వారి ఆదాయం పెంచాలి : పసుపు రైతులతో
రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖాముఖి
నిజామాబాద్ జిల్లాలో పర్యటన
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
రైతుల సంక్షేమమే రాష్ట్ర, దేశ సంక్షేమమని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. పసుపు సాగులో ఆధునిక సాంకేతికత, సహజ వ్యవసాయ పద్ధతులు, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు, బలమైన మార్కెట్ అనుసంధానంతో రైతుల ఆదాయాన్ని పెంచాలని గవర్నర్ సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం గవర్నర్ పర్యటించారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్‌తో కలిసి నిజామాబాద్‌కు చేరుకున్న గవర్నర్‌కు కలెక్టర్, సీపీ, అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. సంక్షేమం, అభివృద్ధిపై ఆరా తీశారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో, యువకులతో ప్రతిజ్ఞ చేయించారు. పసుపు బోర్డు కార్యాలయంలో రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఉత్తమ రైతు సంఘాలకు గవర్నర్ మెమోంటోలు అందించి అభిదించారు.
అనంతరం గవర్నర్ పసుపు రైతులను ఉద్దేశించి మాట్లాడారు.నిజామాబాద్‌కు పసుపు సాగులో ప్రత్యేక గుర్తింపు ఉందని గవర్నర్ అన్నారు. సారవంతమైన నేలలు, రైతుల కష్టంతో ఈ ప్రాంతం దేశంలోనే ప్రముఖ పసుపు ఉత్పత్తి కేంద్రంగా ఎదిగిందన్నారు. ఇక్కడ జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు కావడం రైతుల చిరకాల ఆకాంక్షకు ప్రతీకగా నిలిచిందని చెప్పారు. పసుపు వ్యవసాయ ఉత్పత్తి మాత్రమే కాదని.. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, నిత్యజీవితంతో ముడిపడిన విలువైన సంపద అని గవర్నర్ వివరించారు.
భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారుగా కొనసాగించడంతో పాటు.. పసుపు ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చేయడమే జాతీయ పసుపు బోర్డు లక్ష్యమని తెలిపారు. రైతు కష్టానికి తగిన గిట్టుబాటు ధర లభించడంతో పాటు.. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత పసుపునకు ప్రత్యేక గుర్తింపు లభించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతులకు నాణ్యత పెంపు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటకోత అనంతర నిర్వహణపై శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. బాయిలర్లు, పాలిషర్లు, చిన్నతరహా ప్రాసెసింగ్ యూనిట్లు రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు విలువ ఆధారిత ఉత్పత్తుల దిశగా దోహదపడతాయని తెలిపారు. సహజ వ్యవసాయం, ఎగుమతుల ప్రోత్సాహానికి దోహదపడే దూరదృష్టితో ‘సునహరీ మిట్టీ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ అరవింద్, జాతీయ పసుపు బోర్డు చైర్మెన్ పల్లె గంగారెడ్డి, నగర మేయర్ ఉమారాణి, ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్య నారాయణ గుప్తా, పి.రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానీ శ్రీ, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, రైతులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



