ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తున్న న్యాయస్థానాలు
వాషింగ్టన్ : మానవతా సాయం కింద అమెరికాలో నివసిస్తున్న ఐదు వేల మంది ఇథియోపియన్లకు ప్రస్తుతం దేశ ‘బహిష్కరణ’ల నుంచి లభిస్తున్న రక్షణ ఇక కొనసాగబోదు. బహిష్కరణల నుంచి వారికి రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన నిబంధనలను రద్దు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వానికి అమెరికా జిల్లా కోర్టు న్యాయమూర్తి ఈ.మర్ఫీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాము దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ కొనసాగినంత కాలం రక్షణ నిబంధనలను రద్దు చేయకూడదని, వాటిని కొనసాగించాలని కోరుతూ ‘ఆఫ్రికన్ కమ్యూనిటీస్ టుగెదర్’ అనే సంస్థ చేసిన అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. అమెరికాలో నివసిస్తున్న ఆఫ్రికా వలసదారుల కోసం ఈ సంస్థ న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తోంది. అమెరికాలో చట్టబద్ధంగా నివసించడానికి, పనిచేయడానికి అనుమతి పొందిన పది లక్షల మందికి పైగా ప్రజలకు రక్షణలను తొలగిస్తూ న్యాయస్థానాలు ఇప్పటికే అనేక తీర్పులు వెలువరించాయి. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, మానవతా సంక్షోభాల కారణంగా మాతృభూమిని విడిచి అమెరికా చేరుకుంటున్న వారికి దేశ బహిష్కరణ భయం లేకుండా అక్కడ నివసించడానికి, పని చేయడానికి టెంపరరీ ప్రొటెక్షన్ స్టేటస్ (టీపీఎస్) కింద తాత్కాలిక అనుమతి ఇస్తున్నారు.
అయితే ఈ అనుమతులు తాత్కాలికమైనవే కానీ శాశ్వతమైనవి కావని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది. గత ప్రభుత్వాలు టీపీఎస్‌ను పదే పదే పొడిగించడాన్ని విమర్శిస్తోంది. సిరియా, హైతీ నుంచి వలస వచ్చిన వారికి టీపీఎస్ రక్షణలను రద్దుచేయడానికి ఈ వేసవి ప్రారంభంలో సుప్రీం అనుమతించింది. దీనివల్ల లక్షలాది మంది దేశ బహిష్కరణకు గురయ్యే అవకాశం ఉంది. 2020 చివరలో ఇథియోపియాలో సాయుధ పోరాటం చెలరేగి లక్షలాది మంది ప్రజలు మరణించారు. వేలాది మంది అమెరికాకు వలస వచ్చారు. వీరికి 2022లో అప్పటి జో బైడెన్ ప్రభుత్వం దేశ బహిష్కరణల నుంచి 18 నెలల పాటు రక్షణ కల్పించింది. 2024లో దానిని మరోసారి పొడిగించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రక్షణలకు ముగింపు పలకాలని హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం భావించింది. తాజాగా జిల్లా జడ్జి మర్ఫీ ఇచ్చిన తీర్పుతో ఇథియోపియన్లను దేశం నుంచి బలవంతంగా సాగనంపే అవకాశం ఉంది.
వలసదారులకు బహిష్కరణల గండం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


