నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. అమెరికాలో నిర్వహించాల్సిన ‘తెలంగాణ రైజింగ్’ సమావేశాలకు కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో బ్రిటన్ పర్యటన ముగించుకొని సీఎం ఈ నెల 23న లండన్ నుంచి నేరుగా హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. తెలంగాణకు భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి లండన్, అమెరికాలో ‘తెలంగాణ రైజింగ్’ పేరుతో సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా అమెరికాలోని బోస్టన్, న్యూయార్క్‌లో సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కార్యాలయం షెడ్యూల్ కూడా సిద్ధం చేసింది.
అయితే చివరి నిమిషంలో కేంద్ర విదేశాంగ శాఖ నుంచి అనూహ్య పరిణామం ఎదురైంది. యూకేలో జరిగే సమావేశాలకు మాత్రమే అనుమతి లభించింది. అమెరికాలో నిర్వహించాల్సిన సమావేశాలకు గ్రీన్‌సిగ్నల్ రాలేదు. దీంతో సీఎం తన పర్యటనను కుదించుకుని హైదరాబాద్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, కేంద్రం నిర్ణయం వెనక కారణం ఏంటనేది మాత్రం ఇంకా అధికారికంగా తెలయరాలేదు. ప్రస్తుతం రద్దయిన అమెరికా పర్యటనను వచ్చే నెలలో చేపట్టాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. ఈసారి అమెరికాలో జరగాల్సిన భేటీలకు సీఎం స్వయంగా వెళ్లకుండా అధికారుల బృందాన్ని పంపే యోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
తన అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధే తన తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ‘తెలంగాణ రైజింగ్’ ప్రయాణం ఆగదని ధీమా వ్యక్తం చేశారు.



