Thursday, August 27, 2026
E-PAPER
Homeజాతీయంపేదోడి ఆరోగ్యంపై చిన్నచూపు

పేదోడి ఆరోగ్యంపై చిన్నచూపు

- Advertisement -

పేరుకే ప్రపంచస్థాయి వైద్యం..సామాన్యుడికి అందని చికిత్స
ప్రభుత్వ ఆస్పత్రిలో ఖర్చు రూ.6,631..ప్రయివేట్‌లో రూ.50,508!..సర్కారు దవాఖానాల్లో కొరతలతో ప్రయివేటుకు వెళ్లాల్సిన పరిస్థితులు
కుటుంబాలపై పెరుగుతున్న ఆర్థిక భారం
ప్రభుత్వ ఆరోగ్య వ్యయం జీడీపీలో కేవలం 1.43 శాతమే
పార్లమెంటరీ కమిటీ 368 సిఫారసులు
మోడీ సర్కారు పాలనలో ఆరోగ్యరంగానికి సుస్తీ

మోడీ పాలనలో ఆరోగ్య రంగం ఆందోళనకరంగా మారింది. వైద్యరంగంపై కేంద్రం చిన్న చూపు 
చూస్తున్నది. కార్పొరేట్ల రాకతో ఈ రంగం ఒక వ్యాపారమయంగా మారింది. ఏదేనీ ఆరోగ్య సమస్య తలెత్తితే పెద్దోడికి ఒక లెక్క.. పేదోడికి ఇంకో లెక్కలా ఉంది దేశంలో పరిస్థితి. భారత్‌లో ప్రపంచస్థాయి వైద్యులు, ఆస్పత్రులు, ఔషధ పరిశ్రమ, అత్యాధునిక వైద్య సాంకేతికత అందుబాటులో ఉన్నాయంటూ మోడీ సర్కారు ప్రచారం చేసుకుంటోంది. కానీ అదే సమయంలో తీవ్రమైన అనారోగ్యం వస్తే పేదలు, సామాన్య మధ్యతరగతి కుటుంబం ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి కనబడుతోంది. ఉన్నవాడు డబ్బు వెచ్చించి చికిత్స పొందుతుంటే.. లేనివాడు మాత్రం తన ప్రాణాలను కూడా కోల్పోతున్న అత్యంత కఠినమైన పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థకు తగినంత కేటాయింపులు లేకపోవడం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు, సిబ్బంది కొరత, గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు సరిగ్గా చేరకపోవడం, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న 
 ప్రయివేటు ఆస్పత్రుల అధిక ధరలు దేశ వైద్య రంగంలో పరిస్థితులను మరింతగా దిగజార్చుతున్నాయని 
నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

న్యూఢిల్లీ : భారత్‌ ఆరోగ్యరంగంలో ఆందోళనకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశ ప్రజల కోసం ‘ఆయుష్మాన్‌ ‌భారత్‌’ ‌వంటి అనేక ఆరోగ్య పథకాలను తీసుకొచ్చి ఆదుకుంటున్నామని మోడీ సర్కారు గొప్పగా ప్రచారాలు చేసుకుంటోంది. అయితే దేశంలో వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. సామాన్య ప్రజలకు తీవ్రమైన అనారోగ్యం వచ్చినప్పుడు దానికయ్యే చికిత్స ఖర్చు భరించడం వారికి చాలా కష్టంగా మారుతోంది. ఇక ఆరోగ్య రంగంపై ప్రభుత్వం చేసే ఖర్చు దేశ జీడీపీలో 1.43 శాతంగానే ఉంది. జాతీయ ఆరోగ్య విధానం – 2017 నిర్దేశించిన 2.5 శాతం లక్ష్యంతో పోలిస్తే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. ఇదే సమస్యను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తన 176వ నివేదికలో ప్రస్తావించింది. ‘‘ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగాల్లో వైద్య సౌకర్యాల అందుబాటు, భరించగలిగే స్థాయి’’పై రూపొందించిన ఈ నివేదికలో 368 సిఫారసులు చేసింది.

​ప్రభుత్వ, ప్రయివేటు మధ్య భారీ తేడాలు
పార్లమెంటరీ కమిటీ గణాంకాల ప్రకారం.. ఒకసారి ఆస్పత్రిలో చేరేందుకు అయ్యే సగటు ఖర్చు ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.6,631 కాగా, ప్రయివేట్‌ ఆస్పత్రిలో రూ.50,508గా ఉంది. అంటే ప్రయివేట్‌ ఆస్పత్రిలో ఖర్చు దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువ. ప్రసవం విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రిలో సగటు స్వంత ఖర్చు సుమారు రూ.2,299 కాగా… ప్రయివేట్ ఆస్పత్రిలో అది రూ.37,630కు చేరుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రులు బలోపేతం కాకపోతే.. ప్రజలకు ప్రయివేట్ వైద్యమే ప్రధాన ప్రత్యామ్నాయంగా మారుతుంది. ఫలితంగా వైద్య ఖర్చుల భారం నేరుగా కుటుంబాలపై పడుతుందని సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

​ప్రభుత్వాస్పత్రుల్లో కొరతల వెతలు
దేశంలో అత్యుత్తమ వైద్యులు, ఆస్పత్రులు ప్రధానంగా మహానగరాలు, అభివృద్ధి చెందిన పట్టణాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో మాత్రం వైద్య సేవల కొరత కొనసాగుతోంది. అయితే దేశంలో వైద్య కళాశాలల సంఖ్య పెరగడం మాత్రమే సమస్యకు పరిష్కారం కాదనీ, అవసరమైన ప్రాంతాల్లో వైద్యులు పనిచేసేలా వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం కూడా ఉందని వారు సూచిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, పడకల కొరత కారణంగా రోగులు ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తోంది. రద్దీ పెరగడంతో ఆర్థికంగా స్థోమత ఉన్నవారు ప్రయివేట్ ఆస్పత్రుల వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

​​ప్రజలకు నాణ్యమైన వైద్యం అందడమే కీలకం
మోడీ ప్రభుత్వం గత దశాబ్దంలో వైద్య రంగంలో కొన్ని కీలక చర్యలు తీసుకున్నట్టు ప్రచారం చేసుకుంటోంది. వైద్య కళాశాలల సంఖ్య పెరిగిందనీ, ఎంబీబీఎస్‌ ‌సీట్లు పెరిగాయని అంటోంది. అలాగే జన్ ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరలకు మందులు అందించే ప్రయత్నం జరిగిందనీ, ఆయుష్మాన్ భారత్–ప్రధాన్‌మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద అర్హులైన కుటుంబాలకు ఏడాదికి రూ.5 లక్షల వరకు నగదు రహిత ఆస్పత్రి చికిత్స అందించే వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్తోంది. ఇంతగా చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వం… ‘ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతోందా? దానిని భరించే స్థితిలో వారు ఉన్నారా?’ అన్న కీలక విషయాలను మాత్రం విస్మరిస్తోంది.

​ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతమే అసలు పరిష్కారం
భారత్ దశాబ్దాలుగా ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక వైద్య సంస్థలను నిర్మించింది. అయితే దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలంటే జిల్లా ఆస్పత్రులను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంటరీ కమిటీ కూడా జిల్లా ఆస్పత్రులను ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థకు వెన్నెముకగా మార్చాలని సూచించింది. వైద్య కళాశాలలను కేవలం పెద్ద నగరాల చుట్టూ కాకుండా జిల్లా ఆస్పత్రులతో అనుసంధానించాలని సిఫారసు చేసింది. ఇది జరిగితేనే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపడే అవకాశం ఉంటుందని సూచించింది.

​ప్రభుత్వ వ్యయం జీడీపీలో ఐదు శాతం వరకు పెరగాలి
ఆరోగ్యరంగంపై ప్రభుత్వ వ్యయం దేశ జీడీపీలో కనీసం 2.5 శాతానికి పెంచాలనీ, ఆ తర్వాత దానిని క్రమంగా ఐదు శాతానికి చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల పరిస్థితితో పోలిస్తే భారత్ ఆరోగ్యరంగంలో ప్రభుత్వ కేటాయింపులు, చేసే ఖర్చులు ఇంకా తక్కువగానే ఉన్నాయి. దేశం ప్రపంచ వైద్య కేంద్రంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకోవడం మాత్రమే సరిపోదనీ, భారత్‌‌లోని ప్రతి పౌరుడికి కూడా అదే నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

​ఆస్పత్రుల సంఖ్య కాదు.. చికిత్సకయ్యే ఖర్చు, సేవలే ముఖ్యం
దేశంలో వైద్య కళాశాలలు పెరిగాయి. మందుల దుకాణాలు పెరిగాయి. ఆరోగ్య బీమా విస్తరించింది. ఆస్పత్రుల సంఖ్య కూడా పెరుగుతోంది. కానీ ఒక పేద, మధ్యతరగతి కుటుంబానికి క్యాన్సర్, గుండె జబ్బు, కిడ్నీ వ్యాధి, మరేదైనా తీవ్రమైన అనారోగ్యం వస్తే.. చికిత్స ఖర్చు వారికి భరించగలిగే స్థాయిలో ఉందా, ఎలాంటి కొరతా లేకుండా సేవలు సరిగ్గా అందుతున్నాయా అన్నదే అసలైన కొలమానంగా నిపుణులు చెప్తున్నారు. అది సాధించినప్పుడే భారత్‌ ‌నిజమైన ఆరోగ్య ప్రగతి సాధించినట్టవుతుందనీ, ఆ బాధ్యతను ప్రభుత్వం గుర్తెరగాలని అంటున్నారు.

ప్రజలు స్వయంగా భరిస్తున్న ఖర్చు 43 శాతం
ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలున్నా..
ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రోగి ఖర్చులు మాత్రం ఆగవు. మందులు, వైద్య పరీక్షలు, ఫాలోఅప్‌ కన్సల్టేషన్లు, ప్రయాణం వంటి ఖర్చులు కుటుంబాలపై పడుతూనే ఉంటాయి. దేశంలో మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రజలు స్వయంగా భరించే ఖర్చు 2022–23 నాటికి అది 43.4 శాతంగా ఉంది. అయితే ఈ పరిస్థితి దేశంలోని ప్రజలను ఆర్థికంగా దెబ్బతీస్తుందని విశ్లేషకులు వివరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -