నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని, ప్రపంచ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయనకు మానవతా దృక్పథంతో మెరుగైన వైద్య సంరక్షణ అందించాలని కోరుతూ ప్రపంచవ్యాప్తంగా 21 మంది మాజీ క్రికెట్ కెప్టెన్లు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు లేఖ రాశారు. వీరిలో భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది రాజకీయ జోక్యం కాదని, కేవలం క్రీడా స్ఫూర్తితోనే ఈ విజ్ఞప్తి చేస్తున్నామని వారు స్పష్టం చేశారు.
గత మూడేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్‌కు ఆయన వ్యక్తిగత వైద్యులతో కూడిన బోర్డుతో వైద్య పరీక్షలు జరిపించాలని పాక్ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. అయితే, ఆ ఆదేశాలు పూర్తిగా అమలు కాలేదని ఈ లేఖలో మాజీ కెప్టెన్లు ఆరోపించారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా, కేవలం కొన్ని గంటల పాటే ఆసుపత్రిలో ఉంచి ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు జరిపి, ‘ఆరోగ్యంగానే ఉన్నారు’ అని చెప్పి తిరిగి జైలుకు పంపించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇమ్రాన్ కుడి కంటి చూపు మందగించిందని వస్తున్న వార్తలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.



