రూ.20 కోట్లతో పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తాం: మంత్రి జూపల్లి కృష్ణారావు
నవతెలంగాణ -ముధోల్
తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా వచ్చే ఏడాది జూన్ 27 నుంచి నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో విస్తృత ఏర్పాట్లు చేపడుతోందని రాష్ట్ర మద్యం, ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం మంత్రి బాసర దేవాలయంలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన అనంతరం మీడియాతో మాట్లాడారు. పుష్కరాలకు ఏడాది ముందుగానే మౌలిక వసతులు, పుష్కర ఘాట్లు, ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
బాసరలో పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు రూ.20 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పుష్కర ఘాట్ల నిర్మాణం, విస్తరణ, మరమ్మతులు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గోదావరి నదీమాతకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిఆలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రూ.354 కోట్లతో చేపట్టనున్న ఆలయ సమగ్ర అభివృద్ధి, నూతన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేయటం జరిగింది అన్నారు. అంతకు ముందు ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆనతంరం వివిధ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆలయ ప్రాంగణాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడంతో పాటు భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. భవిష్యత్‌లో పెరగనున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన మౌలిక వసతులను ముందుగానే ఏర్పాటు చేయాలని సూచించారు.

గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తుల సౌకర్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పుష్కర ఘాట్లను అవసరమైన మేరకు విస్తరించడంతో పాటు, కొత్త ఘాట్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టాలని అన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మహిళల కోసం ప్రత్యేక డ్రెస్సింగ్ రూములు, మరుగుదొడ్లు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రధాన పుష్కర ప్రాంతాల్లో 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, అవసరమైన వైద్యులు, అత్యవసర మందులు, అంబులెన్స్‌లను ముందుగానే సిద్ధంగా ఉంచాలని మంత్రి సూచించారు.
భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ, దేవాదాయ, వైద్య, మున్సిపల్ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అన్నారు. పుష్కర ప్రాంతాల్లో నిరంతర పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని, భక్తులకు నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏడాది ముందుగానే పనులు ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పుష్కరాల కోసం దాదాపు రూ.1,000 కోట్లతో వివిధ అభివృద్ధి, మౌలిక వసతుల పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. పుష్కరాల ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రజాభవన్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి జాప్యం లేకుండా పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
బాసరతో పాటు గోదావరి నదీ తీర జిల్లాల్లోని మొత్తం 12 ప్రాంతాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. పుణ్యస్నానాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్ల అభివృద్ధితో పాటు భద్రతా చర్యలను పటిష్ఠం చేయనున్నట్లు చెప్పారు. పుష్కరాల కోసం చేపడుతున్న అన్ని అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. పనుల నాణ్యత, పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమించినట్లు వెల్లడించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
పుష్కరాల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బాసర గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, పుష్కర ఘాట్ల అభివృద్ధి, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన మ్యాపులు, ప్రతిపాదనలు, పనుల పురోగతిని మంత్రి జూపల్లి కృష్ణారావుకు వివరించారు. నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేసి, పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్సీ దండే విఠల్, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, మాజీ కేంద్రమంత్రి డాక్టర్ వేణుగోపాల చారి, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్ ,విట్టల్ రెడ్డి, అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయి కిరణ్, ఆలయ ఈవో అంజనా దేవి, తహసీల్దార్ పవన్ చంద్ర, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.



