కుటుంబ సభ్యత్వం నుంచి ఆస్తి హక్కుల దాకా వివక్షే!
జనగణనలో కుటుంబం అంటే ఎవరు? ఇంటి పెద్ద ఎవరు? కుటుంబం నుంచి వేరైన మహిళకు గుర్తింపు ఎక్కడ ఉంటుంది? వంటి ప్రశ్నలు మరోసారి దేశంలోని పితృస్వామ్య వ్యవస్థను, మహిళల ఆస్తి హక్కులను, కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నాయి.
తండ్రి ఇంట్లో కుమార్తెగా.. భర్త ఇంట్లో భార్యగా.. తనకంటూ ఇల్లు, ఆస్తి, హక్కులు లేవు
మహిళ ఉనికిని ప్రశ్నిస్తున్న పితృస్వామ్య వ్యవస్థ మాటల్లోనే మహిళా సాధికారత
మోడీ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు
న్యూఢిల్లీ: ”నా కుటుంబంలో నిన్ను సభ్యురాలిగా చేర్చను” అని తండ్రి చెప్పిన ఒక్క మాట.. ఒక మహిళను తన కుటుంబంలోనే కాదు, సమాజంలోనూ తనకంటూ స్థానం ఉందా అనే ప్రశ్నను ఎదుర్కొనేలా చేస్తుంది. తండ్రి ఇల్లు.. భర్త ఇల్లు.. చివరకు కుమారుడి ఇల్లు.. మహిళ జీవితాన్ని ఈ మూడు గడపల మధ్య బంధించే పితృస్వామ్య వ్యవస్థలో.. ఈ గీత దాటిన మహిళకు ఇల్లు ఎక్కడీ కుటుంబం ఎక్కడీ గుర్తింపు ఎక్కడీ అనే ప్రశ్నలు జనగణన సందర్భంగా ముందుకొస్తున్నాయి.
జనగణనలో కుటుంబం అంటే ఎవరు?
జనగణన ప్రక్రియలో కుటుంబం, ఇంటి నిర్మాణం, కుటుంబ సభ్యులు, కుటుంబ పెద్ద వంటి వివరాలను నమోదు చేస్తారు. అయితే కుటుంబా నికి తప్పనిసరిగా ఒకే వ్యక్తి అధిపతిగా ఉండాలనే భావనపై ప్రశ్నలు తలెత్తుతు న్నాయి. పితృస్వామ్య సమాజంలో వయసులో పెద్ద పురుషుడే కుటుంబ పెద్దగా మారే పరిస్థితి ఇప్పటికీ అనేక కుటుంబాల్లో కొనసాగుతోంది. అయితే కుటుంబం అంటే ఒక వ్యక్తి ఆధిపత్యంలో ఉండే వ్యవస్థ కాదనీ, అందులోని ప్రతి సభ్యుడికీ సమాన గుర్తింపు, హక్కులు ఉండాలని మహిళా హక్కుల కార్యకర్తలు చాలా కాలంగా చెప్తున్నారు. అయినప్పటికీ కుటుంబ వ్యవస్థలో మహిళకు స్వతంత్ర గుర్తింపు కల్పించే విష యంలో సమాజం ఇంకా వెనుకబడే ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహిళకు ఇల్లు ఎక్కడీ
భారతీయ కుటుంబ వ్యవస్థలో మహిళ జీవితాన్ని సాధారణంగా తండ్రి ఇంటి నుంచి భర్త ఇంటికి, అక్కడి నుంచి కుమారుడి ఇంటికి వెళ్లే ప్రయాణంగా చూస్తారు. కానీ ఈ మూడు ఇండ్లలోనూ ఆమెకు నిజమైన యాజమాన్యం, స్వతంత్రత, నిర్ణయా ధికారం ఎంతవరకు ఉంటున్నా యన్నది అసలు ప్రశ్న. ఏ దశలోనూ ఆమెకు తనకంటూ ఒక సొంత స్థలం, సొంత ఆస్తి, సొంత నిర్ణయాధికారం లేకపోతే.. ఆ ఇండ్లలో ఏదైనా నిజంగా ఆమె ఇల్లు అని చెప్పడం కష్టమే.
విడాకులు తీసుకుంటే మరింత సంక్లిష్టం
వివాహ బంధం నుంచి బయట కు వచ్చిన మహిళల పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. భర్త ఇంట్లో చోటు కోల్పోయిన మహిళ తల్లి దండ్రుల ఇంటికి తిరిగి వచ్చినా.. అక్కడ ఆమెను శాశ్వత కుటుంబ సభ్యురాలిగా చూడటానికి కుటుంబా లు వెనుకాడే సందర్భాలూ ఉన్నాయి. విడాకులు తీసుకున్న మహిళకు ‘ఇది నీ ఇల్లు కాదు’ అని భర్త కుటుంబం చెప్తుంది. తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వస్తే ‘ఇప్పటికే నీకు మరో కుటుంబం ఉంది’ అనే మాటలు వినాల్సి వస్తుం ది.ఈ రెండు కుటుంబాల మధ్య ఆమెకు తనకంటూ స్థానం లేకుండా పోతుంది.
కుటుంబ వ్యవస్థను ప్రశ్నిస్తే తప్పేనా?
మహిళ తనకంటూ స్థలం, ఆస్తి, నిర్ణయాధికారం కోరుకోవడం కూడా కొన్ని కుటుంబాల్లో ధిక్కారంగా కనిపిస్తోంది.తల్లి అంటే త్యాగం చేయాలి.. భార్య అంటే భర్తకు అను గుణంగా ఉండాలి.. కుమార్తె అంటే తల్లిదండ్రుల మాట వినాలి.. అనే సామాజిక అంచనాలు మహిళ స్వేచ్ఛను పరిమితం చేస్తున్నాయి. మహిళ తన కోసం మాట్లాడితే స్వార్థపరురాలు.. తన ఆస్తి హక్కు కోసం నిలబడితే కుటుంబాన్ని విభజించేదిగా ముద్ర.. తన జీవితంపై తానే నిర్ణయం తీసుకుంటే సంప్రదా యాలకు విరుద్ధంగా వ్యవహరించిం దనే ఆరోపణ.. ఇవన్నీ ప్రస్తుత సమాజంలో ఇప్పటికీ కనిపిస్తున్నా యి. ఇలాంటి పరిస్థితుల్లో మహిళకు కుటుంబంలో సమాన సభ్యత్వం ఎక్కడ ఉంటుంది? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
శ్రమ మహిళది.. హక్కులు పురుషుడికి
భారత వ్యవసాయ రంగంలో మహిళల శ్రమ కీలకమైనది. పొలాల్లో పని చేయడం నుంచి విత్తనాలు వేయడం, కలుపు తీయడం, పంట కోయడం,పశుపోషణ వరకు మహిళ లు భారీగా శ్రమిస్తున్నారు. అయితే శ్రమ చేస్తున్న మహిళకు భూమిపై యాజమాన్య హక్కు మాత్రం చాలాసార్లు ఉండదు.కుటుంబ ఆస్తిలో తన వాటా కోసం అడిగే పరిస్థితి కూడా అనేక ప్రాంతాల్లో లేదు. అంటే పని మాత్రం మహిళ చేయాలి.. ఆస్తి మాత్రం పురుషుడి పేరుపై ఉండాలి. కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యత మహి ళదే.. కుటుంబ ఆస్తిపై నిర్ణయాధికారం మాత్రం పురుషుడిదే. ఇదే భారతీయ పితృస్వామ్య వ్యవస్థలోని ప్రధాన వైరుధ్యంగా చెప్పొచ్చు.
మహిళా సాధికారత అంటే
పథకాలు మాత్రమేనా?
మహిళా సాధికారత గురించి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తరచూ మాట్లాడుతోంది. మహిళల కోసం అనేక పథకాలను కూడా ప్రచారం చేస్తోంది. కానీ మహిళా సాధికారత అంటే కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారుగా మహిళను గుర్తించడం కాదు. ఆమెకు కుటుంబంలో సమాన స్థానం ఉండాలి. ఆస్తిలో సమాన హక్కు ఉండాలి. తన జీవితంపై తానే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉండాలి. కుటుంబం నుంచి వేరైనప్పుడు కూడా ఆమెకు చట్టపరమైన, సామాజిక గుర్తింపు ఉండాలని సామాజికవేత్తలు సూచిస్తున్నారు. ఒక మహిళ తన కుటుంబంలోనే తన ఉనికిని నిరూపిం చుకోవాల్సిన పరిస్థితి ఉంటే.. అది సాధికారతకు సంకేతమా? అని వారు ప్రశ్నిస్తున్నారు.
‘మహిళకు గుర్తింపుపై
దృష్టి పెట్టాలి’
జనగణన అనేది కేవలం జనాభా లెక్కింపు కాదు. దేశంలో ఎవరు ఉన్నారు? ఎలా జీవిస్తున్నారు? ఎలాం టి సామాజిక, ఆర్థిక పరిస్థితు లను ఎదుర్కొంటున్నారు? అనే విషయా లను అర్థం చేసుకునే కీలక ప్రక్రియ. విడాకులు తీసుకున్న మహిళలు, ఒంటరి మహిళలు, కుటుంబం నుంచి వేరుపడిన మహిళలు, తల్లిదండ్రుల వద్ద తిరిగి నివసిస్తున్న మహిళలు వంటి వర్గాలకు స్పష్టమైన సామాజిక గుర్తింపు కల్పించే అంశాలపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సామాజికవేత్తలు, మహిళ సంఘాల నేతలు సూచిస్తున్నారు.
‘మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి’
దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉన్నాయని రాజ్యాంగం చెప్తోంది. కానీ ఆచరణలో ఒక మహిళ తన కుటుంబంలోనే ”నువ్వు మా కుటుంబ సభ్యురాలు కాదు” అనే మాట వినాల్సి వస్తే.. రాజ్యాంగం ఇచ్చిన సమానత్వం ఎక్కడ అమలవుతోంది? అని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక్క మహిళ సమస్య కాదనీ, వివాహం, విడాకులు, ఆస్తి, కుటుంబం, సామాజిక గుర్తింపు మధ్య చిక్కుకున్న లక్షలాది మహిళల సమస్యగా వారు అభివర్ణిస్తున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది కుటుంబాలు మాత్రమే కాదనీ, మహిళా సాధికారతను పదేపదే ప్రకటిస్తున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వమని అంటున్నారు.



