Wednesday, August 26, 2026
E-PAPER
Homeజాతీయం​ఇదేనా వికసిత్‌ ‌భారత్‌?

​ఇదేనా వికసిత్‌ ‌భారత్‌?

- Advertisement -

సంపద కొద్దిమంది గుప్పెట్లో!..300 కుటుంబాల చేతిలో రూ.138 లక్షల కోట్లు
నెదర్లాండ్స్‌, సౌదీ, స్విట్జర్లాండ్‌, పోలాండ్‌ ఆర్థిక వ్యవస్థల కంటే అధికం
మోడీ పాలనలో బడా వ్యాపారవేత్తలకు అచ్ఛేదిన్‌
ఒకవైపు కోట్లాది కుటుంబాల జీవన పోరాటం..
మరోవైపు కార్పొరేట్‌ కుటుంబాల సంపదకు రెక్కలు
బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ దుస్థితి

‘వికసిత్‌ భారత్‌’ అంటూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేస్తున్న వేళ.. దేశంలో సంపద పంపిణీపై మరోసారి తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హురున్‌ 2026 జాబితా ప్రకారం దేశంలోని 300 అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల మొత్తం విలువ ఏకంగా రూ.138 లక్షల కోట్లకు చేరింది. ఈ మొత్తం కూడా నెదర్లాండ్స్‌, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్‌, పోలాండ్‌ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువ. మరి ఈ అపారమైన సంపద పెరుగుదల ఫలాలు సామాన్యుడి జీవితంలో ఎంత మేరకు కనిపిస్తున్నాయన్నదే అసలు ప్రశ్న.

న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతోం దని, భారత్‌ ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పదేపదే చెప్తోంది. కానీ అదే సమయంలో సంపద కొద్దిమంది చేతుల్లోనే మరింత కేంద్రీకృతమవుతున్న దృశ్యం కనిపిస్తోం ది. 2026 ‘బార్క్లేస్‌ ప్రయివేట్‌ క్లయింట్స్‌ హురున్‌ ఇండియా మోస్ట్‌ వాల్యూయబుల్‌ ఫ్యామిలీ బిజినెస్‌’ జాబితా ప్రకారం.. దేశంలోని 300 కుటుంబ వ్యాపారాల సంయుక్త విలువ రూ.138 లక్షల కోట్లకు చేరింది. గత రెండేండ్లలోనే వీటి విలువ సుమారు రూ.30 లక్షల కోట్లు పెరిగింది. సంపన్న కుటుంబాల ఆస్తులు, కంపెనీల విలువలు, షేర్ల విలువలు పెరగడం ద్వారా వారి మొత్తం సంపదలో రోజుకు సగటున రూ.4,076 కోట్ల మేర పెరుగుదల నమోదైంది.

​సామాన్యుడి వాటా ఎంత?
హురున్‌ లెక్కల ప్రకారం… ఈ 300 కుటుంబ వ్యాపారాల మొత్తం విలువ 1.46 ట్రిలియన్‌ డాలర్లకు సమానం. వీటన్నింటినీ ఒక దేశంగా పరిగణిస్తే ప్రపంచంలో 18వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని హురున్‌ ఇండియా వ్యవస్థాపకులు, ప్రధాన పరిశోధకులు అనస్‌ రెహ్మా న్‌ జునైద్‌ వివరించారు. ఇది భారత ఆర్థిక వ్యవ స్థలో సంపద సృష్టి ఎంత భారీ స్థాయిలో జరుగు తోందో చూపుతున్నప్పటికీ.. ఆ సంపద ఎవరి చేతుల్లో కేంద్రీకృతమవుతోందన్న ప్రశ్నను కూడా ముందుకు తెస్తోంది. దేశంలో ఉద్యోగాలు, వేతనా లు, జీవన వ్యయం, చిన్న వ్యాపారాల పరిస్థితి వంటి అంశాలపై సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో కార్పొరేట్‌ కుటుం బాల ఆస్తుల విలువ మాత్రం కొత్త రికార్డులు సఅష్టిస్తుండటం గమనార్హం.

అగ్రస్థానంలో అంబానీలు, అదానీలు
జాబితాలో రిలయన్స్‌ ఇండిస్టీస్‌తో అంబానీ కుటుంబం రూ.25.83 లక్షల కోట్ల విలువతో అగ్ర స్థానంలో ఉంది. బిర్లా కుటుంబం రూ.8.14 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉండగా, జిందాల్‌ కుటుం బం రూ.8.02 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉంది. బజాజ్‌ కుటుంబం రూ.7.70 లక్షల కోట్లు, మహీంద్రా కుటుంబం రూ.5.15 లక్షల కోట్ల విలు వతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక మొదటి తరం వ్యాపార కుటుంబాల్లో గౌతమ్‌ అదానీ కుటుంబం రూ.19.6 లక్షల కోట్ల విలువతో అగ్ర స్థానంలో ఉంది. సునీల్‌ భారతి మిట్టల్‌ కుటుంబం రూ.12.1 లక్షల కోట్లతో తర్వాతి స్థానంలో ఉంది.

​జిందాల్‌ సంపదకు రెక్కలు
సంపదను అత్యధికంగా పెంచుకున్న కుటుంబంగా జిందాల్‌ కుటుంబం నిలిచింది. కుటుంబ వ్యాపార విలువ రూ.3.3 లక్షల కోట్లు పెరిగి రూ.8.02 లక్షల కోట్లకు చేరింది. అంటే 70 శాతం పెరుగుదల నమోదైంది. అనిల్‌ అగర్వాల్‌ కుటుంబం రూ.3.03 లక్షల కోట్ల విలువను అదనంగా సృష్టించగా, కుమార్‌ మంగళం బిర్లా కుటుంబం రూ.2.75 లక్షల కోట్లు జోడించింది.

​’వికసిత్‌ భారత్‌’లో అసలు అభివృద్ధి ఎవరిది?
మోడీ ప్రభుత్వం ‘వికసిత్‌ భారత్‌’ను ప్రధాన లక్ష్యంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. దేశ ఆర్థిక వృద్ధిని కేవలం బిలియనీర్ల సంపదతోనే కొలవలేం. సాధారణ కుటుంబాల ఆదాయం ఎంత పెరిగింది? యువతకు స్థిరమైన ఉద్యోగాలు ఎన్ని వచ్చాయి? చిన్న, మధ్యతరహా వ్యాపారాలు ఎంత బలపడ్డాయి? ధరల పెరుగుదలతో ప్రజల కొనుగోలు శక్తి ఎంత దెబ్బతింది? గ్రామీణ కుటుంబాల ఆదాయ పరిస్థితి ఏమిటి? వంటి ప్రశ్నలకు కూడా సమాధానాలు అవసరమని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.

​అసమానతకు సంకేతాలా?
హురున్‌ జాబితాలోని టాప్‌ 10 కుటుంబాలే మొత్తం జాబితా విలువలో 51 శాతం వాటా కలిగి ఉన్నాయి. అదే సమయంలో కనీసం ఒక బిలియన్‌ డాలర్ల విలువ కలిగిన కుటుంబాల సంఖ్య 230కు చేరింది. అంటే భారత్‌లో పెద్ద వ్యాపారాల విలువ వేగంగా పెరుగుతున్నప్పటికీ.. సంపద కేంద్రీకరణ కూడా గమనించాల్సిన అంశంగా మారుతోంది. ‘భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది’ అనే మోడీ ప్రభుత్వ లక్ష్యాల మధ్య.. ఆ వృద్ధి ఫలాలు సామాన్యుడి జేబుకు, యువత ఉద్యోగాలకు, రైతు ఆదాయానికి, మధ్యతరగతి జీవన ప్రమాణాలకు ఎంతగా చేరుతున్నాయో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని సామాజికవేత్తలు, మేధావులు ప్రశ్నిస్తున్నారు.

352 శాతం పెరిగిన అహూజా కుటుంబ సంపద
శాతాల పరంగా చూస్తే శాహీ ఎక్స్‌పోర్ట్స్‌కు చెందిన అహూజా కుటుంబం అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. వారి వ్యాపార విలువ 352 శాతం పెరిగి రూ.37,500 కోట్లకు చేరింది. గార్వేర్‌ హైటెక్‌ ఫిల్మ్స్‌కు చెందిన శశికాంత్‌ భాలచంద్ర గార్వేర్‌ కుటుంబం సంపద 300 శాతం పెరిగి రూ.15,600 కోట్లకు చేరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -