నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్‌లో సంభవించిన ఆకస్మీక విపత్తు కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు వందల సంఖ్యలో గల్లంతు అయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం నేపాల్ విపత్తు దళం( Nepal’s National Disaster Risk Reduction and Management Authority) సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఈక్రమంలో ఆయా ప్రాంతాల్లో వందల సంఖ్యలో మృతదేహాలు లభ్యమైయ్యాయి. తాజాగా అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అత్యధిక సంఖ్యలో మృతదేహాలు చిత్వాన్ జిల్లాలో లభ్యమయ్యాయి. అక్కడ మొత్తం 108 మృతదేహాలను వెలికితీశారు.
జిల్లా వారీగా లభ్యమైన మృతదేహాల వివరాలు ఇలా ఉన్నాయి:
ధాడింగ్‌లో 27, నువాకోట్‌లో 12, రసువాలో 2, గోర్ఖాలో 20, తూర్పు నవల్పరాసిలో 62, తనహున్లో 12, చిత్వాన్‌లో 108. పశ్చిమ నవల్పరాసిలో 15. గల్లంతైన లేదా ఆచూకీ తెలియని 910 మంది జాబితాలో 28 మంది నేపాల్ పోలీసు సిబ్బంది, 44 మంది నేపాల్ సైనిక సిబ్బంది, 13 మంది సాయుధ పోలీసు దళ సిబ్బంది, 15 మంది కస్టమ్స్ కార్యాలయ సిబ్బంది, నలుగురు ఇమ్మిగ్రేషన్ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
జిల్లా అత్యవసర కార్యకలాపాల కేంద్రం (DEOC) నుండి అందిన సమాచారం ప్రకారం.. రసువా జిల్లాలో 161 మంది గల్లంతయ్యారు, కాగా నువాకోట్‌లో ఒకరు గల్లంతైనట్లు పేర్కొన్నారు. అదే విధంగా పలు దేశాలకు చెందిన 517 మంది విదేశీ పౌరుల ఆచూకీ లభ్యంకాలేదన్నారు. రసువాలో 43 మంది, ధాడింగ్‌లో ముగ్గురితో సహా మొత్తం 73 మంది గాయపడినట్లు అధికారులు నివేదించారు.



