కమ్యూనిస్టు యోధుడు మల్లారెడ్డికి ఎర్రెర్రని వీడ్కోలు
కడసారి చూపు కోసం కదిలొచ్చిన కామ్రేడ్‌లు
వేలాది మందితో ఎంబీ భవన్ నుంచి గాంధీ ఆస్పత్రి వరకు అంతిమయాత్ర
అనంతరం మెడికల్ కాలేజీకి భౌతికకాయం అప్పగింత
‘‘సారంపల్లి మల్లారెడ్డి నీకు సలాములయ్యా…’’ అంటూ కమ్యూనిస్టు యోధుడు సారంపల్లి మల్లారెడ్డికి కార్మిక, కర్షక లోకం కన్నీటి వీడ్కోలు పలికింది. రైతాంగ ఉద్యమాల గురువుగా భావించే మల్లారెడ్డిని కడసారి చూసేందుకు హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయానికి ఆ పార్టీ కార్యకర్తలు, అన్నదాతలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు పెద్ద ఎత్తున కదిలొచ్చారు. కడసారి చూపు కోసం వచ్చిన ప్రతి ఒక్కరూ ‘మొన్నటిదాకా నవ్వుతూ పలుకరించిన నేత.. మన కోసం ఇంతగా పోరాడిన మనిషి ఇక లేడా’ అని ఆయన పార్థీవదేహంపై పుష్పాంజలి ఘటిస్తూ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. కష్టకాలంలో అండగా నిలిచిన ఆ యోధునికి కడసారి చేతులెత్తి వీడ్కోలు పలికేందుకు వేలాది మంది అంతిమ యాత్రలో పాల్గొన్నారు. తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన మల్లారెడ్డి చివరి మజిలీ కూడా ఒక సందేశంగా మారింది. పార్థీవదేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించడంతో మరణాన్నీ సమాజ సేవకే అంకితం చేసినట్టు అయింది. మల్లారెడ్డి లేరనే నిజం ఎంత చేదైనా ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ స్మరణీయమే..ఆచరణీయమే. ఆయన అడుగుజాడల్లో నడిచే ప్రతి రైతులో, ఆయన మాటను గుర్తుచేసుకునే ప్రతి మనసులో, అన్నదాత హక్కుల కోసం ఎగిసే ప్రతి గొంతులో… సారంపల్లి మల్లారెడ్డి జీవించే ఉంటారు. రైతుల క్షేమం కోసం ఆయన రగిలించిన స్ఫూర్తి యువతరానికి ఆదర్శప్రాయంగా నిలువనున్నది.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఏఐకేఎస్ జాతీయ నేత, సీపీఐ(ఎం) సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో ఉంచారు. ఆయన్ను కడసారి చూసేందుకు నిమ్స్ నుంచి ఆయన మృతదేహం రాకముందే ఎంబీభవన్‌కు రైతులు, ప్రజలు, అభిమానులు, సన్నిహితులు, ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున తరలొచ్చారు. దీంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్డు మెట్రో స్టేషన్, నాబార్డు కార్యాలయం పరిసర ప్రాంతాలు జనసంద్రమయ్యాయి. ప్రజానాట్యమండలి గాయకుల పాటలతో ఆ ప్రాంగణమంతా మారుమోగింది. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు, మరో పొలిట్ బ్యూరో సభ్యులు, ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్, ఏఐకేఎస్ కోశాధికారి కృష్ణప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, జ్యోతి, వీరయ్య, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, అధ్యక్షులు పోతినేని సుదర్శన్,
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్, ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు అరుణజ్యోతి, మల్లు లక్ష్మి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, నాగయ్య, జహంగీర్, అబ్బాస్, నున్నా నాగేశ్వర్‌రావు, బండారు రవికుమార్, సీనియర్ నేతలు చెరుపల్లి సీతారాములు, డీజీ నర్సింహారావు, రాములు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్, ఎడిటర్ రాంపల్లి రమేశ్, బుక్‌హౌజ్ ఎడిటర్ కె.ఆనందాచారి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు, సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస్‌రావు, ఏపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వైవీ, రైతు సంఘం ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్‌గౌడ్, రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి, విత్తన కార్పొరేషన్ చైర్మెన్ అన్వేశ్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోదండరామ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లి కంటి సత్యం, తెలంగాణ రైతు సంఘం(అమృత ఎస్టేట్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ, మాజీ ఎమ్మెల్యేలు చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, రాజిరెడ్డి,
ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహ, సీపీఐ(ఎంఎల్ న్యూడెమోక్రసీ) ఏపీ కార్యదర్శి గాదె దివాకర్, ఎన్‌డీ తెలంగాణ కార్యదర్శివర్గ సభ్యులు చలపతిరావు , ఎంసీపీఐయూ జాతీయ కార్యదర్శి మద్దికాయల అశోక్‌కుమార్, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదెగోని రవి, సీపీఐ(ఎంఎల్ మాస్‌లైన్) కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్, అన్వేష్, అఖిల భారత రైతు కూలి సంఘం జాతీయ అధ్యక్షులు వేముల పల్లి వెంకట్రామయ్య, మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, తెలంగాణ జనసమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోదండరామ్, సీనియర్ జర్నలిస్టులు తెలకపల్లి రవి, వీక్షణం వేణుగోపాల్, జూలూరీ గౌరీశంకర్, ఎస్‌యూసీఐ కార్యదర్శి మురహరి, జీవన్‌కుమార్(మానవ హక్కుల వేదిక), జస్టిస్ చంద్రకుమార్ (టీఎస్‌టీఎఫ్), రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మెన్ రియాజ్, టీఆర్‌ఎస్ నేతలు సయ్యద్ ఇస్మాయిల్, రూప్‌సింగ్, రైతు స్వరాజ్య వేదిక నాయకులు కన్నెకంటి రవి, విస్సా కిరణ్, డీబీఎఫ్ శంకర్, టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎల్ పద్మ, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనురాధ, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, ఏఐకేఎస్‌కు చెందిన తమిళనాడు, కర్నాటక రాష్ర్టాలకు చెందిన నేతలు, తదితరులు నివాళులు అర్పించారు. సంతాప సభలో మాట్లాడారు.
రైతు సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఐక్య పోరాటాల నిర్వహణలో మల్లారెడ్డి పాత్రను గుర్తుచేసుకున్నారు. ఏ రంగంపై సమాచారాన్ని అడిగినా వెంటనే ఇలా తీసిచ్చే ఎన్‌సైక్లోపీడియా మల్లారెడ్డి అని కొనియాడారు. రైతాంగ ఉద్యమాలకు పెద్దన్నలా వ్యవహరించారనీ, రైతు సంఘాల నాయకులకు ఆయన గురువు అని మననం చేసుకున్నారు. జలయజ్ఞం, రైతులకు ఉచిత విద్యుత్ పథకాలు రావడంలోనూ, జయతిఘోష్ కమిటీకి సమగ్ర సమాచారమిచ్చి రైతులకు ఉపయోగపడేలా నివేదిక ఇప్పించడంలోనూ మల్లారెడ్డి పాత్రను గుర్తుచేసుకున్నారు.
మధ్యాహ్నం 12 గంటల తర్వాత సారంపల్లి మల్లారెడ్డి అంతిమ యాత్ర సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం నుంచి గాంధీ ఆస్పత్రి వరకు కొనసాగింది. అందులో ఆయా జిల్లాల నుంచి వచ్చిన రైతు సంఘాల నేతలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజానాట్యమండలికి చెందిన ఒగ్గుడోలు కళాకారులు, డప్పు కళాకారులు తమ ప్రదర్శనలు ఇస్తూ ముందుకు సాగారు. ఆ తర్వాత గాంధీ మెడికల్ కాలేజీ వరకు అంతిమ యాత్ర కొనసాగింది. అక్కడ గాంధీ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాళ్లు చంద్రశేఖర్, నాగమోహన్, ప్రొఫెసర్లు గౌరి, రమాదేవి సమక్షంలో మల్లారెడ్డి భౌతిక కాయాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్, నాగమోహన్ మాట్లాడుతూ..నలుగురికీ ఉపయోగపడా లనుకునే ఉన్నత భావాలున్నవాళ్లే ఇలాంటి మంచి పని చేస్తారనీ, వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం డెడ్‌బాడీని ఇవ్వడం గొప్ప విషయమని కొనియాడారు. మల్లారెడ్డి కుటుంబసభ్యులను అభినందిం చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, మల్లారెడ్డి కుమారులు సారంపల్లి వాసుదేవరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కుమార్తె సునిత, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.



