నవతెలంగాణ-హైదరాబాద్: సీజేపీ కార్యకర్త తండ్రిపై దాడికి పాల్పడిన సంఘ్ పరివార్ ఉన్మాది స్వతంత్ర భరద్వాజ్‌కి ఒక్క రోజు పోలీస్ కస్టడీ విధించింది. శనివారం పోలీసులు నిందితుని న్యూఢిల్లీలోని కర్కర్దూమా కోర్టు కాంప్లెక్స్‌లో సంబంధిత న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. జూలైలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో, విద్యార్థి కార్యకర్త నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌పై స్వతంత్ర భరద్వాజ్ దాడి చేసిన సంగతి తెలిసిందే.
నిందితుని అరెస్ట్ చేయాలంటూ సిజెపి నేతలు, కార్యకర్తలు శుక్రవారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ నుండి ఢిల్లీ పోలీసులు శుక్రవారం అతనిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. బాధితురాలు మైనర్ అని పేర్కొంటూ వచ్చిన ఫిర్యాదు ఆధారంగా, భరద్వాజ్‌పై పోక్సో చట్టం కింద ఢిల్లీ పోలీసులు తాజాగా మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గతంలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టాన్ని కూడా చేర్చారు.



