రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు.. పెట్టుబడులు మాత్రం యేటేటా పెరుగుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు పంటలను దెబ్బతీస్తుంటే, ప్రభుత్వ విధానాలు రైతు సమస్యలను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. రుణాలు, ఎరువులు, పంటల కొనుగోళ్లు, రైతు బీమా, రైతు భరోసా.. ఇలా ప్రతి దశలోనూ రైతుకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నా పాలకుల హామీలు ఆచరణకు నోచుకోవడం లేదు. యాప్‌ల పేరుతో కొత్త నిబంధనలు, సాయం విషయంలో జాప్యం, పెరుగుతున్న ఆర్థిక భారం వెరసి అన్నదాతను అప్పుల ఊబి లోకి నెడుతున్నాయి. జనగామ జిల్లాకు చెందిన నలభైయేండ్ల యువకుడు మహమ్మద్ యాకూబ్ పాషా మూడు ఎకరాల్లో వరి, పత్తి సాగు చేసేవాడు. రెండు బోర్లలో నీళ్లు పడకపోవడం, ఎల్‌నినో ప్రభావంతో పంటలు ఎండిపోవడంతో చేసిన అప్పులు భారమై ఆత్మహత్య చేసుకున్నాడు. మోతే అశోక్ అనే రైతు కూడా ఐదెకరాల సొంత భూమితోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. రూ.3 లక్షల పంట రుణం, మరో రూ.6 లక్షల ప్రయివేటు అప్పులు బతుకును భారం గా మార్చడంతో ఆగస్టు 6న బలవ న్మరణానికి పాల్పడ్డాడు. పాలకుల మద్దతు లేక, ప్రకృతి సహకరించక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.
వ్యవసాయంలో కార్పొరేట్ల పాత్ర పెరగడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, ప్రకృతి వైపరీత్యాలు రైతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పంట నష్టపోయినా తగిన సాయం అందక రుణభారం తడిసిమోపెడవుతోంది. దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ 31 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటుండగా, తెలంగాణలో రోజుకు ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.యాప్‌ల పేరుతో కొత్త ఇబ్బందులుఎల్‌నినో పరిస్థితులతో రైతులు అతలాకుతలమవుతున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి యాప్‌లు తీసుకువస్తూ రైతులను మరింత సంక్షోభంలోకి నెడుతున్నా యని విమర్శలు ఉన్నాయి. కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చిన ఫెర్టిలైజర్ (ఎఫ్‌డబ్ల్యూఎఫ్) యాప్ ద్వారా ఎరువులను బుక్ చేసుకోవాలని సూచిస్తోంది. ఆగస్టు 6 నుంచి రాష్ట్రంలోని 10 జిల్లాల్లో దీన్ని అమలు చేస్తోంది. ఆధార్, పట్టాదారు పాస్‌బుక్ కు లింక్ అయిన ఫోన్ నంబర్ ఉంటేనే యాప్ పనిచేస్తుంది. బుకింగ్ సమయంలో నెట్‌వర్క్ లేకపోతే ఇబ్బందులు తప్పవు. బుక్ చేసిన మూడు రోజుల్లోనే ఎరువులు తీసుకోవాలి. ప్రధాన ఎరువులతో పాటు అమోనియా, గుళికలు, ఆర్గానిక్ ఎరువు లను లింక్ చేసి రైతులపై అదనపు భారం మోపుతున్నారని దుకాణ దారులు చెబుతు న్నారు.
గతంలో తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి అమ్మకాల్లో నూ రైతులు ఇబ్బందు లు ఎదుర్కొన్నారు. యాప్‌లో అమ్ము కోలేని రైతులు ప్రయి వేటు వ్యాపారులకు పత్తిని తక్కువ ధరకు విక్రయించి నష్టపోయారు. ఎకరానికి ఏడు క్వింటాళ్లకు మించి పత్తి కొనకూడదనే నిబంధన కూడా ఉండేది. పట్టాలు పెండింగ్‌లో ఉండి సాగు చేస్తున్న భూముల కు ఎరువులు, పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా ఆఫ్‌లైన్ బుకింగ్ సౌకర్యం కల్పించాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది.కేంద్ర, రాష్ట్ర విధానాలతో మరింత భారంగతేడాది సుంకం లేని పత్తిని దిగుమతి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో ఈ ఏడాది ఏ పంటలను దిగుమతి చేసుకుంటుందోనని రైతాంగం ఆందోళన చెందుతోంది. వరి, గోధుమలకు రాష్ట్రాలు అందిస్తున్న బోనస్‌లను నిలిపివేయాలని కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది. ఇది అమలైతే తెలంగాణ, కేరళ వంటి రాష్ట్రాలు రైతులకు అందిస్తున్న అదనపు సాయం నిలిచిపోయే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను విమర్శిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా అవే విధానాలను మరో రూపంలో రైతులపై అమలు చేస్తోంది. యూరియా యాప్‌తో తెలంగాణ దేశానికే ఆదర్శమని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నారు. ధరణిలో లోపాలున్నాయని భూభారతి తీసుకొచ్చిన ప్రభుత్వం, పది లక్షలకు పైగా పెండింగ్ దరఖాస్తులను పరిష్కరిస్తామని చెబుతోంది.
అయితే పెండింగ్ భూములకు యాప్ ద్వారా ఎరువులు ఎలా అందిస్తారన్నది స్పష్టం చేయడం లేదు. రైతు భరోసా ఏది?మార్క్‌ఫెడ్ ద్వారా గతంలో అమల్లో ఉన్న ఫ్రైట్ ఆన్ లారీ (ఎఫ్‌ఓఎల్) విధానాన్ని జూలై 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ప్రతి బస్తాపై రూ.50 నుంచి రూ.100 వరకు రవాణా చార్జీ రైతుపై పడే అవకాశం ఉంది.రైతు బీమా పథకానికి ఎల్‌ఐసీకి చెల్లించాల్సిన రూ.1,400 కోట్ల ప్రీమియం ఇంతవరకు చెల్లించలేదని, దీంతో ఆగస్టు 14 నుంచి రైతు బీమా నిలిచిపోయిందని రైతులు చెబుతున్నారు. 42.16 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే ఈ పథకం స్థానంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాను తీసుకొ స్తామని ప్రభుత్వం చెబుతున్నా, ప్రారంభ తేదీపై స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జూన్ 15 వరకు కొత్త పట్టాలు పొందిన రైతులు రైతు భరోసా కోసం నమోదు చేసుకున్నా ఇప్పటివరకు సాయం అందలేదని ఆరోపణలు ఉన్నాయి. ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 2,540 కొత్త పాస్‌బుక్కులు ఉన్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. సహకార బ్యాంకులు, సహకార సంస్థల్లో కొత్త వ్యవసాయ రుణాలు ఇవ్వకుండా కేవలం రెన్యువల్స్ చేస్తున్నారని రైతులు అంటున్నారు. సన్నవరి రైతులకు బోనస్ విషయంలోనూ ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది.
విత్తనాలను డీలర్ వద్ద కొనుగోలు చేశామని నమోదు చేసుకుంటేనే బోనస్ ఇస్తామని చెబుతోంది. గతంలో 11 రకాల వరికి బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఏడు రకాల సన్న వరికే పరిమితం చేసింది. రైతులే సొంతంగా విత్తనం తయారు చేసుకునే కేఎన్‌ఎం 77, 15, 5204 వంటి రకాల విషయంలో నమోదు ఎలా చేసుకోవాలో స్పష్టత లేక రైతులు గందరగోళానికి గురవుతున్నారు.ఆహార భద్రతే అసలైన పునాదిఇప్పటికే వ్యవసాయ వ్యయం పెరిగి, ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్న రైతును ఆదుకోవాల్సిన పాలకవర్గాలు కార్పొరేట్లకు వత్తాసు పలుకుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. “ఏరు దాటే దాకా ఏటి మల్లన్న.. దాటాక బోడి మల్లన్న” అన్న చందంగా పాలకుల విధానాలు మారుతున్నాయని రైతు సంఘాలు అంటున్నాయి. ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాలు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ప్రభావంతో వ్యవసాయం మరింత సంక్షోభంలోకి జారుతోంది. పంటకు గిట్టుబాటు ధర, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులకు తగిన మద్దతు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమగ్ర పరిహారం, సులభమైన రుణ సౌకర్యాలు, రైతులకు అనుకూలమైన మార్కెట్ విధానాలు అందించకపోతే రైతు ఆత్మహత్యల విషాదం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. దేశానికి అన్నం పెట్టే రైతు బతుకుకు భరోసా కల్పించడమే ఆహార భద్రతకు అసలైన పునాది.
యలమంచి వంశీకృష్ణ 9908997969



