నవతెలంగాణ – స్టేషన్‌ఘన్‌పూర్
పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం జీఓ 97ను వెంటనే రద్దు చేయాలనే అభిప్రాయాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలో తన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరుతున్నట్లు తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థులను ఇంజినీరింగ్ వ్యవస్థ నుంచి లేబర్ డిపార్ట్‌మెంట్‌కు అనుసంధానం చేయడంపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచాలనే ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, ఆ నిర్ణయం తమ విద్యా భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందనే ఆందోళనతో విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు.
విద్యార్థుల ఆందోళనలను, అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉందని, నిర్ణయం తీసుకునే ముందు వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కడియం శ్రీహరి సూచించారు. దేశవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్య ఏ విధానంలో కొనసాగుతుందో అదే విధానాన్ని తెలంగాణలోనూ కొనసాగించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక ఉద్దేశం మంచిదైనా.. విద్యార్థులే అంగీకరించని విధానాన్ని కొనసాగించడం కంటే వారి భవిష్యత్తుకు భరోసా కల్పించేలా నిర్ణయాన్ని పునఃసమీక్షించడమే సముచితమని అన్నారు. జీఓ 97పై నెలకొన్న విద్యార్థుల ఆందోళనలకు ప్రభుత్వం తక్షణమే స్పందించి స్పష్టత ఇవ్వాలని కోరారు.



