ఆత్మనిర్భర్ ముసుగులో మోడీ సర్కార్ మరో అడుగు కేంద్రం నిర్ణయంపై అనేక ప్రశ్నలు
రక్షణ రంగంలో కేంద్రం భారీ ద్వారాలు అస్త్ర, ప్రళయ్ తయారీలో ప్రయివేట్‌కు పెద్దపీట
బీడీఎల్‌కు పోటీ..రూ.వేల కోట్ల రక్షణ మార్కెట్‌పై కార్పొరేట్ కన్ను
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్ భారత్’ అనే ప్రచార నినాదాలతో కార్పొరేట్లకు పెద్ద పీట వేస్తోంది. దేశ భద్రతకు అత్యంత కీలకమైన క్షిపణుల తయారీని కూడా ప్రయివేట్ కంపెనీలకు అప్పగించేందుకు నిర్ణయించింది. అస్త్ర, ప్రళయ్ వంటి వ్యూహాత్మక ఆయుధాల తయారీలో వేల కోట్ల రూపాయల మార్కెట్ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకు అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన చోట వాటితోనే ప్రయివేట్ కంపెనీలను పోటీకి దింపడం గమనార్హం. అయితే దీనిని ‘ఆత్మనిర్భర్’ పేరుతో రక్షణ రంగ ప్రయివేటీకరణకు మరో మెట్టు అనుకోవచ్చా? ప్రజాధనంతో అభివృద్ధి చేసిన సాంకేతికత, సున్నితమైన జాతీయ భద్రతకు సంబంధించిన ఉత్పత్తుల నుంచి లాభాలు ఆర్జించేందుకు కార్పొరేట్ రంగానికి కేంద్రం తలుపులు ఎందుకు తెరుస్తోంది? అన్న ప్రశ్నలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
న్యూఢిల్లీ : దేశ రక్షణ రంగంలో కీలకమైన క్షిపణుల తయారీలో కూడా ప్రయివేట్ రంగానికి ద్వారాలు తెరిచేందుకు మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన సంప్రదాయ క్షిపణుల ఉత్పత్తిలో ప్రధానంగా ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు (డీపీఎస్‌యూలు), ముఖ్యంగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) వంటివి కీలక పాత్ర పోషించేవి. ఇకపై అర్హతలు, ధ్రువపత్రాలు, నియంత్రణ అనుమతులకు లోబడి ప్రయివేట్ కంపెనీలూ ఈ ఉత్పత్తి ఒప్పందాల కోసం పోటీ పడే అవకాశం కల్పించారు.
వేల కోట్ల రూపాయల మార్కెట్‌కు తలుపులు
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదంతో డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన అన్ని సంప్రదాయ క్షిపణి వ్యవస్థలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతీయ రక్షణ కంపెనీలకు బదిలీ చేసేందుకు మార్గం సుగమమైంది. దీనివల్ల దేశీయ తయారీ సామర్థ్యం పెరుగుతుందని కేంద్రం సమర్థించుకుంటోంది. దిగుమతుల పై ఆధారపడటం తగ్గుతుందని చెప్తోంది. అలాగే దేశీయ విలువ జోడింపు పెరుగుతుం దనీ, ఎంఎస్‌ఎంఈలు, ఇతర సాంకేతిక భాగస్వాములకు రక్షణ ఉత్పత్తుల సరఫరాలో అవకాశాలు లభిస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. అయితే.. ఈ నిర్ణయం వెనుక మరో కీలక అంశం ఉందని పరిశీలకులు చెప్తున్నారు. క్షిపణుల తయారీకి సంబంధించిన వేల కోట్ల రూపాయల మార్కెట్ ఇక ప్రభుత్వ రంగ సంస్థలకే పరిమితం కాకుండా ప్రయివేట్ కంపెనీలకూ అందుబాటులోకి రానుందని అంటున్నారు.
బీడీఎల్‌కు ఇక పోటీ
ఇప్పటివరకు డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన క్షిపణుల సీరియల్ ఉత్పత్తిలో బీడీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రధాన స్థానం ఉండేది. కొత్త విధానంతో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేట్ కంపెనీలతో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. డీఆర్‌డీఓ కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడమే కాకుండా, సంప్రదాయ క్షిపణుల రూపకల్పన, అభివృద్ధి, ఉత్పత్తిలో ప్రయివేట్ సంస్థలను భాగస్వాములుగా చేర్చే దిశగా ముందుకు వెళ్లనున్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
అస్త్ర, ప్రళయ్‌పై ఆసక్తి
ఈ విధానంలో తొలి దశలో ఎక్కువ ప్రయివేట్ భాగస్వామ్యం లభించే అవకాశం ఉన్న వ్యవస్థల్లో అస్త్ర, ప్రళయ్ క్షిపణులు ఉన్నాయి. అస్త్ర దేశీయంగా అభివృద్ధి చేసిన బియాండ్ విజువల్ రేంజ్ గగనతల క్షిపణి. ప్రళయ్ ఖచ్చితమైన దాడుల కోసం అభివృద్ధి చేస్తున్న క్షిపణి వ్యవస్థ. సాయుధ దళాలకు వీటి అవసరం పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తిని వేగవంతం చేయడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా చెప్తోంది.
భవిష్యత్‌లో బ్రహ్మోస్‌కు కూడా…?
బ్రహ్మోస్ క్షిపణి తయారీలో ప్రయివేట్ సంస్థలు ఇప్పటికే కొన్ని భాగాలు, లాంచర్ విడిభాగాల తయారీలో పాల్గొంటున్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పటికే ఆర్డర్‌లో ఉన్న క్షిపణుల ఉత్పత్తిని వేగవంతం చేయాల్సిన అవసరం ఏర్పడితే మరిన్ని ప్రయివేట్ కంపెనీలను కూడా ఈ కార్యక్రమంలోకి తీసుకురావచ్చని ఆ వర్గాలు పేర్కొనడం గమనార్హం.
‘ఆత్మనిర్భర్’ పేరుతో అసలు లక్ష్యం ఏమిటి?
మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ‘ఆత్మనిర్భర్ భారత్’ దిశలో మరో అడుగుగా ప్రచారం చేస్తోంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, దేశీయ రక్షణ ఉత్పత్తిని పెంచడం, ప్రయివేట్ రంగ సామర్థ్యాన్ని వినియోగించుకోవడం అవసరమే. అయితే, అత్యంత వ్యూహాత్మకమైన క్షిపణి తయారీ వంటి రంగాల్లో ప్రభుత్వ నియంత్రణ, పారదర్శకత, జాతీయ భద్రతా ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానం రక్షణ వంటి అంశాలపై మరింత స్పష్టత అవసరం. ‘ప్రయివేటీకరణే సామర్థ్యానికి పరిష్కారం’ అన్న ఒక్క వాదనతో ఈ అంశాన్ని ముగించలేమని నిపుణులు, విశ్లేషకులు చెప్తున్నారు. ‘‘ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలకు అందిన అవకాశాలను ప్రయివేట్ కంపెనీలకు విస్తరించడం వల్ల పోటీ పెరగవచ్చు. ఉత్పత్తి వేగం పెరగవచ్చు. కానీ అదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థల సామర్థ్యాన్ని బలోపేతం చేయడమా, లేక వాటి పాత్రను క్రమంగా తగ్గించడమా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది’’ అని అంటున్నారు.
‘ఆత్మనిర్బర్’ ప్రయివేటు కోసమేనా!
మోడీ సర్కారు చెప్పే ‘ఆత్మనిర్భర్ భారత్’ అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలోని దేశీయ సామర్థ్యాలను బలోపేతం చేయడమా? లేక ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రయివేట్ కార్పొరేట్ రంగానికి వ్యూహాత్మక రక్షణ ఉత్పత్తుల మార్కెట్‌ను విస్తరించడమా? అన్న సందేహాలు ఇప్పుడు అందరిలో కలుగుతున్నాయి. క్షిపణుల తయారీని విస్తరించడం అవసరమే అయినా.. వాటిని ఎవరు తయారు చేస్తున్నారు అన్నదానికంటే ప్రజాధనం ఎంత ఖర్చవుతోంది, కాంట్రాక్టులు ఎవరికి ఎలా ఇస్తున్నారు, ధరలు ఎలా నిర్ణయిస్తున్నారు, నాణ్యతకు ఎవరు బాధ్యత వహిస్తారు, దేశ భద్రతకు సంబంధించిన సాంకేతికతపై నియంత్రణ ఎలా ఉంటుంది అనే ప్రశ్నలకు మోడీ ప్రభుత్వం సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు.
జవాబుదారీతనం ముఖ్యం
మోడీ ప్రభుత్వం దీనిని ‘ఆత్మనిర్భర్ రక్షణ రంగం’గా చూపిస్తూ కవర్ చేసుకుంటోంది. కానీ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రయివేట్ కంపెనీల వైపు వ్యూహాత్మక ఉత్పత్తి కాంట్రాక్టుల తలుపులు తెరవడం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటో స్పష్టంగా వివరించాల్సిన బాధ్యత కూడా కేంద్రంపైనే ఉందని అంటున్నారు. ఒక దేశానికి కీలకమైన, సున్నితమైన రక్షణ రంగంలో ప్రయివేట్ భాగస్వామ్యం పెరగడం అంత సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ భద్రతకు సంబంధించిన క్షిపణుల విషయంలో లాభాల కంటే జాతీయ ప్రయోజనం, పారదర్శకత, జవాబుదారీతనం ముందుండాలని సూచిస్తున్నారు.



