సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాల స్వీకరణ
అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా విడుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో భాగంగా సోమవారం ముసాయిదా ఓటర్ జాబితాను రాష్ర్ట ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. రాష్ర్టంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుకు గాను 2,64,87,214 మంది ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి నిర్దేశిత గడువు ఆగస్టు 10 వరకు ఎన్నికల సంఘానికి అందజేశారు. అందులో 2002 సర్‌తో మ్యాపింగ్ కాని 89.88 లక్షల మంది, పేరు, ఇంటి పేరు, ఇతర తేడాలతో పాటు సరైన పత్రాలు అందజేయని దాదాపు 50 లక్షల మంది ఓటర్లు కూడా ఉన్నారు. జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు ఎన్యూమరేషన్ల పంపిణీ, వాటి స్వీకరణ అనంతరం మొత్తం 73,39,234 ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. అందులో మరణించిన వారు 9,22,230, శాశ్వతంగా వలస వెళ్లిన వారు 45,18,961, ఆచూకీ లభించని ఓటర్లు 11,25,546, ఇప్పటికే ఎన్రోల్ అయిన ఓటర్లు 6,70,203, ఇతరులు 1,02,294 మంది ఉన్నారు. నేటి నుంచి సెప్టెంబర్ 16 వరకు నెల రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అక్టోబర్ 15 వరకు ఓటర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి, 19న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.



