ఎవరూ స్పృశించని సమకాలీన సమస్యలను తీసుకొని, వాటిని నవలలుగా మలచడంలో మెట్టు మురళీధర్ ప్రత్యేకతనే వేరు. గతంలో కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, అది ప్రజల జీవితాలలో సృష్టించిన సంక్షోభాన్ని వివరిస్తూ “ఆ యాభై రోజులు” నవల రాశాడు. కరోనా విజృంభణను, కరోనా వల్ల చెల్లాచెదురైన జీవితాలను, వలస కూలీల విషాదాన్ని “కనిపించని శత్రువు” లో చిత్రించారు. పారంపర్యంగా వచ్చే రైతుల భూములు, పొలాలు ధరణి పోర్టల్ తో , వారివి కాకుండా చేసే మాయాజాలాన్ని”ధరణి” నవలలో బట్టబయలు చేశారు. ప్రభుత్వం నడిపించే ఎన్నో వ్యవస్థల్లో రెవెన్యూ వ్యవస్థ అతి ముఖ్యమైనది. ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా రెవెన్యూ వ్యవస్థ కుదుపులకు లోనవుతోంది. చట్టాలంటూ, సవరణలంటూ పాలకులు, తమ మార్క్ ను అందులో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే రెవెన్యూ వ్యవస్థ ఒక ప్రయోగశాల అయింది. ఏ ప్రభుత్వం వచ్చినా చట్టాలు, సవరణలు చేస్తున్నారు తప్ప రైతుల సమస్యలకు మూల కారణమైన ‘సమగ్ర భూ సర్వే’ చేయడం లేదు. నిజాం కాలంలో జరిగిన సర్వే నే ఇప్పటికీ మనకు ఆధారంగా ఉంది. అందుకే భూ సమస్యలు పెరిగిపోతున్నాయి. మలిదశ తెలంగాణ ప్రజా ఉద్యమం ఫలితంగా ఏర్పడిన కొత్త తెలంగాణ రాష్ట్రంలో కూడా, ప్రజలు ఊహించని రీతిలో పరిపాలన సాగింది. పది జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా విభజించి, అధికారాన్ని వికేంద్రీకరించామని చెబుతూనే మరింత కేంద్రీకరించారు.
రాష్ట్ర అవతరణకు ముందున్న గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను రద్దు చేశారు. ఆర్డీవోలకు, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్లకు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు, భూసేకరణ అధికారులకు ఏ అధికారాలు లేకుండా చేశారు. వారికి పైన ఉండే అధికారులైన జాయింట్ కలెక్టర్లకు, అడిషనల్ జిల్లా మెజిస్ట్రేట్ లకు ఉన్న అధికారాలను కూడా తీసేశారు. గతంలో మండల స్థాయిలో తహసిల్దారుచే స్థానికంగా పరిష్కారమైన భూ సంబంధిత తగాదాలు, పంచాయితీ తదితర వ్యవహారాలన్నింటిని సివిల్ కోర్టులో తేల్చుకోమని చెప్పింది ఆనాటి తెలంగాణ ప్రభుత్వం. పైగా భూ సమస్యలన్నింటినీ ధరణి పోర్టల్ ఒక్కటే పరిష్కరిస్తుందని, అదే సర్వరోగ నివారిణి అన్నట్లుగా ఊదరగొట్టింది. అయితే ధరణి పోర్టల్ రావడంతో గతంలో తహసిల్ స్థాయిలో, తహసీల్దార్ నిఘాలో ఉండిన ప్రభుత్వ, ప్రైవేటు భూముల రికార్డులన్నీ ఒక్కసారిగా పబ్లిక్ డొమైన్ లోకి వెళ్లిపోయాయి. ఫలితంగా చట్టప్రకారం కస్టోడియన్ గా ఉండాల్సిన ప్రభుత్వం, రైతుల భూములను కాపాడుతామనే భరోసా ఇవ్వలేని దుస్థితికి దిగజారింది. పైగా పారదర్శతకు మారుపేరని చెబుతున్న డిజిటల్ యుగంలో, కంప్యూటర్ యుగంలో ఎవరైనా, ఎక్కడి నుంచైనా ధరణి పోర్టల్ లోని సమాచారాన్ని తారుమారు చేసే అవకాశాన్ని స్వార్థపరశక్తులకు ఇచ్చినట్టు అయింది. పట్టాదారుల ప్రమేయం లేకుండానే దొంగ సంతకాలు సృష్టించి అన్నదాతలైన పేద, చిన్న, సన్నకారు రైతుల జీవితాలను తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్న దుస్థితి ఏర్పడింది.
మెట్టు మురళీధర్ రాసిన “ధరణి” నవల అటువంటి సంక్షోభాన్ని కళ్ళకు కట్టినట్లుగా పాఠకుల ముందు ఉంచింది. ఇందులో తల్లీ కొడుకులైన గౌరీ, గౌతం లు ప్రధాన పాత్రలు. గౌతం తండ్రి ఇద్దరు తాతలు తెలంగాణ విముక్తి కోసం తమ ప్రాణాల్ని అంకితమిచ్చారు. ఒక తాత నర్సింహులు, నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణను విముక్తి చేసే పోరాటంలో అసువులు బాశాడు. మరో తాత వీరమల్లు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన తొలిదశ తెలంగాణ ఉద్యమంలో పోలీసుకాల్పులకు బలయ్యాడు. ఇక తండ్రి సాంబశివుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మత్యాగం చేసుకున్నాడు. ఇలా తెలంగాణ కోసం ముగ్గురు వీరులని అంకితం ఇచ్చిన ఉన్నత కుటుంబం వారిది. అలాంటి కుటుంబానికి మున్నా అనే ఒక అవినీతి పొలిటికల్ లీడర్ వల్ల భయంకరమైన ఒక ఉపద్రవం వచ్చింది. గౌరీ కున్న రెండెకరాల భూమిని చట్టాల్లోని లొసుగులను ఆధారం చేసుకుని అక్రమంగా ఆక్రమించుకున్నాడు. మున్నా ఆ ఆక్రమణకు ధరణి రక్షణ కల్పించింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ సమాజం అమరవీరుల కుటుంబానికి మద్దతు ఇస్తుందా? లేక అవినీతి పొలిటికల్ లీడర్ కు వంత పాడుతుందా? అనేది ముఖ్యమైన విషయం గా పరిణమిస్తుంది.
ఇదే ఈ నవలకు కేంద్ర బిందువు. తమ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో గౌతం వేసే అడుగులు, ధరణి కారణంగా ఎదురవుతున్న అడ్డంకులే ఈ నవలలో ప్రధాన ఇతివృత్తం. వీటితోపాటు మితిమీరిన రాజకీయ జోక్యం, అపరిణత రాజకీయ నిర్ణయాలు సమాజాన్ని ఎంతగా దిగజారుస్తాయో, ధరణి నవల అద్భుతంగా చిత్రించింది. సామాజిక సంఘటితత్వం, అమలిన రాజకీయాలు, విలువల పరిరక్షణ – ఇవి మాత్రమే ఉన్నత సమాజ నిర్మాణానికి దోహదం చేస్తాయని ఆకాంక్షను నవల వెలిబుచ్చింది. ఇంకా ఇందులో కనిపించే తెలంగాణ సంప్రదాయాలు, చిట్ ఫండ్ మోసాలు, గిరి గిరి బ్యాంకు వడ్డీ వసూళ్లు, గ్రామీణ సంతలు మొదలైనవి – ఈ నవల యొక్క విస్తృతిని పెంచి నవలకు నిండుదనాన్ని ఇచ్చాయి.
కె పి అశోక్ కుమార్, 9700000948



