Wednesday, August 26, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమూసీ ప్రాజెక్టు కోసం భూసేకరణ వేగవంతం చేయండి

మూసీ ప్రాజెక్టు కోసం భూసేకరణ వేగవంతం చేయండి

- Advertisement -

ల్యాండ్ ఫూలింగ్ పై స్పష్టమైన విధానం రూపొందించండి
సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ ప్రాజెక్టు కోసం భూసేకరణను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ల్యాండ్ ఫూలింగ్ పై స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని ఆయన వారికి సూచించారు. మంగళవారం హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మూసీ ప్రాజెక్టు, ఆ నది ప్రక్షాళనపై సీఎం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, అసైన్డ్ భూముల సేకరణ తదితర అంశాలపై స్పష్టమైన విధానాన్ని రూపొందించి సమర్పించాలంటూ ఆదేశించారు. ఇదే సమయంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. మూసీ ప్రాజెక్టు ఫేజ్ 2కు వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని కోరారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అతి తక్కువ వడ్డీకి రుణాలిచ్చే సంస్థలపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టీడీఆర్ పై ప్రతి వారం సమీక్ష నిర్వహించాలన్నారు. మంచిరేవుల ఓంకారేశ్వర స్వామి ఆలయ టెండర్లను తక్షణమే పిలవాలంటూ సూచించారు. కొత్వాల్ గూడలోని బర్డ్స్ పార్కుకు మరింత ప్రచారం కల్పించాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫ్ రాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.

సీఎంను కలిసిన పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, క్రీడాకారులు గాయత్రి గోపీచంద్, త్రిషా జాలీ….సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్స్ మహిళల డబుల్స్ లో గాయత్రి గోపీచంద్, త్రిషా జాలీ కాంస్య పతకం సాధించారు. ఈ నేపథ్యంలో వారిద్దరని సీఎం అభినందించారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివీవీ లక్ష్మి కూడా పాల్గొన్నారు.

ప్రవక్త బోధించిన జీవన విధానం ఆదర్శప్రాయం
మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముస్లీం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, ప్రేమ, సోదరభావం, కరుణ, మానవత్వం, క్రమబద్ధమైన జీవన విధానం నేటి సమాజానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆయన సందేశాలు ప్రపంచ శాంతి, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -