తెలంగాణలో 2026-27 నుంచి నూతన విద్యా విధానం అమలు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో సందేహాలు వ్యక్తమౌతున్నాయి. 12వ తరగతి వరకు పాఠశాల విద్యను అమలు చేస్తూ పదో తరగతి బోర్టు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్ డిప్లోమా, ఐటీఐ, డిప్లోమో ఇన్ నర్సింగ్..ఇలా పలు కోర్సులు చదివి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందే వారికి ప్రత్యామ్నాయం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం పూర్తి చేసుకుంటున్న టెన్త్ విద్యార్థుల్లోనూ అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
పాలసీపై పెరెంట్స్‌లో ఆందోళన
ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026, విజన్ ఫర్ ఇంక్లూజీవ్ ఎక్స్‌లెన్స్ పేరుతో నూతన విద్యా విధాన ముసాయిదాను రూపొందించి వెబ్‌సైట్‌లో ప్రదర్శించింది రాష్ట్ర ప్రభుత్వం. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఛైర్మన్ గల కమిటీలో పది మంది సభ్యులు 14 నెలల పాటు 305 విద్యా సంస్థలను అధ్యయనం చేసి వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించి సూచనలు, సలహాలు సేకరించి ఈ నివేదిక రూపొందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత విద్యా సంస్థల్లో లోపాలతో పాటు ఉపాధ్యాయుల వేతనాలపై ఇచ్చిన నివేదిక వివాదాస్పదమైన సంగతి తెలిసిందే! యూకేజీ నుండి 12వ తరగతి వరకు ఒకే పాఠశాలలో విద్యార్థులు చదివేలా ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. 351 పేజీలతో ఇంగ్లీష్‌లో రూపొందించి ఈ ముసాయిదాను ప్రదర్శించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే పిల్లల తల్లిదండ్రులు వెబ్‌సైట్‌ను చూసి, ఏ మేరకు అర్థం చేసుకుంటారనేది ప్రభుత్వానికే తెలియాలి.
రెండు నెలల్లో సాధ్యమేనా?
రాష్ట్రంలోని వంద అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని 200 పాఠశాలల్లో నర్సరీ టూ 12వ తరగరతి అమలు చేయనున్నట్లు సర్కారు సూచన ప్రాయంగా తెలిపింది. ఒక్కో స్కూల్‌లో కనీసం 1500 మందికి పైగా విద్యార్థులకు ఇంగ్లీష్‌లో బోధన, స్మార్ట్ బోర్డులు, డిజిటల్ లైబ్రరరీలు, క్రీడా సదుపాయాలు, ఇతర సదుపాయాలు కల్పించాల్సి ఉంది. రెండు మాసాల కాలంలో వీటిని ఏర్పాటు చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏయే ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుచేస్తారు..ఏయే ప్రభుత్వ పాఠశాలలను రద్దు చేస్తారు..ఇలా అనేక సందేహాలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమౌతున్నాయి. ఇంత తక్కువ కాలంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే స్కూల్స్‌లో విద్యార్థులకు అన్ని సదుపాయాలను కల్పించడం, ఉపాధ్యాయుల సర్దుబాటు, ప్రధానంగా కొత్త సెలబస్, పుస్తకాల ముద్రణ, రవాణా వ్యవస్థ ఏర్పాటుపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
డిప్లొమాపై అస్పష్టత?
పదో తరగతి బోర్డు పరీక్షను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. టెన్త్ తర్వాత డిప్లోమా, ఐటీఐ, నర్సింగ్, ఇతర సాంకేతిక కోర్సు ద్వారా ఉద్యోగ ఉపాధి పొందే విద్యార్థులకు ప్రత్యామ్యాయం ఏంటనేది స్పష్టత లేకుండా పోయింది. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు గందర గోళ పరిస్థితి ఎదురు కానుంది. 2026-27 విద్యా సంవత్సరంలో ఎంపిక చేసుకునే కోర్సుపై సందిగ్ధం నెలకొననుంది. తమ పిల్లలు ఎంచుకునే కోర్సు వల్ల భవిష్యత్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై తల్లిదండ్రులకూ అనుమానాలున్నాయి.
నత్తనడకన ‘ఇంటిగ్రేటెడ్’ నిర్మాణాలు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 2024 అక్టోబర్ 11న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్‌కు శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి షాద్‌నగర్‌లో స్కూల్స్‌కు శంకుస్థాపన చేయగా..అదే రోజు 28 నియోజక వర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాఠశాల భవనాలకు శంకుస్థాపనలు చేశారు. ఆ తరువాత పలు దశల్లో మొత్తం 105 స్కూళ్ల పనులను ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ఒక్కో స్కూల్ రూ.200 కోట్ల వ్యయంతో 20 నుండి 25 ఎకరాల విస్తీర్ణంలో 4నుండి 12వ తర గతి వరకు 2500 మంది విద్యార్థులు చదివేలా అన్ని వసతుల కల్పనకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఒకే చోట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేలా రూప కల్పన చేయడం అభినం దనీయం. 18 నెలల్లో వీటి నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటు లోకి తీసుక రావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా..అనేక చోట్ల పనులు నత్త నడకన కొన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్స రానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌లో సదుపాయల కల్పన ప్రశార్థకం కానుంది.
ఈ పాఠశాలల భవిష్యత్తు?
నూతన విద్యా విధానం ఏర్పాటు వల్ల ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ ప్రభుత్వ విద్యాసంస్థల భవిష్యత్‌పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. తెలంగాణ వ్యాప్తంగా 41, 714 ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాల్లో 76 లక్షలా 35 వేల వరకు విద్యార్థులు చదువుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. స్థానిక సంస్థలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీ, రెసిడెన్సియల్, గిరిజన సంక్షేమ ఇతర పాఠశాలలున్నాయి. మొత్తం 28,470 ప్రభుత్వ పాఠశాలల్లో 26 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. విలీనం చేసే ప్రక్రియలో ఎన్ని పాఠశాలలను మూసి వేస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రత్యా మ్నాయంగా విద్యార్థులకు అన్ని సదుపాయాలు, ట్రాన్స్‌పోర్ట్ కల్పన తరువాతే..విలీన ప్రక్రియ చేపట్టాలని మేధావులు, విద్యానిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. నూతన విద్యా విధానంపై క్షేత్ర స్థాయిలో పేరెంట్స్, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలి. ఏకాభిప్రాయానికి వచ్చాకే నిర్ణయం తీసుకోవాలి.
చిలగాని జనార్ధన్
8121938106



