Wednesday, August 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3(ఎస్) సవరించాలి

అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3(ఎస్) సవరించాలి

- Advertisement -

పబ్లిక్ వ్యూ మినహాయింపును ఎత్తివేయాలి
7 ఏండ్ల లోపు శిక్షల కేసుల్లో స్టేషన్ బెయిళ్లు సరికాదు
మీడియాతో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ‌చైర్మెన్‌ బక్కి వెంకటయ్య
కేంద్రమంత్రులు, జాతీయ కమిషన్ల చైర్మెన్లకు వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అట్రాసిటీ నిరోధక) చట్టం-1989లో కీలక సవరణలు తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్‌ బక్కి వెంకటయ్య కోరారు. బహిరంగ ప్రదేశాల్లోనే కాకుండా, నాలుగు గోడల మధ్య లేదా వ్యక్తిగత ప్రాంతాల్లో కులం పేరిట దుర్భాషలాడినా దానిని శిక్షార్హమైన నేరంగా భావించేలా చట్టాన్ని సవరించాలని అన్నారు. అట్రాసిటీ చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన సవరణలపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మెన్‌ కిశోర్ మక్వానా, జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మెన్‌ అంతర్ సింగ్ ఆర్యాలను తెలంగాణ కమిషన్ బృందం వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు సమర్పించింది. మంగళవారం నాడిక్కడ తెలంగాణ భవన్ గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆ వివరాలను కమిషన్‌ ‌చైర్మెన్‌ బక్కి వెంకటయ్య మీడియాకు వివరించారు. ఆయనతోపాటు బృందంలోని కమిషన్ సభ్యులు కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, కుర్ర రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, చెల్ల ప్రవీణ్ కుమార్, రేణిగుంట నీలాదేవి, కార్యదర్శి వి.పాండురంగారావు ఈ మీడియా సమావేశంలో ఉన్నారు.

​‘పబ్లిక్ వ్యూ’ మినహాయింపును ఎత్తివేయాలి
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టంలోని సెక్షన్ 3(ఎస్) ప్రకారం ప్రజా బాహుళ్యం (పబ్లిక్ వ్యూ) ఎదుట దూషిస్తేనే నేరంగా పరిగణిస్తున్నారనీ, దీనివల్ల నిందితులు సులువుగా తప్పించుకుంటున్నారని కమిషన్ చైర్మెన్‌ వెంకటయ్య తెలిపారు. “ఏదైనా ప్రదేశంలో పబ్లిక్ వ్యూలో దూషించడం” అనే పదాలకు బదులుగా “ఏ పరిస్థితుల్లోనైనా కులం పేరుతో దూషించడం” అని మార్చాలని కోరారు.

​స్టేషన్ బెయిళ్లు అభ్యంతరకం
7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సాకుగా చూపుతూ పోలీసులు స్టేషన్ బెయిల్ ఇస్తూ చట్టాన్ని నీరుగారుస్తున్నారని కమిషన్ చైర్మెన్‌ వెంకటయ్య ఆందోళన వ్యక్తం చేశారు. దళిత ఉద్యమాలు, జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులతో వచ్చిన ఈ ప్రత్యేక చట్టానికి సాధారణ కేసుల్లా మినహాయింపులు ఇవ్వొద్దనీ, సవరణలు చేసి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నేటి డిజిటల్ యుగంలో ఆడియో, వీడియో వంటి ఎలక్ట్రానిక్ ఆధారాలను సేకరిస్తున్నందున, చట్టంలోని సెక్షన్ 15 ఏ ద్వారా ఇండియన్ ఎవిడెన్స్ (ఇప్పుడు భారతీయ సాక్ష్య అధినియం) యాక్ట్ సెక్షన్ 65 క్రింద ఆ ఆధారాలను కోర్టులో చెల్లుబాటు అయ్యేలా చూడాలని కోరారు.

​అందరికీ ఉద్యోగం, ఇల్లు ఇవ్వాల్సిందే
ఎస్సీ, ఎస్టీ బాధితులకు కేవలం ఆర్థిక పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. చట్ట ప్రకారం బాధితులకు పరిహారంతో పాటు ఉద్యోగం, ఉచిత ఇల్లు ఇవ్వాలని కోరారు. తెలంగాణలో సీఎం ఎ. రేవంత్‌‌రెడ్డి నేతృత్వంలో ఇప్పటివరకు 1,550 మంది బాధితులకు (మర్డర్, లైంగికదాడి, ఛార్జ్‌షీట్ పడిన కేసుల్లో) ఇండ్లు ఇచ్చారనీ, ఇదే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం దేశమంతటా అమలు చేసేలా అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు.

​బ్యాక్‌లాగ్ పోస్టులు, సబ్ ప్లాన్ నిధులు
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ. 1,500 కోట్లు పంచాయతీరాజ్, రూ. 2,500 కోట్లు ఆర్ అండ్ బీ ద్వారా నేరుగా ఎస్సీ, ఎస్టీ ఆవాస ప్రాంతాలకే మంజూరు చేయిస్తున్నామని తెలిపారు. ఈ నిధులు పక్కదారి పడితే ఇంజనీరింగ్ అధికారుల భరతం పడతామని హెచ్చరించారు. జిల్లాల్లో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ వేగవంతం చేశామనీ, రిజర్వేషన్లు రద్దు చేయడం ఎవరి తరమూ కాదని కమిషన్ స్పష్టం చేసింది. అలాగే, గత తొమ్మిది సంవత్సరాలుగా పరశురాములు ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ… అమెరికా వంటి అగ్రరాజ్యాల్లో సైతం అంబేద్కర్ విగ్రహాలు నెలకొల్పి గౌరవిస్తున్న తరుణంలో, మన దేశంలో కరెన్సీ నోట్లపై ఆయన చిత్రం ముద్రించడమే సముచిత న్యాయమని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసినట్టు కమిషన్ చైర్మెన్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -