మోడీ ప్రభుత్వాన్ని ఇంకా నమ్మొచ్చా?
ఆగ్రహంతో దేశ యువత
అయోధ్య విరాళాల చోరీపై ప్రధాని సమాధానం చెప్పాలి
సరిహద్దుల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రజలకు పారదర్శకత అవసరం
సీడబ్ల్యూసీ భేటీలో మల్లికార్జున ఖర్గే ఎన్నికలు జరిగే ఏడు రాష్ట్రాల గురించి చర్చ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
”విద్య, రామాలయ విరాళాలు చోరీ, జాతీయ భద్రత వంటి విషయాలలో మోడీ ప్రభుత్వాన్ని ఇంకా విశ్వసించవచ్చా?” అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. బుధవారం నాడిక్కడ ఇందిరా భవన్‌లో మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది. మరోవైపు వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దీర్ఘకాలికంగా అనుసరించాల్సిన వ్యూహాంపై సమీక్షించారు. ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన అంశాలపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ… ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఎన్నికలకు పార్టీ సన్నద్ధమవుతున్న తరుణంలో, సీడబ్ల్యూసీ ఈ అంశాలపై చర్చించి దేశం ముందు ”ప్రత్యామ్నాయం, విధానం, పరిష్కారాలను” ఉంచాలని ఖర్గే అన్నారు. ”మన పోరాటం ఎప్పుడూ కేవలం రాజకీయ అధికారం కోసం మాత్రమే సాగలేదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, భారత రాజ్యాంగాన్ని నిలబెట్టడం, అలాగే భారత ప్రజల కోసం, ఈ దేశాన్ని వారసత్వంగా పొందబోయే తరాల కోసం మెరుగైన భవిష్యత్తును నిర్మించడం కోసం సాగిన పోరాటం అది” అని ఆయన సూచించారు.
ఈ ప్రభుత్వ విధానాలతో దేశ యువత నిరాశ, నిస్పఅహలకు లోనతున్నారని అన్నారు. పెరుగుతున్న విద్యా ఖర్చులు, పాఠశాలల మూసివేత, ప్రశ్నపత్రాల లీకులు, నియామక పరీక్షలలో అవకతవకలు, నియామకాలలో జాప్యం వంటి వాటిని యువత ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ”ప్రపంచంలోనే అత్యంత యువ జనాభా ఉన్న దేశాలలో భారత్ ఒకటి. అయినప్పటికీ మన యువత నాణ్యమైన విద్యను, అర్థవంతమైన ఉపాధిని పొందడానికి ఇబ్బంది పడుతోంది” అని ఖర్గే అన్నారు.మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ విధానాలలో యువత, విద్య, నైపుణ్యాభివఅద్ధికి ప్రాధాన్యత ఇచ్చాయని చెప్పారు. రాజీవ్ గాంధీ ఓటింగ్ వయస్సును 21 నుంచి 18కి తగ్గించారని, నవోదయ విద్యాలయాల నెట్‌వర్క్‌ను విస్తరించారని, విద్యను ఉపాధి, నైపుణ్యాభివఅద్ధితో అనుసంధానించారని ఆయన అన్నారు. ”మన యువతకు మెరుగైన అవకాశాలు, మరింత సురక్షితమైన భవిష్యత్తు లభించేలా విద్య నుంచి ఉపాధికి సంబంధించిన స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ముందుకు తీసుకురావాలి” అని ఖర్గే సూచించారు.
మోడీ పాలనలో దిగజారిన పరిస్థితి
మోడీ ప్రభుత్వ హయాంలో పరిస్థితి మరింత దిగజారిందని ఆరోపించారు. కొత్త పాఠశాలలు తెరవకపోగా, ఇటీవలి సంవత్సరాలలో సుమారు 94,000 పాఠశాలలు వమూతపడ్డాయని, ఉన్నత విద్య కూడా అంతకంతకూ ఖరీదైనదిగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్ లీక్‌లు, నియామక పరీక్షలలో అవకతవకలు, నియామకాలలో జాప్యం వల్ల పేద వర్గాల విద్యార్థులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని అన్నారు. ”దేశవ్యాప్తంగా యువత ఆగ్రహంతో ఉంది. ఈ ఆగ్రహం రాత్రికి రాత్రే పుట్టలేదు” అని ఖర్గే తెలిపారు. వారి సమస్యలను పరిష్కరించడానికి బదులుగా ప్రభుత్వం పదేపదే తాత్కాలిక చర్యలకే పాల్పడుతోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ ‘స్టూడెంట్స్ కీ ఆవాజ్’ కార్యక్రమంతో కాంగ్రెస్ ఈ సమస్యను చేపట్టిందనీ, పార్లమెంటులో కూడా విద్య, పరీక్షలకు సంబంధించిన ఆందోళనలను లేవనెత్తిందని ఆయన అన్నారు.అయోధ్య రామాలయానికి భక్తులు ఇచ్చిన విరాళాల లెక్కలను ఖర్గే ప్రశ్నించారు. ”రామమందిర ట్రస్ట్‌కు అందిన డబ్బు, బంగారం, ఇతర విరాళాల విషయంలో తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ విరాళాల లెక్కలు ఎలా చూస్తున్నారు. వాటిని ఎలా వినియోగిస్తున్నారో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది” అని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి పార్లమెంటులో ఈ ట్రస్ట్ ఏర్పాటును ప్రకటించారని గుర్తుచేసిన ఆయన… ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో ప్రశ్నించారు.
”ఏదైనా ఆర్థిక అక్రమం జరిగితే దానిపై సరైన విచారణ జరగాలి. బాధ్యులైన వారిని జవాబుదారీగా చేయాలి” అని ఖర్గే అన్నారు. ఈ అంశం నుంచి దఅష్టి మళ్లించడం ప్రజల్లో అనుమానాలను మరింత పెంచుతుందని చెప్పారు. ఈ మేరకు ప్రధాని మోడీ నుంచి సమాధానాలు డిమాండ్ చేశారు. భారత సరిహద్దుల్లో ఆక్రమణలకు సంబంధించిన వార్తలను కూడా ఖర్గే ప్రస్తావించారు. ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ”జాతీయ భద్రతను ఎప్పుడూ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. అలాగని పౌరులు న్యాయమైన ప్రశ్నలు అడగకుండా అడ్డుకోవడానికి కూడా దానిని సాకుగా చూపకూడదు” అని ఆయన అన్నారు. ”మన సాయుధ దళాల పట్ల మాకు అత్యంత గౌరవం ఉంది. కానీ ప్రభుత్వ వైఖరి, సరిహద్దుల్లోని పరిస్థితులపై వచ్చే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సరిహద్దుల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే విషయంలో ప్రజలకు పారదర్శకత అవసరం” అని ఆయన చెప్పారు.
యువత భవిష్యత్తు, విరాళాలపై ప్రజల నమ్మకం, దేశ సరిహద్దులు అనే మూడు అంశాలు చివరికి ఒకే ప్రశ్నను లేవనెత్తుతున్నాయని ఖర్గే అన్నారు. ”మన యువత తమ భవిష్యత్తు విషయంలో ఈ ప్రభుత్వాన్ని నమ్మగలరా? ప్రజాధనం, విరాళాల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుందని పౌరులు నమ్మగలరా? అలాగే జాతీయ భద్రత గురించి నిజం చెబుతుందని దేశం నమ్మగలరా?” అని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, కెసి వేణుగోపాల్, జైరాం రమేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, కర్నాటక సీఎం డికె శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి విడి సతీశన్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు, ఆ పార్టీ సీనియర్ నేతలు పి.చిదంబరం, వీరప్ప మొయిలీ, అంబికా సోనీ, సచిన్ పైలట్, దామోదర రాజనర్సింహ, దిగ్విజరు సింగ్, ఎన్.రఘువీర రెడ్డి, పల్లంరాజుతోపాటు సీనియర్ నాయకులు హాజరయ్యారు.



