 

బలప్రదర్శన వేదికలో బలహీన సంకేతాలా..?
ముఖ్యమంత్రి పర్యటన అంటే అధికార పార్టీకి రాజకీయ బలాన్ని ప్రదర్శించే కీలక అవకాశం. స్థానిక నాయకత్వం, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటాల్సిన సందర్భం. కానీ అదే వేదికకు కీలక నేతలు దూరంగా ఉండటం ఇప్పుడు మరో రకమైన రాజకీయ సంకేతాలకు కారణమైంది.

పరకాల కాంగ్రెస్‌లో అంతా సవ్యంగానే ఉందా..?
లేక లోపల అసంతృప్తి మంటలు రగులుతున్నాయా..? ఎన్నికల తర్వాత రాజకీయ ప్రాధాన్యతలు మారిపోయాయా..? కీలక నేతలకు పార్టీలో దక్కుతున్న ప్రాధాన్యంపై అసంతృప్తి ఉందా..? ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి పరకాల పర్యటన అభివృద్ధి కార్యక్రమాల కంటే.. కాంగ్రెస్‌లో కనిపించని నేతల గైర్హాజరుతోనే రాజకీయ చర్చకు కేంద్రంగా మారడం విశేషం. రాబోయే రోజుల్లో ఈ నేతల స్పందనలు, పార్టీ అంతర్గత పరిణామాలు పరకాల కాంగ్రెస్‌లో వాస్తవంగా ఏం జరుగుతోందో స్పష్టం చేసే అవకాశముంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -