ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుతమైన జర్నలిజం
ఎంతో అవసరం : అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్
మీడియా గొంతు నొక్కితే ప్రజాస్వామ్యం
మూగబోతుంది :మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
ప్రమాదంలో ప్రజాస్వామ్యం : నవతెలంగాణ ఎడిటర్ రాంపల్లి రమేష్
వికారాబాద్‌లో నవతెలంగాణ 11వ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభ
హాజరైన ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు
నవతెలంగాణ- వికారాబాద్, మర్పల్లి
ప్రజాస్వామ్యంలో అధికారం, ప్రతిపక్షం హోదా దక్కాలంటే పత్రికలకే సాధ్యమని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, ప్రజల గొంతుకగా నిలవడంలో పత్రికా రంగం కీలక పాత్ర పోషిస్తున్నదని తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివకేశవ బ్యాంక్ హాల్లో నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవ సభ జరిగింది. ముందుగా నవతెలంగాణ వికారాబాద్ ప్రత్యేక సంచికను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, నవతెలంగాణ ఎడిటర్ రాంపల్లి రమేష్, జీఎం వెంకటేశ్, మొఫిసిల్ ఇన్చార్జి జి.వేణుమాధవరావు, ఇతర నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ నవతెలంగాణ పత్రిక జనశక్తిగా ప్రారంభమై.. ప్రజాశక్తిగా.. ప్రస్తుతం నవతెలంగాణగా కొనసాగుతుంద న్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా మీడియా పని చేస్తూ, సమాజంలోని సమస్య లను ఎప్పటికప్పుడూ ప్రజల దృష్టికి తీసుకురావడం అభినందనీ యమని అన్నారు. ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ.. వారి సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో నవతెలంగాణ తనదైన పాత్ర పోషిస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుతమైన, బాధ్యతాయుతమైన జర్నలిజం ఎంతో అవసరమనిచెప్పారు. నవతెలంగాణ పత్రికకు శుభాకాంక్షలు తెలిపారు.
మీడియా గొంతు నొక్కితే ప్రజాస్వామ్యం మూగబోతుంది : మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
మీడియా గొంతు నొక్కితే ప్రజాస్వామ్యం మూగబోతుందని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ప్రజల గొంతుకగా నిలవడంలో పత్రికా రంగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా మీడియా పనిచేస్తూ సమా జంలోని సమస్యలను ఎప్పటికప్పు డూ ప్రజల దృష్టికి తీసుకురావడం అభినందనీయమని తెలిపారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయు తమైన, బాధ్యతాయుతమైన జర్నలిజం ఎంతో అవసరమని అన్నారు. ప్రజల పక్షాన మరింత బలంగా నిలుస్తూ వాస్తవాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువెళ్తూ నవతెలంగాణ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సమాజంలో పత్రికల ప్రాధాన్యతను వివరించారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా… పత్రికల్లో వచ్చే వాస్తవాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్రతిపక్షాలు చేసే సూచనలను పాటించాలన్నారు. ప్రతిపక్షాలు కూడా సరైన సూచనలు ఇవ్వాలన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణాలు సరికాదని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన జెన్ జీ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ.. యువత తలుచుకుంటే. ఎంతటి వారైనా తలవంచక తప్పదని అన్నారు. నవతెలంగాణ పత్రిక దశాబ్ది ఉత్సవాలే కాదు.. శతాబ్ది కాలం పాటు ఉండాలని ఆకాంక్షించారు. ఇలాంటి పత్రికను ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు. మీడియా అంతా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిన నేటి తరుణంలో ఎవరీ సహకారం లేకుండా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం నవతెలంగాణ పత్రిక నిలబడడం గొప్ప విషయం అన్నారు. నవతెలంగాణ పత్రికకు తమ సహకారం ఉంటుందని అన్నారు.
ప్రమాదంలో ప్రజాస్వామ్యం : ఎడిటర్ రాంపల్లి రమేష్
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని నవతెలంగాణ ఎడిటర్ రాంపల్లి రమేష్ అన్నారు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు మాత్రమే కాదన్నారు. ప్రజలకు స్వేచ్ఛ దక్కిన రోజు ప్రజాస్వామ్యం మనుగడలో ఉంటుందన్నారు. నవతెలంగాణ పత్రిక చరిత్రను, సిద్ధాంతలను వివరించారు. గొంతు లేని వారికి గొంతుగా ఉంటుందన్నారు. ప్రస్తుతం వార్త వస్తువుగా మారిందన్నారు. కేవలం నవతెలంగాణ లాంటి పత్రికలు మాత్రమే వాస్తవాలను రాస్తున్నాయని తెలిపారు. నవతెలంగాణ ప్రత్యామ్నాయ జర్నలిజాన్ని అందిస్తుందన్నారు. ప్రపంచంలో సంపద సృష్టించబడుతున్న విషయం నిజమే అయినప్పటికీ.. సగం మంది జనాభా అర్థాకలితో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశలో జీడీపీ పరుగు పెడుతున్నట్టు పాలకులు చెబుతున్నా.. అసమానతలు అలాగే ఉన్నాయని తెలిపారు. అంబానీ సంపద 500 రెట్లు, అదానీ సంపద 1542 రెట్లు పెరిగిందన్నారు. పేదవారు మాత్రం పేదరికంలోనే మగ్గుతున్నారని తెలిపారు. ఇలాంటి నిజాలను నవతెలంగాణ ప్రచురిస్తుంది కాబట్టే దిగ్విజయంగా ముందుకు సాగుతుందన్నారు. భవిష్యత్ లోనూ నవతెలంగాణ ఇదే పాత్రను పోషిస్తుందని స్పష్టం చేశారు. వికారాబాద్ విలేకరి రాంచందర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో మొఫిసియల్ ఇన్‌చార్జి వేణుమాదవ్ రావు, ఏడివీటీ జీఎం వెంకటేష్, రంగారెడ్డి రీజియన్ మేనేజర్ మహేందర్‌రెడ్డి, రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి సైదులు, రీజియన్ డెస్క్ ఇన్చార్జి అజయ్ , పత్రికా సిబ్బంది, విలేకరులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు, ఉద్యోగులు పాల్గొన్నారు.



