Saturday, August 22, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర షావుకారు జానకి

ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర షావుకారు జానకి

- Advertisement -

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ నటుల్లో షావుకారు జానకి ఒకరు. తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తెలుగు, తమిళంతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆమె నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. ఏడున్నర దశాబ్దాలకు పైగా విస్తరించిన సుదీర్ఘ సినీ ప్రస్థానం ఆమెది. చాలా కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆగస్టు 21న కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆమె సినీ ప్రస్థానం గురించి నేటి మానవిలో…

జానకి 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించారు. నటి కృష్ణకుమారి ఈమె సోదరి. చిన్నతనంలోనే నాటకాల్లో పలు పాత్రలు పోషిస్తూ కెరీర్ ప్రారంభించారు. 11 ఏళ్లకు రేడియోలో ఒక తెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. 1949లో ‘రక్షా రేఖ’ సినిమాతో చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టారు. జానకి సినీ కెరీర్ అంత సులభంగా ప్రారంభం కాలేదు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సమయంలోనే ఆమె సినిమాల్లోకి అడుగుపెట్టారు. చిన్న వయసులోనే వివాహం జరగడంతో నటనపై ఉన్న ఆసక్తిని పక్కన పెట్టాల్సి వచ్చింది. పెళ్లి తర్వాత కుటుంబ పరిస్థితులు కష్టంగా మారడంతో.. భర్తను ఒప్పించి సినిమాల్లో నటించేందుకు ముందుకు వచ్చారు. అలా వచ్చిన అవకాశమే ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.

మొదటి సినిమానే ఘన విజయం
1950లో వచ్చిన ‘షావుకారు’ సినిమాతో హీరోయిన్‌‌గా పరిచయమయ్యారు. మొదటి సినిమానే ఘన విజయం సాధించడంతో ఆ చిత్రం పేరే ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర నటీమణుల్లో ఒకరిగా ఎదిగారు. తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. తర్వాత కాలంలో జానకి ‘వ‌ద్దంటే డ‌బ్బు’, ‘క‌న్యా శుల్కం’, ‘పిచ్చి పుల్లయ్య’, ‘రేచుక్క-ప‌గ‌టిచుక్క, ‘రోజులు మారాయి’, ‘సొంత‌వూరు’, ‘జ‌యం మ‌న‌దే’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘సంసారం ఒక చ‌ద‌రంగం’, ‘తోడికోడ‌ళ్ళు’, ‘బాబు బంగారం’, ‘గీతాంజలి’ ఇలా అనేక హిట్ చిత్రాలలో జానకి నటించారు. చివరి సారి ‘అన్నీ మంచి శకునములే’లో ఆమె కనిపించారు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బును ఖర్చు చేయకుండా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్, చెన్నై నగరాల్లో విలువైన స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేసినట్టు ఆమె స్వయంగా పలు సందర్భాల్లో వెల్లడించారు. కొన్ని ఆస్తులను భర్త పేరుతో కూడా రిజిస్టర్ చేసినట్టు తెలిపారు.

తొంభై ఏండ్లు దాటినా…
కథానాయికగానే కాకుండా సహయ నటిగా కూడా ఆమె ఎన్నో మెప్పించే పాత్రలు చేశారు. ‘శుభాకాంక్షలు’, ‘బావగారూ బాగున్నారా?’, ‘దేవి’, ‘రావోయ్ చందమామ’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘కంచె’ వంటి అనేక హిట్ సినిమాల్లో ప్రముఖ పాత్రలు పోషించారు. తొంభై ఏండ్లు దాటినా నటనపై ఆమెకున్న మక్కువ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలోనూ ఆమె కనిపించారు. సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెను 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నా…
సినీ జీవితం ప్రారంభించిన తొలి రోజుల్లో జానకి అందుకున్న పారితోషికం కేవలం రూ.2,500 మాత్రమే అని జానకి ఒకానొక సందర్భంలో మీడియాతో చెప్పారు. అయితే కాలక్రమంలో ఆమె పారితోషికం భారీగా పెరిగింది. ఎన్నో ఆస్తులు కూడా సంపాదించారు. అయితే కుటుంబ పరిస్థితులు మారడంతో జానకి ఆస్తుల్లో చాలా వరకు చేతులు మారిపోయాయి. భర్త శంకరమంచి శ్రీనివాసులు ఉద్యోగాన్ని వదిలి జానకి సంపాదనపై ఆధారడ్డారని చెప్పేవారు. అలాగే డబ్బు ఎక్కువగా రావడంతో స్నేహితుల సంఖ్య పెరగడం, ఖర్చులు పెరగడం, కొన్ని అలవాట్ల కారణంగా ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని ఆమె చెప్పుకునేవారు. చివరకు తాను సంపాదించిన ఆస్తుల్లో చాలా భాగం పోయిందని జానకి చెప్పేవారు. అయితే ఆస్తులన్నీ పోయినప్పటికీ జీవితాంతం ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి మాత్రం ఆమెకు రాలేదు. తన దగ్గర కొంత సంపదను దాచుకున్నానని, వాటిని పిల్లల కోసం భద్రపరిచానని జానకి గతంలో చెప్పారు. జీవితంలో ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనా.. చివరి దశలో తన పిల్లలకు కొంత స్థిరమైన ఆస్తిని అందించగలిగారు.

ఆమె సినీ వారసత్వం
జానకికి ఇద్దరు కుమార్తెలు యజ్ఞప్రభ, సచీరావ్‌, కుమారుడు వెంకటరమణ శంకరమంచి వున్నారు. అదే విధంగా నలుగురు మనవలు, మరో నలుగురు మునిమనవళ్లు ఉన్నారు. ఇందులో మనవరాలు వైష్ణవి అరవింద్‌ సినీరంగంలో స్థిరపడ్డారు. వైష్ణవి దక్షిణాది సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ సినిమా ‘రోజా’లో హీరోయిన్ మధుబాల అక్క పాత్రలో వైష్ణవి నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అలాగే విక్టరీ వెంకటేష్ నటించిన ‘ప్రేమ’ చిత్రంలో హీరోయిన్ చెల్లెలు లీజ్జీ పాత్రలో కనిపిస్తారు. తెలుగులో రాజేంద్ర ప్రసాద్ సరసన ‘అత్తింట్లో అద్దె మొగుడు’, ‘చామంతి’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా అలరించారు. వీటితో పాటు ‘అయ్యప్ప కరుణ’, ‘పరువు ప్రతిష్ట’ వంటి సినిమాల్లోనూ మెరిసారు. తెలుగుతో పోలిస్తే తమిళ, మలయాళ భాషల్లో వైష్ణవి ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేశారు. అలా షావుకారు జానకి కుటుంబం నుంచి వచ్చిన మరొక ప్రతిభావంతమైన నటిగా వైష్ణవి గుర్తింపు పొందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -