Tuesday, August 18, 2026
E-PAPER
Homeజిల్లాలునెల్లికుదురు మండలస్థాయి సమీక్ష‍ా సమావేశం

నెల్లికుదురు మండలస్థాయి సమీక్ష‍ా సమావేశం

- Advertisement -

విద్యుత్ అధికారులపై మండిపడ్డ ఎమ్మెల్యే మహబూబాద్ ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ 
రాబోయే వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు తయారు చేయాలని సూచన
నవతెలంగాణ-నెల్లికుదురు

మండల స్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశాన్ని మంగళవారం మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ నిర్వహించారు. రైతు వేదికలో జరిగిన ఈ సమావేశానికి ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నితీష్, ఎంపీడీవో కుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ సారి బ్రతకడానికే ఆరుతడి పంటలు వేసుకుందామని, సర్పంచులు గ్రామాలలోని రైతులకు వివరించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మునిగల వీడు సర్పంచి బొల్లికొండ చైతన్య నాగరాజు, శ్రీరామగిరి మాదరి ప్రశాంత్, బంజర బాలకృష్ణ, సౌల్ల తండా సుజాత వాసు,రాజుల కొత్తపల్లి కొండ జనార్దన్ రెడ్డి,రామన్నగూడెం బండి శ్రీనివాస్, ఆలేరు నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి తదితరులు త్రాగునీరు, విద్యుత్ సమస్యలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.

సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఎస్సారెస్పీ కాలువల పూడికలు, చెట్లు తొలగించడానికి మండలానికి రూ.55 లక్షల కేటాయించినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు వేగంగా పూర్తి చేయాలని, నిర్మించుకోని వారి ఇండ్లను వేరే లబ్ధిదారులకు కేటాయించాలని సర్పంచులకు సూచించారు. రెండు నెలల అనంతరం నీటి కష్టాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్న దృష్ట్యా తాగునీటి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. విద్యుత్ అధికారులు సక్రమంగా విధులు నిర్వహించట్లేదని, నా దృష్టికి కొంత మంది ప్రజాప్రతినిధులు తీసుకొచ్చారనీ గుర్తు చేశారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం విడి గ్రామాలలో విద్యుత్ సమస్య లేకుండా చూడాలని, లేనియెడల వారిపై తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఫోన్ లిఫ్ట్ చేయకుంటే సహించేది లేదు..
సర్పంచుల ఫోన్లు విద్యుత్ శాఖతో పాటు ఇతర అధికారులు వెంటనే లిఫ్ట్ చేసి, సమస్య తెలుసుకొని పరిష్కరించడానికి కృషి చేయాలని తెలిపారు. లేని పక్షంలో అధికారులను సస్పెండ్ చేయాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచులు ప్రజలచే ఎన్నుకోబడిన గ్రామ ప్రథమ పౌరులని, వారికి ప్రత్యేకమైన విలువ ఇవ్వాలని సూచించారు. అంతకమునుపు సమీక్ష సమావేశానికి హాజరుకాని సర్పంచుల పట్ల ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. మండలంలో 31 సర్పంచ్లకు 11 మంది గైర్హాజరయ్యారని, సమీక్ష సమావేశాలకు, జనరల్ బాడీ మీటింగ్ లకు హాజరు కాని సర్పంచులకు పనులు అడిగే అర్హత లేదని కటువుగా చెప్పారు. సమావేశాలకు ఆలస్యం చేయకుండా సమయపాలన పాటించాలని సూచించారు.

సమస్యలపై వినతి పత్రం అందజేసిన సర్పంచులు 
మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు తమ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు డ్రాలో ఉపసర్పంచ్ లు సంతకాలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎంపీడీవోలతో సమన్వయపరచి బిల్లులు ఇప్పించాలని, గ్రామాలలోని పంచాయతీ కార్యదర్శులు,జిపి సిబ్బంది కి సమన్వయ లోపంతో శానిటేషన్ తదితర పనులు వెనుకబడుతున్నాయని, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినతిలో పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచి పులి వెంకన్న, స్పెషలాఫీసర్ మరియన్న, ఎంపీడీవో సింగారపు కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -