Wednesday, April 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి: ఐద్వా

మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి: ఐద్వా

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) భువనగిరి మండల అధ్యక్ష , కార్యదర్శులు రాసాల నిర్మల, కొండమడుగు నాగమణి డిమాండ్ చేసినారు. ఆదివారం భువనగిరి మండల పరిధిలోని బస్వాపురం గ్రామంలో ఐద్వా ఇంటింటి సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడితే మహిళలకు నెలనెలా రూ.2500 ఇస్తామని, పెళ్లి చేసుకున్న ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి డబ్బులతోపాటు తులం బంగారం ఇస్తానని చెప్పి అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు గడిచిన ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

భూమిలేని ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.12 వేల ఇస్తానని చెప్పి నేటికీ అమలు చేయడం లేదని అన్నారు. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణము అమలు చేస్తున్న పట్టణాలకు తప్ప గ్రామాలకు ప్రభుత్వ బస్సులు వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. గ్యాస్ సబ్సిడీ అన్నారు కానీ అందరికీ రావడం లేదని, పెన్షన్ పెంపుదల లేదని, వృద్ధ మహిళలకు, భర్తలు చనిపోయిన వితంతులకు, ఒంటరి మహిళలకు గత ఆరేడు సంవత్సరాలుగా పెన్షన్లు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వము ఇవ్వడం లేదని విమర్శించారు. మరో పక్క ఉపాధి హామీ పథకంలో నూటికి 90 శాతం పనిచేస్తున్న మహిళలకు జాబు కార్డు కోసం ఎవరన్న దరఖాస్తు చేసుకుంటే ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు.

మరో పక్క రాష్ట్రంలో, దేశంలో మహిళల పైన దాడులు, దౌర్జన్యాలు హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆవేదన వెలిబుచ్చారు. మహిళల రక్షణ కోసం చట్టాలు ఉన్న సరిగా అమలు కావడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం, మహిళల రక్షణ కోసం ఐక్యంగా మహిళలు ఉద్యమాలకు సిద్ధం కావాలని నిర్మల నాగమణి పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో దూసరి మానస, బుగ్గ రేణుక, కొండమడుగు భూమమ్మ, రాసాల వెంకటమ్మ , అన్నంపట్ల మైసమ్మ, రాసాల గ్రహణమ్మ , అన్నంపట్ల భాగ్యమ్మ , కొండమడుగు నవనీత, అన్నంపట్ల తిరుమల లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -