ప్రియమైన వేణు గీతికకు
నాన్నా! ఎలా ఉన్నావు? ఇక్కడ నేను బాగానే ఉన్నాను. మొన్ననే డాక్టర్ దగ్గరకు వెళ్లి వచ్చాను. ఎక్స్‌రేలు తీసారు. సెర్వికల్ స్పాండిలైటెస్ ఉంది, జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఎన్ని చెప్పినా పనులు చేసుకోక తప్పదు కదా! నాన్నా.. కిందటి ఉత్తరంలో పిల్లలకు నేర్పాల్సిన ఎన్నో జాగ్రతలు ఉన్నాయని చెప్పాను కదా! ఇవి చాలా ముఖ్యమైనవి, యుక్త వయసులోకి వచ్చిన తర్వాత ఇవి వాళ్లకు ఎంతో ఉపయోగపడతాయి. సాధారణంగా పిల్లలు అబద్దాలు చెబుతుంటారు. అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళు తప్పనిసరిగా వారిని సరిదిద్దాలి. అబద్ధాలు చెప్పడం వల్ల జీవితంలో ఎదురయ్యే అవహేళనలు, అవమానాల గురించి చెప్పాలి. నిజం చెప్పడం వల్ల పెరిగే నమ్మకం, ఎదుటి వారికి వారిపై ఏర్పడే సదాభిప్రాయం గురించి తెలియజేయాలి. అవసరమైతే ఒక దెబ్బ వేసైనా సరే వాళ్లు చేసింది పొరపాటని చెప్పాలి. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఒకరోజు వారి ఇంటికి వెళ్లి కొంచం ఎక్కువసేపు కూర్చున్నాను. ఆ సమయంలో వారికి ఏదో లెటర్ వచ్చింది. అందులో వాళ్ల అబ్బాయి ఆఫీస్‌కు సరిగా రావట్లేదని, ఉద్యోగం నుండి తొలగిస్తున్నామని ఉంది. అతనికి 37 ఏండ్లు, తండ్రికి దాదాపు 70 ఏండ్లు. అతను కొడుక్కి బాధ్యత, బుద్ధి చెప్పాల్సింది పోయి ఆఫీస్ వాళ్లకు ఎలాంటి అబద్ధాలు చెప్పాలో చెప్తున్నాడు. నేను ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాను.
ఎందుకంటే పెద్ద వాళ్లే అబద్ధాలు ఎలా చెప్పాలో పిల్లలకు నేర్పించడం మొదటిసారి చూసాను. తర్వాత తర్వాత గమనిస్తే ఆ ఇంట్లో అందరూ అబద్ధాలు చెప్తారు. ఆ కుటుంబం గురించి వింటే చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేసిన కథ గుర్తుకు వచ్చింది.పిల్లలతో అబద్ధాలు చెప్పించకూడదు. వాళ్లు చెప్పినా సహించకూ డదు. నిజాలు మాట్లాడినప్పుడు సమాజంలో వారికి ఉండే గౌరవం, వారిపై పెరిగే నమ్మకం గురించి తెలియచేయడం కాక, అది వారి వ్యక్తిత్వంపై ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలియచేయాలి. చిన్నప్పటి నుండి ఈ రోజు వరకు నువ్వు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఏదైనా పొరపాటు జరిగినా, నేను కోప్పడినా, రెండు దెబ్బలు వేసినా మాట్లాడకుండా ఉండేదానివి. అంతే కాని అబద్ధం మాత్రం చెప్పేదానివి కాదు. అందుకే ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా మేము నిశ్చింతగా ఉంటున్నాం. ఎక్కడున్నా నీ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ, అందరూ అభిమానించేలా ఉన్నావు. నాకు అదే సంతోషం. అసలు అబద్ధం ఎందుకు చెప్పాలి అని ప్రశ్నించేదానివి. నిజమే ధైర్యంగా తప్పును ఒప్పుకుని సరిదిద్దుకోవాలి. తప్పు చేయడం తప్పు కాదు, తప్పును ఒప్పుకోక పోవడం తప్పు. వచ్చే వారం ఉత్తరం కూడా ఇంచు మించు ఇలాంటిదే ఉంటుంది బంగారు తల్లి. ఉంటాను నాన్నా! శ్రావణ మాసం హడావుడి. ఈ రోజు రెండు శుభకార్యాలు ఉన్నాయి. వాటికి వెళ్ళాలి.
ప్రేమతో అమ్మ
పాలపర్తి సంధ్యారాణి



