వాషింగ్టన్ : కెనడాకు చెందిన పలు రకాల వస్తువులపై దిగుమతి సుంకాల విధింపును మూడు రోజుల పాటు వాయిదా వేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పారు. ‘పత్రాల ఖరారుకు లోబడి అమెరికా, కెనడా మధ్య ఒప్పందం ఖరారైంది. కాబట్టి బుధవారం ఉదయం నుంచి అమలులోకి రావాల్సిన సుంకాలను మూడు రోజుల పాటు వాయిదా వేస్తున్నాను’ అని వివరించారు. సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన కెనడా దిగుమతులపై యాభై శాతం సుంకాలు అమలులోకి రావడానికి రెండు గంటల ముందు ట్రంప్ ప్రకటన వెలువడింది. ఆటోలపై అమెరికా సుంకాలు, పలు కెనడా రాష్ట్రాలలో అమెరికా మద్యం అమ్మకాలను నిషేధించడం వంటి పలు అంశాలపై రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ట్రంప్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఈ వారంలో రెండు సార్లు టెలిఫోన్ సంభాషణలు జరిపారు. ఆగస్ట్ 19వ తేదీ లోగా కొత్త సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించిన తర్వాత ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ‘చర్చలలో గణనీయమైన పురోగతి కన్పిస్తోంది. అయినా చేయాల్సిన ముఖ్యమైన పని ఇంకా ఉంది’ అని కార్నీ తెలిపారు.
తుది వాణిజ్య ఒప్పందం కీస్టోన్ ఎక్సఎల్ పైప్‌లైన్ పునరుద్ధరణకు వీలు కల్పిస్తుందని ట్రంప్ చెప్పారు. అల్బెర్టాను అమెరికాతో అనుసంధానించే ఈ పైప్‌లైన్‌ను ఒబామా, బైడెన్ ప్రభుత్వాలు నిలిపివేశాయి. పైప్‌లైన్‌ను పర్యావరణవేత్తలు, స్థానిక సమాజాలు చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే రోజుకు 83 వేల బ్యారల్స్ చమురును రవాణా చేసే ఈ పైప్‌లైన్‌ను పునరుద్ధరించాలని తాను కోరుకుంటున్నానని ట్రంప్ అనేక పర్యాయాలు తెలిపారు.
కెనడాపై సుంకాల విధింపు వాయిదా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



