Wednesday, August 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపునరుద్ధరణ పూర్తయ్యే వరకు మేడిగడ్డను నడపొద్దు

పునరుద్ధరణ పూర్తయ్యే వరకు మేడిగడ్డను నడపొద్దు

- Advertisement -

గేట్లు తెరిచి ఉంచాలని సూచించాం
కాళేశ్వరం వినియోగం ప్రభుత్వ విధానమే: ఎన్‌డీఎస్ఏ
న‌వ‌తెలంగాణ బ్యూరో – హైద‌రాబాద్

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీకి పునరుద్ధరణ పనులు పూర్తయ్యే వరకు దానిని తిరిగి ఆపరేట్‌ చేయరాదని జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) హైకోర్టుకు తెలిపింది. మేడిగడ్డలో పియర్లు కుంగిపోవడానికి ప్రణాళిక, డిజైన్‌, నిర్మాణ నాణ్యత, నిర్వహణ, ఆపరేషన్‌లోని లోపాలు కారణమయ్యాయని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. మేడిగడ్డతో నిర్మాణపరంగా సారూప్యత ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా అత్యవసరంగా పరిశీలించాలని 2023లో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసు చేసిందని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు మాజీ సీడబ్ల్యూసీ చైర్మన్‌ జె.చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో 2024లో మరో కమిటీని ఏర్పాటు చేసి మూడు బ్యారేజీలపై సమగ్ర అధ్యయనం చేయగా, 2025 మార్చిలో తుది నివేదిక సమర్పించినట్లు సీడబ్ల్యూసీ తెలిపింది.
వర్షాకాలానికి ముందే మేడిగడ్డ బ్లాక్‌–7లోని గేట్లన్నింటినీ పూర్తిగా ఎత్తి ఉంచడం ద్వారా నీటి ఒత్తిడిని తగ్గించాలని నిపుణులు సూచించినట్లు ఎన్‌డీఎస్ఏ వెల్లడించింది. పియర్‌ నంబర్‌ 20 సమీపంలోని దెబ్బతిన్న 20, 21 గేట్లను అవసరమైతే తొలగించాలని, మిగిలిన ఆరు గేట్లను పూర్తిగా తెరిచి పటిష్టంగా బిగించాలని సూచించినట్లు పేర్కొంది. గేట్లు పూర్తిగా ఎత్తడం సాధ్యం కాకపోతే వాటిని తొలగించాలని సిఫారసు చేసినట్లు తెలిపింది. పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు కేంద్ర జల వనరుల శాఖ 2026 జూన్‌ 30న సాంకేతిక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసిందని సీడబ్ల్యూసీ పేర్కొంది.
డ్యామ్‌ సేఫ్టీ చట్టం ప్రకారం తన బాధ్యతలను నిర్వర్తించామని, బ్యారేజీల భద్రత, మరమ్మతులపై తదుపరి చర్యలు రాష్ట్ర డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ పరిధిలో ఉంటాయని ఎన్‌డీఎస్ఏ స్పష్టం చేసింది. కాళేశ్వరం ద్వారా సాగునీరు, నీటి సరఫరా, ప్రాజెక్టు నిర్వహణ, నీటిని నిల్వ చేయడం లేదా విడుదల చేయడం వంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలని తెలిపింది.
​ఎఫ్ఐఆర్‌ రద్దు కేసులో ఎల్‌పీఏకు అవకాశం లేదు : క్రిమినల్‌ జ్యూరిస్డిక్షన్‌ అంశాల్లో ఇంట్రా కోర్టు అప్పీల్‌ చెల్లదన్న హైకోర్టు
ఎఫ్ఐఆర్‌ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వచ్చిన లెటర్స్‌ పేటెంట్‌ అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఎఫ్ఐఆర్‌ రద్దు అంశం క్రిమినల్‌ జ్యూరిస్డిక్షన్‌ పరిధిలోకి వస్తుందని, ఇలాంటి వ్యవహారాల్లో లెటర్స్‌ పేటెంట్‌ కింద ఇంట్రా కోర్టు అప్పీల్‌ దాఖలు చేయడానికి అవకాశం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్‌కు పెట్టిన పేరు కంటే అందులో కోరిన ఉపశమనం, దాని ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
ప్రైవేటు భూవివాదం నేపథ్యంలో నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. భూమికి సంబంధించిన సివిల్‌ కేసులు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నప్పటికీ పోలీసులు తమపై ఒత్తిడి తెస్తున్నారని వారు వాదించారు. ఆరో ప్రతివాది ఫిర్యాదు ఆధారంగా అక్రమ ప్రవేశం, ఆస్తి ధ్వంసం, దుర్భాషలు, బెదిరింపులకు సంబంధించిన ఆరోపణలతో ఎఫ్ఐఆర్‌ నమోదు కాగా, దర్యాప్తు అనంతరం చార్జిషీట్‌ కూడా దాఖలైందని ప్రభుత్వం తెలిపింది. ఎఫ్ఐఆర్‌ రద్దుకు సింగిల్‌ జడ్జి నిరాకరించడంతోపాటు చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. ఈ ఉత్తర్వులపై దాఖలైన అప్పీల్‌ను విచారించిన ధర్మాసనం.. అది నిర్వహణార్హం కాదని తేల్చి కొట్టివేసింది. పిటిషనర్‌కు చట్టప్రకారం అందుబాటులో ఉన్న ఇతర పరిహార మార్గాలపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని స్పష్టం చేసింది.

​పాత అక్రిడిటేషన్‌ కార్డులకు సెప్టెంబర్‌ 15 వరకు గడువు : కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు
గతంలో అక్రిడిటేషన్‌ కార్డులు పొందిన అర్హులైన వర్కింగ్‌ జర్నలిస్టుల పాత కార్డులను సెప్టెంబర్‌ 15 వరకు కొనసాగించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొత్తగా అక్రిడిటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి, గతంలో కార్డులు లేని వారికి ప్రస్తుత దశలో మధ్యంతర ఉపశమనం కల్పించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అక్రిడిటేషన్‌ అర్హతలకు సంబంధించి ప్రభుత్వం గత ఏడాది జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ హైటెక్‌ ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా అసోసియేషన్‌, తెలంగాణ ఉర్దూ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌, క్రియేటివ్‌ ఇండియా బ్రాడ్‌కాస్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. కేబుల్‌, శాటిలైట్‌ చానళ్ల మధ్య వర్గీకరణపై పిటిషనర్ల తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తరఫున స్పెషల్‌ జీపీ రాహుల్‌రెడ్డి వాదిస్తూ.. ఉర్దూ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ సమర్పించిన 535 మంది సభ్యుల జాబితాలో 268 మందికే గతంలో అక్రిడిటేషన్‌ కార్డులు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వారిలో కొందరికి ఇప్పటికే కార్డులు జారీ చేశామని, కేబుల్‌ చానల్‌ కేటగిరీలో అర్హత ఉన్నవారికి నిబంధనల ప్రకారం కార్డులు ఇచ్చామని వివరించారు. అనేక మంది అసలు అక్రిడిటేషన్‌ కోసం దరఖాస్తు చేయలేదన్నారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది మూడు వాయిదాల తర్వాత సమస్యను ప్రస్తావించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది.
సమస్య ఉంటే ముందుగానే కోర్టు దృష్టికి తీసుకురావాల్సిందని పేర్కొంది. రాష్ట్రంలో దాదాపు 20 వేల మంది మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్‌ కార్డులు జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపిన విషయాన్ని ప్రస్తావించిన ధర్మాసనం.. పిటిషన్లపై తుది వాదనలు వింటామని పేర్కొంటూ విచారణను సెప్టెంబర్‌ 15కు వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -