- నవతెలంగాణ-హైదరాబాద్: పెన్షనరీ ప్రయోజనాలు ఆలస్యం కారణంగా తీవ్ర ఒత్తిడికి గురై రిటైర్డ్ ప్రభుత్వ అధ్యాపకురాలు అనురాధ మృతి చెందడం అత్యంత విషాదకరమని తోటి రిటైర్డ్ ఉద్యోగులు, కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ సీతాఫలమండి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా అనురాధ విధులు నిర్వహించారు. అయితే పదవీ విరమణ తర్వాత ఆమెకు రావాల్సిన పెన్షనరీ ప్రయోజనాలైన PRC బకాయిలు (2019–20), EL ఎన్క్యాష్మెంట్, గ్రాట్యుటీ తదితర ప్రయోజనాల కోసం చాలా కాలంగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని పేర్కొన్నారు.
తనకు రావాల్సిన ప్రయోజనాల కోసం పలుమార్లు అధికారులను సంప్రదించినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో, ఆదివారం ఉదయం ఆమె గుండెపోటుకు గురై మృతి చెందడం అత్యంత బాధాకరమని తోటి రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యాశాఖ (CCE) అధికారుల నుంచి కూడా ఎలాంటి సహాయ సహాకారాలు అందలేదని వాపోయారు. ఉద్యోగుల, పెన్షనర్లకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో సర్కార్ నిర్లక్ష్యం సమంజసంకాదన్నారు.
రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనరీ ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిశీలించి, పెండింగ్లో ఉన్న బకాయిలు, ఇతర ప్రయోజనాలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ ఉద్యోగులు తమ జీవితకాల సేవ అనంతరం తమకు చట్టబద్ధంగా రావాల్సిన ప్రయోజనాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా ప్రభుత్వం తక్షణమే సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని సూచించారు.



