– అనారోగ్య బాధితులు పట్ల శ్రద్ధ
నవతెలంగాణ – అశ్వారావుపేట : అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ముఖ్యంగా వైద్య చికిత్సలకు ఆర్థిక సహాయం కోరుతున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తున్నారు.
ఈ క్రమంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనారోగ్య బాధితుల నుంచి సేకరించిన 78 ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) దరఖాస్తులను గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి కార్యాలయ ప్రతినిధికి ఎమ్మెల్యే అందజేశారు.
ఖరీదైన వైద్య చికిత్సలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను ఆదుకునేందుకు అర్హులైన వారికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం తన క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేవలం స్థానిక స్థాయిలో పరిష్కరించడానికే పరిమితం కాకుండా, అవసరమైన సందర్భాల్లో సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులను స్వయంగా కలిసి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారికి చేరేలా తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు.



