Wednesday, April 15, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినయా ఉదారవాదం తాకిడి - జాతీయోద్యమ స్ఫూర్తికి బీటలు

నయా ఉదారవాదం తాకిడి – జాతీయోద్యమ స్ఫూర్తికి బీటలు

- Advertisement -

ఇరాన్‌ మీద అమెరికా-ఇజ్రాయిల్‌ సాగి స్తున్న యుద్ధం విషయంలో భారత ప్రభుత్వం ఇంత నీచమైన స్థాయిలో పిరికిపందలాగా వ్యవహరించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతు న్నారు. ఈ మధ్య బ్రిటన్‌ యాభై దేశాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసింది. దానికి భారతదేశం కూడా హాజరైంది. ఆ సమావేశంలో హార్ముజ్‌ జలసంధిని మూసివేసి నందుకు ఇరాన్‌ను చాలా తీవ్రంగా విమర్శిం చారే తప్ప ఇరాన్‌ మీద అమెరికా- ఇజ్రాయిల్‌ జరుపుతున్న దాడి గురించి పల్లెత్తు మాట కూడా అనలేదు. ఐ.రా.స సర్వసభ్య సమావేశం గల్ఫ్‌లోని ఇతర దేశాల మీద ఇరాన్‌ జరుపుతున్న దాడులను ఖండిస్తూ ఒక తీర్మానం చేసింది. దాని ప్రతిపాదకులలో భారత్‌ కూడా ఒకటి (వాస్తవానికి ఇరాన్‌ గల్ఫ్‌లో ఏర్పాటైన అమెరికన్‌ సైనిక స్థావరాల మీదనే దాడి ఎక్కుపెట్టింది). ఆ సందర్భంలో కూడా ఎక్కడా అమెరికా-ఇజ్రాయిల్‌ కూటమిని విమర్శించ లేదు. ఇరాన్‌ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ హత్య పట్ల, మినాబ్‌లో 175 మంది అమాయకులైన స్కూలు పిల్లలను దారుణంగా బాంబు దాడిలో చంపడం పట్ల సంతాపాన్ని ప్రకటించడానికి కూడా భారత్‌కు చాలా వారాలు పట్టింది.

అయితే ఇటువంటి పిరికితనం ప్రదర్శిస్తున్నది కేవలం భారత్‌ మాత్రమే కాదు. ద్వంద్వ ప్రమాణాలతో కూడిన ఐ.రా.స తీర్మానాన్ని బలపరిచిన దేశాలు 135 ఉన్నాయి. ఆ విధంగా చేయకపోతే ఎక్కడ అమెరికాకు ఆగ్రహం కలుగుతుందోనని భయపడుతున్నాయి. నిజానికి కొద్దిపాటి వేళ్లమీద లెక్కపెట్టగల దేశాలు మాత్రమే అమెరికా- ఇజ్రాయిల్‌ కూటమి ఇరాన్‌పై చట్టవిరుద్ధంగా, అనైతికంగా సాగిస్తున్న యుద్ధాన్ని నిర్ద్వంద్వంగా ఖండించగల దమ్ము చూపగలిగాయి. ఈ పరిస్థితి తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలో వలస విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సాగిన పోరాటాలు ఆయా దేశాల, జాతుల సార్వభౌమాధికారాన్ని అందరూ గౌరవించి, గుర్తిం చాలన్న మూలసూత్రం మీద ఆధారపడి నడిచాయి. వలస పాలనా కాలం అంతమైన తర్వాత ఇంతవరకూ ఆ సూత్రాన్ని గౌరవిస్తున్నారు. కాని ఇప్పుడు ఐ.రా.స తీర్మానం ఆ మూలసూత్రాన్ని, వలస పాలన రద్దు వెనుక ఉన్న ప్రాతిపదికను ధ్వంసం చేస్తోంది.
ఈ మూడవ ప్రపంచ దేశాలన్నీ స్వాతంత్య్రాన్ని, సార్వభౌమాధికారాన్ని సాధించడంకోసం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దీర్ఘకాలం అనేక కష్టాలకోర్చి పోరాడిన చరిత్ర కలిగివున్నాయి. ఇప్పుడు ఆ సార్వభౌమాధి కారాన్నే సాటి మూడవ ప్రపంచ దేశం విషయంలో తన సైనిక బలంతో అమెరికన్‌ సామ్రాజ్యవాదం తృణీకరిస్తున్న ప్పుడు ఈ దేశాలన్నీ ఇంత పిరికితనంతో వ్యవహరించడం ఒక చిక్కు ప్రశ్నగా ఉంది.

ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందు మన ప్రపంచంలో నయా ఉదారవాదం చేసిన రెండు బీటలను లేదా పగుళ్లను మనం గుర్తించాలి. మొదటిది: సామ్రాజ్య వాద వలసాధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల క్రమంలో ”జాతి” అనే భావన రూపొందింది. ఈ భావన పశ్చిమ యూరప్‌ దేశాలలోని ”జాతి” భావన కన్నా మౌలి కంగా విభిన్నమైనది. మొదటి తేడా: పశ్చిమ యూరప్‌ ‘జాతి’ భావన ఒకానొక అంతర్గత శత్రువును లక్ష్యంగా చేసుకుని ఆ శత్రువుకు వ్యతిరేకంగా తక్కిన ప్రజానీకాన్ని ఐక్యం కావాలని కోరుతుంది. కాని వలసాధి పత్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ముందుకొచ్చిన ”జాతి’ భావనలో అటువంటి అంతర్గత శత్రువు ఎవరూ ఉండరు. ఈ భావన అందరినీ కలుపుకుని పోయే భావన. ఇక రెండవ తేడా: పశ్చిమ యూరప్‌ ”జాతి” భావనలో విస్తరణ కాంక్ష కలగలిసి వుంది. అదే వలసాధిపత్య వ్యతిరేక పోరాటంలో ముందుకొచ్చిన ”జాతి” భావన ఎటువంటి విస్తరణ కాంక్షనైనా వ్యతిరేకిస్తుంది. మూడవ తేడా: పశ్చిమ యూరప్‌ ‘జాతి’ భావన దేశాన్ని ప్రజలకు అతీతమైన ఒక దేవతామూర్తిగా చిత్రించి ప్రజలందరూ దానికి విధేయులుగా వ్యవహరించాలని బోధిస్తుంది. అదే వలసాధి పత్యానికి వ్యతిరేకంగా తలెత్తిన ”జాతి” భావన దేశం అంటేనే ప్రజలు అని స్పష్టంగా ప్రకటిస్తుంది.

సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం అనేది ఒక బహుళ వర్గ పోరాటం. అందులోకి భిన్న వర్గాల ప్రజలను కలుపుకురావాలి. ఆ క్రమంలోనే ఇక్కడ ”జాతి” భావన అనేది యూరోపియన్‌ భావనకు భిన్నంగా ఆవిర్భవించింది. స్వాతంత్య్రం అనంతరం ప్రభుత్వ నియంత్రణలో ఆర్థిక వ్యవస్థ నడిచే విధానం అమలు లోకి వచ్చింది. ఆ విధానం పెట్టుబడిదారీ అభివృద్ధి క్రమాన్ని ప్రోత్సహించినప్పటికీ, పెట్టుబడి దారీవర్గం ‘దేశాభివృద్ధి’ పేరుతో అడ్డగోలుగా వ్యవ హరించడానికి వీలు లేకుండా ఆంక్షలు విధించింది. ప్రభుత్వానికి బహుళ వర్గాల మద్దతు అవసరం కనుక దానిని నిలబెట్టుకోడానికి అలా చేసింది. ఇందుకు పెట్టుబడిదారులు కూడా పెద్దగా అభ్యంతరం ఏమీ చెప్పలేదు. సామ్రాజ్య వాద నియంత్రణ నుండి బయటపడి తాము వేగంగా అభివృద్ధి చెందాలంటే రాజ్యం స్వయం నిర్ణాయక శక్తితో వ్యవహరిం చాల్సి వుంటుందని, సామ్రాజ్య వాదం ముందు లొంగుబా టును ప్రదర్శించకూడదని వారూ అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే రూపొందిన అభివృద్ధి క్రమం దేశంలో ప్రభుత్వ రంగం పెద్ద ఎత్తున అభివృద్ధి చెంద డానికి దారితీసింది. మూడవ ప్రపంచ దేశాలలో ఎక్కువ భాగం అలీన విధానాన్ని అనుసరించడం ఈ క్రమానికి తోడైంది. ఇటువంటి వ్యవస్థలో మధ్యస్థ వర్గాలు నిర్ణయా త్మకంగా వ్యవహరించగలిగాయి. ప్రభుత్వ రంగం, అలీన విధానం-ఈ రెండూ స్వాతంత్య్రానంతర కాలంలో రెండు ముఖ్యమైన లక్షణాలు.

పెట్టుబడి ప్రపంచీకరణ ఎప్పుడైతే వేగం పుంజుకుందో అప్పటి నుంచీ పరిస్థితులు మారిపోయాయి. దేశంలోని గుత్త పెట్టుబడిదారీ వర్గం అంతర్జాతీయ పెట్టుబడితో మమేక మైంది. అంతవరకూ అనుసరిస్తూ వచ్చిన అభివృద్ధి క్రమానికి నీళ్లొదిలింది. సమాజంలోని వృత్తి నిపుణులు, బ్యూరోక్రాట్లు తమ బిడ్డలు సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో స్థిరపడాలని బలంగా కోరుకున్నారు. అందుచేత వారంతా నయా ఉదారవాద వ్యవస్థకు గట్టి మద్దతు దారులుగా నిలిచారు. భూస్వామ్య వర్గాలు సైతం నయా ఉదారవాద వ్యవస్థలోనే తమ భవిష్యత్తును నిర్మించుకోడానికి సిద్ధపడ్డాయి. ఈ తరగ తులన్నీ కలిసి కార్మికులకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు, చిన్న ఉత్పత్తిదారులకు, చిన్న జీతగాళ్లకు వ్యతిరేకంగా బలంగా నిలిచాయి. ఆ విధంగా సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమంలో భాగంగా రూపొందిన బహుళ వర్గ ఐక్య సంఘటన బీటలు వారింది.

సామ్రాజ్యవాద ఆధిపత్యానికి, సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు వ్యతిరేకంగా ‘జాతి’ ఐక్యంగా వ్యవహ రించడం అప్పటివరకూ ఉన్న ధోరణి. ఇప్పుడు దానికి బదులు దేశీయ, బహుళ దేశ బడా పెట్టుబడి కుమ్మక్కై దేశంలో తాము అనుసరించే ”అభివృద్ధి” విధానాలను వ్యతిరేకించే అన్ని సామాజిక తరగతులనూ ప్రగతి నిరోధక శక్తులుగా పరిగణించే ధోరణి తలెత్తింది. జీడీపీ వృద్ధి మంత్రమే సర్వస్వం అయ్యింది. ప్రయివేట్‌ కార్పొరేట్ల ప్రయోజనాలే ఇప్పుడు ”దేశ ప్రయోజనాలు” అయిపోయాయి. వాటికోసం పని చేయడమే తక్కిన అన్ని వర్గాల బాధ్యతగా అయి పోయింది. ఆ విధంగా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో రూపొందిన ”జాతి” భావన బీటలు వారింది. ఇక ఇప్పుడు సామ్రాజ్యవాదం నుండి విముక్తి కోరుకోవడం అనేది ఎంతమాత్రమూ లక్ష్యంగా లేదు. నయా ఉదారవాద చట్రాన్ని పరిరక్షించడమే ఏకైక లక్ష్యం అయిపోయింది.

ముందు పేర్కొన్న రెండు బీటలలో ఇది మొదటిది. ఇప్పుడు నయా ఉదారవాద ప్రభుత్వం తీసుకునే వైఖరి దేశ సార్వభౌమాధికారాన్ని పటిష్టపరుస్తుందా లేక బలహీనప రుస్తుందా అన్నది ప్రామాణికంగా ఎంతమాత్రమూ లేదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం బడా కార్పొరేట్ల ప్రయోజ నాలను నెరవేరుస్తుందా లేదా అన్నదే ప్రధానం అయి పోయింది. బడా కార్పొరేట్ల ప్రయోజనాలే ‘దేశ ప్రయోజ నాలు’ అయిపోయాయి. అందుచేత మూడవ ప్రపంచ దేశా లలో ప్రభుత్వాలు అమెరికా-ఇరాన్‌ యుద్ధంలో అనుసరించ వలసిన వైఖరిని నిర్ణయించేది ఆ దేశంలోని బడా కార్పొరేట్ల ప్రయోజనాలే తప్ప తమ దేశ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకోవడం అనేది కానేకాదు. అందుకనే మూడవ ప్రపంచ దేశాలలో ఎక్కువ శాతం భయంకరమైన మౌనాన్ని పాటిస్తున్నాయి.

నయా ఉదారవాదం కలిగించిన రెండవ బీట గురించి చూద్దాం. నయా ఉదారవాద విధానాలను అను సరిస్తే మన ఎగుమతులు విపరీతంగా పెరుగుతాయని, ఆ పెరుగుదల ఆధారంగా దేశం కూడా వేగంగా వృద్ధి సాధి స్తుందని, ప్రభుత్వ నియంత్రణలోనే పాత పద్ధతిలో కొనసాగితే అటువంటి అభివృద్ధి సాధ్యం కాదని నమ్మబలికి ఆ విధానాలను మనపై రుద్దారు. కాని ఈ వాదన పూర్తిగా బూటకమైనది. అన్ని దేశాలూ ఎగుమతులను పెంచడం మొదలుపెడితే వాటిని కొనుగోలు చేసేదెవరు? ఎగుమతులు పెరిగినంత మాత్రాన కొనుగోలుశక్తి పెరిగిపోదు కదా? అందుచేత ఎగుమతి చేసే దేశాల మధ్య పోటీ విపరీతంగా పెరిగిపోతుంది. ఆ పోటీ పర్యవసానంగా పక్కదేశాన్ని దెబ్బతీసైనా తాము బాగుపడాలనుకునే ధోరణి బలపడు తుంది. అప్పుడు బలమైన దేశాలు మరింత బల పడతాయి, బలహీన దేశాలు మరింత బలహీన పడతాయి. వాటిలో వృద్ధిరేటు పెరగకపోగా క్షీణిస్తుంది. అంతేకాక, ఈ అనారోగ్య కర పోటీ ఫలితంగా అలీన విధానాన్ని అనుసరించడం వెనక్కి పోతుంది. సామ్రాజ్య వాద దేశాలను మంచి చేసుకోవడం ప్రధానమౌతుంది. మూడవ ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా నిలిచి దాని దూకుడును అడ్డుకునే బదులు అదే సామ్రాజ్యవాదానికి దాసోహం అనడం పెరుగు తుంది. తమ దేశంలోకి బహుళ జాతి పెట్టు బడుల ప్రవాహం వస్తే అప్పుడు తమ జీడీపీ వృద్ధి రేటు పెరుగుతుంది కనుక ఆ పెట్టుబడుల ప్రవాహం తక్కిన దేశాలకన్నా తమ దేశంలోకే రావాలన్న తాపత్రయం పెరుగుతుంది. అలీన విధానం అనేదే కనిపించకుండా పోతుంది. ఇలా అలీనోద్యమం దెబ్బ తినడమే నయా ఉదారవాదం చేసిన రెండో బీట.

ఇప్పుడు మనకి మూడవ ప్రపంచ దేశాల్లో ఎక్కువ భాగం ఇరాన్‌ మీద దాడిని ఖండించకుండా ఎందుకు మౌనం పాటిస్తున్నాయో అర్థమౌతుంది. గత కొన్ని దశాబ్దాలుగా నయా ఉదారవాదం అటు సామ్రాజ్యవాద వ్యతిరేక స్వభావం కలిగి, అందరినీ ఇముడ్చుకుంటూ, ప్రజాతంత్ర లక్షణంతో కూడిన ”జాతి” భావనను, ఇటు సామ్రాజ్యవాద వ్యతిరేక సంఘీభావ స్వభావం కలిగిన ‘అలీనోద్యమ” భావనను దెబ్బతీ యడానికి ప్రయత్నిస్తూనే వుంది. ఆ రెండుభావనల స్థానంలో సామ్రాజ్యవాద అనుకూలతను, లొంగుబాటును ప్రవేశపెట్టిం ది. దాని పర్యవసానాలనే నేడు మనం చూస్తున్నాం.

పెట్టుబడిదారీ విధానం ఎన్నడూ తనకు వ్యతిరేకంగా ఏ శక్తులూ ఐక్యంగా వ్యవహరించడాన్ని సహించదు. కార్మికులు ఐక్యమై ట్రేడ్‌ యూనియన్‌ పెట్టుకోవడాన్నే అది జీర్ణించు కోలేదు. సంపద ఉత్పత్తిదారులను, ముడిసరుకు సరఫరా దారులను ఐక్యం కానివ్వకుండా, విడివిడిగా చీల్చి వుంచి కొల్లగొట్టడమే దాని విధానం. నయా ఉదారవాదం అంటేనే అవధులు లేని పెట్టుబడిదారీ దోపిడీ పద్ధతులను అమలు చేయడం. అందుచేత అది ఏ దేశంలోనూ సామ్రాజ్యవాద వ్యతిరేక స్వభావం కలిగిన ఉద్యమాలను, ఆ యా వర్గాలు ఈ ఉద్యమాలలో ఐక్యం కావడాన్ని సహించదు. అదే మాదిరిగా సామ్రాజ్యవాద ఆధిపత్యానికి వ్యతిరేకంగా మూడవ ప్రపంచ దేశాలు అలీనోద్యమం పేరిట ఐక్యంగా వ్యవహరించడాన్ని కూడా అది సహించదు.
ఈ మూడవ ప్రపంచ దేశాల్లోని ప్రభుత్వాలు బడా కార్పొరేట్ల ప్రయోజనాలను నెరవేర్చే పనిలోనే తల మునకలై వున్నాయి. అందుచేత అమెరికా ఆధిపత్యాన్ని ఎదిరించి ప్రతిఘటిస్తున్న ఇరాన్‌కు సంఘీభావంగా నిలిచి మద్దతు తెలియజేయాల్సింది ఈ దేశాల్లోని ప్రజానీకమే. మూడవ ప్రపంచ దేశాల సార్వభౌమాధికారాన్ని కాపాడు కోవడం మన ముందున్న కీలక కర్తవ్యం.
(స్వేచ్ఛానుసరణ)

ప్రభాత్‌ పట్నాయక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -