అన్నాచెల్లెళ్ల అనుబంధం ఒక మధుర కావ్యం.. అక్కాతమ్ముళ్ల ఆప్యాయత ఎప్పటికీ చెరగని అందమైన జ్ఞాపకం. ఆ పవిత్ర బంధానికి ప్రతిరూపమే రక్షాబంధన్. కాలం మారినా.. జీవితంలో బాధ్యతలు పెరిగినా.. పుట్టింటి గడప దాటి అన్నయ్య మణికట్టుకు రాఖీ కట్టేందుకు వచ్చే చెల్లి కళ్లలోని ఆనందం చెరిగిపోదు. అక్క చేతితో ప్రేమగా రాఖీ కట్టించుకునే తమ్ముడి మనసులో మెదిలే బాల్యపు జ్ఞాపకాలకు వయసుతో సంబంధం ఉండదు. చిన్ననాటి అలకలు, అల్లర్లు, ఆటపాటలు, ఒకరిపై ఒకరికి ఉన్న నిస్వార్థమైన ప్రేమ.. కాలంతో పాటు మరింత గాఢమవుతాయి.
మణికట్టుపై మెరిసే రాఖీ దారం చిన్నదే కావచ్చు.. కానీ దాని వెనుక ముడివేసిన అనురాగానికి, నమ్మకానికి, అనుబంధానికి హద్దులుండవు. ‘నా అన్న ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలి’ అని చెల్లి మనసారా కోరుకుంటే.. ‘నీ జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా నీకు అండగా ఉంటాను’ అని అన్న ఇచ్చే మాటే ఆమెకు అందే అత్యంత విలువైన కానుక. అందుకే రక్షాబంధన్ ఒకరోజు జరిగే పండుగ మాత్రమే కాదు.. జీవితాంతం నిలిచే అనుబంధాన్ని గుర్తుచేసే ఆత్మీయ సందర్భం.
గుండెల్లో నింపే భరోసా
రాఖీ కట్టిన క్షణంతో ఆ బాధ్యత ముగిసిపోతుందా? చెల్లి చేతితితో రాఖీ కట్టించుకుని పట్టు చీర, డబ్బు, ఇతర కానుకలు అందించి ఆనందంగా సాగనంపితే సరిపోతుందా? పండుగ సంతోషాన్ని పెంచే బహుమతులకు విలువ ఉంది. కానీ జీవితంలో అవసరమైన సమయంలో అందించే ఆత్మీయ చేయూతతో వాటిని పోల్చలేం. రాఖీకి నిజమైన ప్రతిఫలం వస్తు రూపంలో ఇచ్చే కానుక కాదు.. గుండెల్లో నింపే భరోసా. చెల్లి కష్టంలో ఉన్నప్పుడు పక్కన నిలవడం.. ఆమె ఆలోచనలకు విలువ ఇవ్వడం.. ఆమె నిర్ణయాలను గౌరవించడం.. సమస్య ఎదురైనప్పుడు ధైర్యంగా అండగా నిలవడం.. ఇవే రాఖీ ముడికి నిజమైన అర్థాన్ని ఇస్తాయి.
మానవీయ బంధంగా విస్తరించాలి
రక్తం పంచుకుని పుట్టిన తోబుట్టువుల మధ్య ఉండే అనుబంధానికి ప్రత్యేకమైన విలువ ఉంటుంది. బాల్యంలో కలిసి పెరిగిన జ్ఞాపకాలు జీవితాంతం వెంట వస్తాయి. ఒకరి సంతోషం మరొకరికి ఆనందాన్ని ఇస్తుంది. ఒకరికి కష్టం వస్తే మరొకరి మనసు కలత చెందుతుంది. కాలం, దూరం ఎంతగా విడదీసినా ఆ ప్రేమ పూర్తిగా చెరిగిపోదు. అయితే రక్షాబంధన్ ఇచ్చే సందేశం ఇంతటితో ఆగిపోకూడదు. రక్తసంబంధంలోని ఆప్యాయతను మానవీయ బంధంగా విస్తరించాలి. మన ఇంటి అక్క, చెల్లి, తల్లి, భార్య, కుమార్తెకు ఎంత గౌరవం ఇస్తామో.. సమాజంలో మన చుట్టూ ఉన్న ప్రతి మహిళను కూడా అదే గౌరవంతో చూడగలగాలి.
అండగా నిలబడాలి
మన ఇంటి ఆడబిడ్డ రాత్రివేళ బయటకు వెళ్తే సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుంటాం. మరి మరో ఇంటి ఆడబిడ్డ భద్రత గురించి ఆలోచించడం కూడా మన బాధ్యత కాదా? మన చెల్లి చదువు ఆగిపోకూడదని, ఆమె తన కాళ్లపై తాను నిలబడాలని కోరుకుంటాం. అదే అవకాశం మరో అమ్మాయికి కూడా దక్కాలని ఎందుకు కోరుకోకూడదు? మన అక్కను ఎవరూ అవమానించకూడదని భావిస్తాం. మరి మరో మహిళకు అన్యాయం జరిగినప్పుడు మౌనంగా ఉండటం సమంజసమేనా? మన ఇంటి మహిళకు అన్యాయం జరిగితే మనసు కలత చెందుతుంది. అదే అన్యాయం మరో మహిళకు జరిగినప్పుడు కూడా మన మనస్సాక్షి స్పందించాలి.
ఆమె భద్రతకు భరోసా…
స్వాతంత్య్రం సిద్ధించి 79 ఏండ్లు గడిచాయి. దేశం అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించింది. మహిళలు విద్య, వైద్యం, విజ్ఞానం, సాంకేతికత, పరిపాలన, రాజకీయాలు, రక్షణ, క్రీడలు, వ్యాపారం తదితర రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు. ఎన్నో సామాజిక అడ్డంకులను అధిగమించి ఉన్నత స్థానాలకు చేరుతున్నారు. కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే వృత్తి జీవితంలో విజయాలు సాధిస్తున్నారు. ప్రపంచ వేదికలపై దేశానికి గుర్తింపు తెస్తున్నారు. అయినా మరోవైపు మహిళలపై వివక్ష, వేధింపులు, గృహహింస, దాడులు, అత్యాచారాలు వంటి ఘటనలు కొనసాగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ఆమె విజయాలను చూసి గర్వపడుతూ.. మరోవైపు ఆమె భద్రతకు భరోసా ఇవ్వలేకపోతే మనం సాధించిన అభివృద్ధి అసంపూర్ణంగానే మిగులుతుంది.
ఆమె నిర్ణయాలకు విలువనివ్వండి
మహిళకు రక్షణ కల్పించడం అంటే ఆమెను బలహీనురాలిగా భావించి నాలుగు గోడల మధ్య ఉంచడం కాదు. ఆమె స్వేచ్ఛను గౌరవించడం.. ఆమె నిర్ణయాలకు విలువ ఇవ్వడం.. సమాన అవకాశాలు కల్పించడం. చదువుకోవాలనుకుంటే ప్రోత్సహించడం. ఉద్యోగం లేదా వ్యాపారం చేయాలనుకుంటే అండగా నిలవడం. తన జీవితంపై తానే నిర్ణయం తీసుకునే హక్కును గౌరవించడం. ఆమెకు అన్యాయం జరిగినప్పుడు ‘మనకెందుకు?’ అని తప్పుకోవడం కాకుండా ఆమెకు అండగా నిలవడం. ఇదే నిజమైన రక్షణ.
ఆంక్షలు విధించొద్దు
‘రక్షణ’ పేరుతో మహిళ స్వేచ్ఛకు ఆంక్షలు విధించడం సమర్థనీయం కాదు. ఎక్కడికి వెళ్లాలి.. ఎవరితో మాట్లాడాలి.. ఏం చదవాలి.. ఏ వత్తిని ఎంచుకోవాలి అనే విషయాల్లో ఆమె అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా నిర్ణయాలు రుద్దడం రక్షణ కాదు. ఏ సమయంలోనైనా భయంలేకుండా బయటకు వెళ్లగలిగే సమాజాన్ని నిర్మించడమే నిజమైన రక్షణ. తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచగలిగే వాతావరణం కల్పించడమే రక్షణ. తప్పు జరిగినప్పుడు బాధితురాలి వస్త్రధారణను, ప్రవర్తనను ప్రశ్నించడం కాదు.. తప్పు చేసిన వ్యక్తిని నిలదీయడమే న్యాయం.
అసలైన విలువ
మనకు జన్మనిచ్చిన తల్లి మహిళ. మన బాల్యాన్ని పంచుకున్న అక్క, చెల్లి మహిళలు. జీవితాంతం సుఖదుఃఖాల్లో తోడుగా నడిచే జీవిత భాగస్వామి మహిళ. మన ఇంటికి వెలుగునిచ్చే కుమార్తె, కోడలు మహిళలు. వారి పట్ల మనం చూపే గౌరవం మన కుటుంబ సంస్కారానికి ప్రతిబింబం. అయితే ఆ గౌరవం ఇంటి గడపకే పరిమితం కాకుండా సమాజమంతా విస్తరించినప్పుడే దానికి అసలైన విలువ ఉంటుంది. మన ఇంటి ఆడబిడ్డకు ఎంత మర్యాద, భద్రత కల్పిస్తామో.. పక్కింటి ఆడబిడ్డకు కూడా అంతే గౌరవం ఇవ్వాలి. మన సోదరికి ఎలాంటి భద్రత కావాలని కోరుకుంటామో.. సమాజంలోని ప్రతి మహిళకూ అదే భద్రత లభించాలని కోరుకోవాలి.
ఆత్మపరిశీలన చేసుకునేలా
కాలం మారుతున్న కొద్దీ కుటుంబాల నిర్మాణం, జీవనశైలిలోనూ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో కలిసి పెరిగిన తోబుట్టువులు.. నేడు ఉపాధి, ఉద్యోగాల కోసం వేర్వేరు నగరాలు, దేశాల్లో నివసిస్తున్నారు. ప్రత్యక్షంగా కలుసుకునే సమయం తగ్గింది. ఫోన్ సంభాషణలకే పలకరింపులు పరిమితమవుతున్నాయి. ఆస్తులు, ఆర్థిక వ్యవహారాలు, చిన్నచిన్న అపార్థాలు కొన్నిసార్లు అనుబంధాల మధ్య గోడలుగా మారుతున్నాయి. ఈ తరుణంలో రక్షాబంధన్ మనల్ని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకునేలా చేస్తోంది. దూరాలు పెరిగినా మనసుల మధ్య ఆప్యాయత తగ్గకూడదని గుర్తుచేస్తోంది.
మనసుల్లో సజీవంగా…
బంధాలు బలంగా నిలిచేది చేతికి కట్టే రాఖీ దారం వల్ల మాత్రమే కాదు.. హదయాల్లో నిండిన నిస్వార్థమైన ప్రేమ వల్ల. కేవలం పండుగ రోజున కలుసుకోవడం కాకుండా మిగిలిన రోజుల్లోనూ ఒకరి క్షేమాన్ని మరొకరు తెలుసుకోవాలి. సోదరి కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించాలి. సోదరుడికి అవసరం వచ్చినప్పుడు అక్క అండగా నిలవాలి. తోబుట్టువుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఆస్తులు, అభిప్రాయ భేదాలు, దూరాలు బలహీనపరచకుండా జాగ్రత్త పడాలి. రాఖీ మణికట్టుపై కనిపించకపోయినా.. ఆ బంధం మనసుల్లో సజీవంగా ఉండాలి.
ఎప్పటికీ సడలకూడదు
ఈ రక్షాబంధన్ వేళ చెల్లి ఆప్యాయంగా కట్టే రాఖీకి ప్రతిఫలంగా కేవలం ఒక కానుక ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా.. ఆమె జీవితానికి అండగా నిలిచే భరోసాను ఇవ్వాలి. రక్తం పంచుకున్న తోబుట్టువులకు తోడుగా ఉండాలి. అదే సమయంలో సమాజంలోని ప్రతి మహిళను మన ఇంటి ఆడబిడ్డతో సమానమైన గౌరవంతో చూడాలి. ఆమెపై అన్యాయం జరిగితే స్పందించాలి. వేధింపులు ఎదురైతే అండగా నిలవాలి. మహిళ గౌరవం, ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యతగా భావించాలి. రాఖీ దారం కొన్నాళ్లకు పాతబడొచ్చు.. ఎప్పుడో ఊడిపోవచ్చు. కానీ దాని ముడిలో ఉన్న ప్రేమ, నమ్మకం, బాధ్యత మాత్రం ఎప్పటికీ సడలకూడదు. పండుగ ఒక్కరోజే కావచ్చు.. రక్షణ, గౌరవం అనే భావనలు మాత్రం మన నిత్య జీవితంలో కనిపించాలి. రాఖీ మణికట్టుకే కాదు.. మనసుకు, మన ఆలోచనలకు కూడా కట్టుకోవాలి.
గౌరవానికి, భద్రతకు కవచంగా
చెల్లి కట్టే రాఖీకి ప్రతిఫలంగా ఇచ్చే పట్టు చీర కంటే.. ఆమె కష్టకాలంలో అందించే ఆప్యాయ హస్తం విలువైనది. చేతిలో పెట్టే నగదు కంటే.. జీవితాంతం వెన్నంటి నిలిచే భరోసా గొప్పది. మన ఇంటి ఆడబిడ్డను ఎంత గౌరవిస్తామో.. సమాజంలోని ప్రతి మహిళను అంతే గౌరవించినప్పుడే రక్షాబంధన్ అంతరార్థం సార్థకమవుతుంది. తోబుట్టువులకు తోడుగా.. ఆడబిడ్డలకు అండగా.. ప్రతి మహిళ గౌరవానికి, భద్రతకు కవచంగా నిలిచే సమాజ నిర్మాణమే నిజమైన ‘రక్షా’ బంధన్.
గడగోజు రవీంద్రాచారి, 9848772232



